విమానాశ్రయంలో విసుగు ఉండదిక!
చెన్నై విమానాశ్రయంలో అత్యాధునికగా కొత్త టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. గతేడాదే ఇది ప్రయాణికుల కోసం తెరవాల్సిఉండగా.. పలు ఇబ్బందులతో ఆలస్యంగా ముందుకు తెస్తున్నారు.
సిద్ధమైన చెన్నై విమానాశ్రయ కొత్త టెర్మినల్
ట్రయల్‌రన్‌లో అధికారులు తలమునకలు
చెన్నై విమానాశ్రయంలో అత్యాధునికగా కొత్త టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. గతేడాదే ఇది ప్రయాణికుల కోసం తెరవాల్సిఉండగా.. పలు ఇబ్బందులతో ఆలస్యంగా ముందుకు తెస్తున్నారు. నిర్మాణాల హంగులు అన్నీ పూర్తయినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈనాడు-చెన్నై
విమానాశ్రయ కొత్త టెర్మినల్ వినూత్న ఇంటీరియర్ డైజైనింగ్‌తో ముందుకొస్తోంది. ఇందులో ఉన్నవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఆధునికత జతకట్టి తీర్చిదిద్దారు. కొత్త టెర్మినల్ లోపల విస్తారంగా స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు పెద్దసంఖ్యలో వచ్చినా.. దానికి తగ్గట్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన అద్దాలతో తనిఖీ ప్రాంతాన్ని కట్టారు. ఒకేసారి ఆ క్యాబిన్‌లోకి ఇద్దరు ప్రయాణికులు వెళ్లేలా డిజైన్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఇది అత్యాధునిక వ్యవస్థ అని, క్యూలైన్‌లను వెంటనే పంపించేందుకు ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు.
చెక్ ఇన్ ప్రాంతంలో సౌర విద్యుత్తు దీపాల వెలుగులు
వినూత్న టైల్స్
గోడలకు చెక్క, ఇతర టైల్స్ కలిపి వినూత్నంగా తీర్చిదిద్దారు. విపరీత శబ్దాలు ప్రసరించకుండా ఈ తరహా డిజైన్లకు వెళ్లినట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. టెర్మినల్ లోపల నల్ల గ్రానైట్‌ని విరివిగా వాడారు. అక్కడక్కడ రంగుల గ్రానైట్ డిజైన్లతో ముస్తాబు చేశారు. మొత్తానికి లోపలికొచ్చిన ప్రయాణికులు ఉపశమనం పొందే వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. కొత్త టెర్మినల్ పనులన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం అన్నికోణాల్లో ముగింపు పరీక్షలు జరుగుతున్నాయి. ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
గృహ గుర్తింపు
విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న అధునాత టెర్మినల్‌కు వినూత్న గుర్తింపు లభించింది. ఈ నిర్మాణాలు పర్యావరణహితంగా ఉన్నాయంటూ ‘గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్‌మెంట్ (గృహ)’ ఆధ్వర్యంలో 4 స్టార్ రేటింగ్ దక్కింది. విద్యుత్తు ఆదా చర్యలు, వ్యర్థాల నివారణ, హరిత విద్యుత్తు నేపథ్య చర్యలు, రవాణా, సుదీర్ఘకాలంగా మన్నే ప్రయత్నాల నేపథ్యంలో ఈ రేటింగ్ దక్కినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి టెర్మినల్ భవనాలతో ఎలాంటి పర్యావరణ ముప్పు లేదని రేటింగ్‌లో గుర్తింపు ఇచ్చినట్లుగా వెల్లడించారు. విమానాశ్రయంలో ఇప్పటికీ పునర్వినియోగ (రీసైకిల్) నీటిని వాడుతున్నారని, కొత్తగా రూపొందే టెర్మినల్స్‌లో సౌర వెలుగులు ఏర్పాటు చేస్తున్నారని, వెలుగును బట్టి సెన్సార్ల ద్వారా విద్యుత్తు దీపాలు వెలిగే సౌకర్యాన్ని తెచ్చారని అంటున్నారు.
తరంగం ఆకారంలో టెర్మినల్ పైకప్పు
మెట్రో నుంచే హాయిగా..
విమానాశ్రయం ముందున్న మెట్రో రైల్వేస్టేషన్‌లోనే చెకిన్ సౌకర్యాన్ని కల్పించి.. ప్రయాణికుల లగేజీని అక్కడే ఎయిర్‌లైన్స్ వారికి అందజేసే సౌకర్యం కల్పించేలా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులతో చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ శరద్‌కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాల్ని సేకరించారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కమిటీని నియమించబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మెట్రో స్టేషన్ నుంచే ఎలాంటి బ్యాగుల చింతా లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ కేంద్రాలు
విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేసిన దేశంలోనే తొలి విమానాశ్రయంగా చెన్నై గుర్తింపు పొందింది. చెన్నై విమానాశ్రయం, ఇండియన్ ఆయిల్ సంస్థ సంయుక్తంగా కలిసి వీటిని ఏర్పాటుచేశారు. విద్యుత్తు వాహనదారులు మొబైల్ యాప్ ద్వారా, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డుల ద్వారా ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందేలా ఏర్పాట్లు చేశారు.
పార్కింగ్ సౌలభ్యం
ఎయిర్‌పోర్ట్ ఆవరణలోనే ఉన్న మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది. ఏ తరహా వాహనాలు ఎక్కడ నిలపాలనే విధానాన్ని కూడా అమలుపరుస్తున్నారు. తూర్పువైపు గ్రౌండ్‌ప్లోర్ నుంచి 5వ అంతస్తు, దానిపై టెర్రస్ భాగం పూర్తిగా విమానాశ్రయ ప్రయాణికుల కార్లకు ఇచ్చారు. పశ్చిమం వైపు పార్కింగ్‌లో గ్రౌండ్‌ప్లోర్, 2, 5వ అంతస్తులు, టెర్రస్ పూర్తిగా ప్రయాణికుల కార్లకు ఇచ్చారు. మిగిలిన 1వ అంతస్తు ద్విచక్ర వాహనాలకు, 3వ అంతస్తు విమానాశ్రయ కార్లకు, 4వ అంతస్తు కమర్షియల్ కార్లకు, విమానాశ్రయ కార్లకు ఇచ్చారు. దీన్నిబట్టే రుసుములు తీసుకుంటున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
భద్రతా దళాల నుంచి విమానాశ్రయ అధికారులకు కీలక ఆదేశాలు వచ్చాయి. ఈనెల 30వ తేదీ వరకు విమానాశ్రయంలోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ప్రయాణికుల్ని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ప్రయాణాలు చేసేవారు.. నిర్ణీత సమయానికన్నా ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సందేశాలు పంపుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/01/23)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు