logo

అబ్బురపరుస్తున్న గిండి స్నేక్‌ పార్క్‌

చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్‌ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్‌లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Published : 26 Apr 2024 01:03 IST

త్రీడీ దృశ్యాలతో సందర్శకుల ఆనందం

వీఆర్‌, ఏఆర్‌ దృశ్యాలను త్రీడీలో చూస్తున్న సందర్శకులు

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్‌ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్‌లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్క్‌ను 1972లో ఎకరా విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పారు. ఇక్కడ సర్పాలు, మొసళ్లు, ఊసరవెల్లిలు, తొండలు, ఉడుములు మొదలైన 32 రకాల 300 ప్రాణులు ఉన్నాయి. ఇక్కడున్న 40 ఏళ్ల వయసున్న ఉప్పు నీటి మొసలి, 25 ఏళ్ల వయసున్న దక్షిణ ఆసియా కొండచిలువ ప్రధాన ఆకర్షణ. ఈ కొండ చిలువ 3 సార్లు ఒక్కోసారి 40 గుడ్ల చొప్పున పెట్టి వాటిని పొదిగింది. పార్క్‌లో పాముల రకాల గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. త్వరలో అనకొండను తీసుకొచ్చి సందర్శనకు ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ వన్యప్రాణుల కమిషన్‌ అనుమతి కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా వన్య ప్రాణులను దగ్గరగా చూసి తాకినట్లు అనుభూతి పొందే విధంగా 3డీ దృశ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో వీఆర్‌ అనే 3డీ, వర్చువల్‌ రియాలిటీ షో, డైనోసార్‌ ప్రపంచం, వన్యప్రాణుల ప్రపంచం మొదలైన షోలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఏదైనా ఒక షోను ఎంపిక చేసుకుని 5 నుంచి 7 నిమిషాల వరకు తిలకించవచ్చు. ఇందుకోసం రూ.100 రుసుము నిర్ణయించారు. అంతేకాకుండా ఏఆర్‌ అనే 3డీ అగ్‌మెంటెడ్‌ రియాలిటీ షోతో వన్య ప్రాణులకు దగ్గరగా నిలబడి తిలకించే సమయంలో అవి మన దగ్గరికి వచ్చినట్లు దృశ్యాలను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించడానికి 10 నిమిషాలకు రూ.20 రుసుము వసూలు చేస్తున్నారు.

విద్యార్థుల ఆసక్తి

ఈ సందర్భంగా స్నేక్‌ పార్క్‌ డైరెక్టరు అరవళగన్‌ మాట్లాడుతూ... వన్యప్రాణులు, వాటి జీవనశైలి తెసుకోవడానికి విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, పరిశోధన కోర్సులు చదివే విద్యార్థులు పార్క్‌కు వస్తున్నారని, ఇక్కడున్న కొన్ని తొండలను పవన్యప్రాణుల మార్పిడి పథకం కింద మరో పార్కుకు అందజేసి అక్కడి అనకొండను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 3డీ సాంకేతికత దృశ్యాలను ప్రవేశపెట్టామని, ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. పార్క్‌ సందర్శనకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.10, ఫొటోలు తీసుకోవడానికి రూ.20, వీడియోలు చిత్రీకరించడానికి రూ.100 వసూలు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని