logo

చేసింది తక్కువ.. చెప్పింది ఎక్కువ..!

జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు.

Published : 08 May 2024 05:24 IST

జిల్లాను తానే అభివృద్ధి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం
ఇచ్ఛాపురంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, సోంపేట, న్యూస్‌టుడే: జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు. రాజకీయ విమర్శలు, గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారని పలువురు పేర్కొన్నారు.

జగన్‌ ఏమన్నారు.. ఏం జరిగింది..

  • ‘మూలపేట వద్ద రూ.4,400 కోట్లతో పోర్టు నిర్మాణ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి.’ ఓ ప్రైవేటు కంపెనీకి సర్వం అప్పగించి జేబు సంస్థగా మార్చుకున్నారు. సామగ్రి సమకూర్చే గుత్తేదారుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అక్కడి బాధితులకు పరిహారం అందించకుండా కాలయాపన చేస్తున్నారు.
  • ‘బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్‌ హార్బర్లు వస్తున్నాయి.’ ఐదేళ్లుగా గుర్తుకు రాని పనులు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఆర్భాటం చేస్తున్నారు. బుడగట్లపాలెం వద్ద నత్తనడకన సాగుతున్నాయి. మంచినీళ్లపేట వద్ద పనులను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.
  • ‘రూ.80 కోట్లతో కిడ్నీ ఆసుపత్రి పరిశోధనా కేంద్రానికి పునాది వేసి పూర్తి చేశాం’. తెదేపా హయాంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో నెఫ్రోప్లస్‌ ఆధ్వర్యంలో ఒప్పంద ప్రాతిపదికన ప్రారంభించిన డయాలసిస్‌ తప్ప జగన్‌ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన వైద్య సేవల్లో ఒక్కటీ అందడం లేదు. కిడ్నీ సమస్య మూలాలు తెలుసుకోవడానికి పరిశోధనలు శూన్యం. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులే లేరు. ఆర్భాటంగా నిర్మించిన భవనం తప్ప పూర్తిస్థాయిలో వైద్యం అందుబాటులోకి రాలేదు.
  • ‘రైతులకు న్యాయం చేశాం’. రెండు పంటలకు సాగునీరందిస్తామని మోసం చేశారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులను అనుసంధానం చేయకుండా సాగునీరు ఇవ్వకుండా ముంచేశారు. అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్ల పనులు పూర్తిచేయలేకపోయారు. నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించలేదు. ఈదుపురం ఎత్తిపోతల పథకం, పైడిగాం ప్రాజెక్టును గాలికొదిలేశారు.
  • ‘దశాబ్దాలుగా నెలకొన్న ఉద్దానం సమస్యను పరిష్కరించాం. రూ.780 కోట్ల ఖర్చు చేసి హిరమండలం నుంచి నీరందించాం’. మెగా వాటర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు వస్తున్నాయని ఆగమేఘాలపై బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఇప్పటికీ చాలావరకు ట్యాంకులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయలేదు. మూడో వంతు గ్రామాలకు ఉపరితల జలాలు అందని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు రోజులకు ఒకసారే కొన్ని గ్రామాలకు నీరు అందిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు