logo

ముఖ్యమంత్రి గారూ.. బటన్‌ నొక్కేస్తే నీళ్లిచ్చినట్లేనా..

ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్‌ ఊదరగొట్టారు.

Updated : 07 May 2024 07:29 IST

ఉద్దానానికి ఉపరితల జలాలంటూ ప్రచారం
సగం గ్రామాలకు కూడా అందని వైనం
న్యూస్‌టుడే, శ్రీకాకుళం

ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్‌ ఊదరగొట్టారు. ఆ మేరకు మెగా వాటర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని గతేడాది డిసెంబర్‌ 14న సీఎం ఆర్భాటంగా బటన్‌ నొక్కి ప్రారంభించేశారు. ఇంకా చాలా వరకు ట్యాంకులు, ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో మూడో వంతు గ్రామాలకు ఉపరితల జలాలు అందట్లేదు. మిగిలిన ప్రాంతాలకూ నామమాత్రంగా రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా జరుగుతోంది. ఈ పథకం రెండేళ్ల కిందటే అందుబాటులోకి రావాల్సి ఉన్నా సకాలంలో నిధులు సమకూర్చలేకపోయారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది.

జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్న మండలాలైన కవిటిలో 89, కంచిలిలో 90, మందసలో 87, వజ్రపుకొత్తూరులో 47, సోంపేటలో 28, ఇచ్ఛాపురంలో 23, పలాసలో 24 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించాలి. జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో భాగంగా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. బిల్లుల చెల్లింపులో సమస్య కారణంగా అవి ఇప్పట్లో పూర్తి చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరో రెండు, మూడేళ్లు దాటితే తప్ప ఉద్దానం వాసులకు ఉపరితల జలాలు అందించే అవకాశం లేకుండా పోయింది. 807 గ్రామాలకు 499 చోట్ల ఇంటింటా కుళాయి పనులు చేపట్టారు. అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. మరో 308 గ్రామాల్లో పనుల పూర్తికి మల్లగుల్లాలు పడుతున్నారు.  


ఇదీ పరిస్థితి..

  • ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పరిధిలో ఉపరితల జలాల పంపిణీకి కొత్తగా ట్యాంకు నిర్మించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్మించిన పాత ఉద్దానం ట్యాంకు ద్వారా ఇక్కడికి నీటి సరఫరాకు పైపులైన్‌ పనులు చేపట్టారు. కొత్త ట్యాంకు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో నీరందే అవకాశం లేదు. ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది.
  • కంచిలి మండలం జలంత్రకోట వద్ద నిర్మిస్తున్న గ్రౌండ్‌ లెవెల్‌ బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇక్కడ ఓవర్‌హెడ్‌ సర్వీసు రిజర్వాయర్‌ ట్యాంకు నిర్మాణం పనులు పూర్తి కాలేదు. గిరిజన గ్రామాలకు సంబంధించి నీటి సరఫరాకు ఇప్పటికీ అవకాశం లేదు.
  • హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు తీసుకురావడానికి 140.42 కి.మీ. మేర ప్రధాన పైపులైన్‌ ఏర్పాటు చేశారు. 866.08 కి.మీ. మేర అంతర్గత పైపులైన్‌ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని