logo

చేయూత అందించడానికి చేతులు రాలేదు..!

ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన  వి.వైకుంఠరావు వెల్డింగ్‌ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు.

Published : 08 May 2024 05:10 IST

జగన్‌ పాలనలో యువత ఆశలకు సమాధి
స్వయం ఉపాధి రుణాలకు ఎసరు
ఉత్సవ విగ్రహాలుగా మారిన ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు
న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన  వి.వైకుంఠరావు వెల్డింగ్‌ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు. ప్రభుత్వం రాయితీపై రుణం అందిస్తే స్వయం ఉపాధి పొందుతూ మరో నలుగురికి పని ఇప్పించగలనని చెబుతున్నాడు. ఐదేళ్లుగా అతనికి ఎదురుచూపులే మిగిలాయి.

శ్రీకాకుళం నగరంలోని కొత్త హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన కె.లక్ష్మణరావు కారు డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీసీ కార్పొరేషన్‌ రాయితీపై రుణం మంజూరు చేస్తే సొంతంగా కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని ఆశ పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

జగన్‌ వేదిక ఎక్కగానే ‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’.. అంటూ ఆయా సామాజిక వర్గాలను ఉద్దరిస్తున్నట్లు ప్రసంగిస్తుంటారు. వారికి చేయూత అందించడానికి మాత్రం ఆయనకు చేతులు రాలేదు. జిల్లాలో ప్రభుత్వ సాయంతో స్వయం ఉపాధి పొందాలని ఎదురుచూస్తున్న పేద వృత్తి నిపుణులు వేల సంఖ్యలో ఉన్నారు. వాహనాల కొనుగోలు, దుకాణాల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణం మంజూరుకు సంబంధించిన ప్రకటన ప్రభుత్వం జారీ చేయకపోవడంతో ఉసూరుమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఏటా రుణాలు పంపిణీ చేశారు. వైకాపా పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. కులాలు, ఉప కులాలు వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించడానికే పరిమితమయ్యారు. వారి పదవీ కాలం రెండుసార్లు పొడిగించినా ఆయా కులాల పరిధిలో యువతకు స్వయం ఉపాధి చూపలేకపోయారు.

గతం ఘనం..

తెదేపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో నిరుద్యోగులకు రాయితీతో కూడిన రుణాలు అందేవి. యూనిట్ వ్యయంలో పది శాతం లబ్ధిదారు చెల్లిస్తే రుణం మంజూరయ్యేది. 50 శాతం రాయితీ కాగా.. మిగిలిన మొత్తానికి నామమాత్రపు వడ్డీ వేసేవారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందుతూ వాయిదాల రూపంలో చెల్లించేవారు. వైకాపా పాలనలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. నవరత్నాల పేరిట మంజూరు చేసిన పథకాలను కులాల వారీగా విభజించి లబ్ధి పొందుతున్నట్లు చెబుతున్నారు. స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు మంజూరు చేయలేదు.

దరఖాస్తుల బుట్ట దాఖలు

2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 11,833 మందికి రూ.63.31 కోట్ల మేర స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడితే ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న వారు, రోజు కూలీ చేసుకుంటూ స్వయం ఉపాధి చూసుకోవాలనుకునే వారు సుమారు 50 వేలకు పైగానే ఉంటారు. ఐదేళ్లలో ఉద్యోగ నియామక ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగులు రోజు కూలీ, ప్రైవేటు పనులపై ఆధారపడుతున్నారు. 

రాయితీ మాత్రమే..

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీల్లో నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2019-23 వరకు మొక్కుబడిగా ఇచ్చిన స్వయం ఉపాధి రుణాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా రాయితీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు