logo

పోలింగ్‌కు 48 గంటల ముందు కీలకం

పోలింగ్‌ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి పేర్కొన్నారు.

Published : 10 May 2024 06:21 IST

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి, చిత్రంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పోలింగ్‌ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.  విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 48 గంటల ముందు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, అయిదుగురికి మించి ఒక చోట ఉండకూడదన్నారు. ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలవారు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్‌ చివరి దశ తనిఖీలు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర నియోజకవర్గాల వాహనాలు ప్రవేశించకుండా, డబ్బు, మద్యం రవాణా కాకుండా చూడాలన్నారు. రూ.50 వేలకు పైగా నగదు, రూ.10 వేలకు పైగా విలువైన వస్తువులు రవాణా చేస్తే వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, తరలించడం వంటివాటిపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాత్రి వేళలో ప్రత్యేక నిఘా పెట్టి సీ-విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో పోలీసు పరిశీలకులు దిగంబర్‌ ప్రధాన్‌, సత్యంద్ర పటేల్‌, నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు సందీప్‌కుమార్‌, శరవణ్‌కుమార్‌, కోమల్‌ జిత్‌ మీనా, నవీన్‌కుమార్‌ సోనీ, ఎస్పీ రాధిక పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు