logo

విజయ్‌కు ఎగ్జిబిటర్‌ శక్తివేల్‌ శుభాకాంక్షలు

విజయ్‌ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Published : 26 Apr 2024 01:00 IST

విజయ్‌ను సత్కరిస్తున్న శక్తివేలన్‌

చెన్నై: విజయ్‌ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్‌ శక్తివేలన్‌.. నటుడు విజయ్‌ను కలిసి పూలమాలతో సత్కరించి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్‌ పేజీలో పోస్టు చేశారు. సినీరంగం శ్రేయోభిలాషిగా తన నటనను విజయ్‌ కొనసాగించాలనే ఆకాంక్షను వెల్లడించానని ఎక్స్‌ పేజీలో శక్తివేలన్‌ తెలిపారు.


బిల్లా రీ రిలీజ్‌ మే 1న

సినిమాలో ఓ సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: అజిత్‌ ద్విపాత్రాభినయంలో 2008లో విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన చిత్రం ‘బిల్లా’. విష్ణువర్ధన్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో నయనతార, నమిత, ప్రభు, సంతానం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం 1980లో రజనీకాంత్‌ నటించిన ‘బిల్లా’కు పునర్నిర్మాణం కావడం గమనార్హం. అజిత్‌ పుట్టినరోజు మే 1న ఆయన నటించిన ‘బిల్లా’ను మళ్లీ విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150 థియేటర్లలో ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు.


అభిమాని కుటుంబానికి జయం రవి పరామర్శ

అభిమాని కుటుంబంతో జయం రవి

చెన్నై: చెన్నై కేకే నరగ్‌కు చెందిన జయం రవి అభిమాన సంఘం అధ్యక్షుడు రాజా (30) అనారోగ్యంతో ఇటీవల మరణించారు. సమాచారం తెలిసిన జయం రవి అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు హామీ ఇచ్చారు.


రాష్ట్ర సరిహద్దులో సమస్యపై ‘రత్నం’ సినిమా

దర్శకుడు హరి

మాట్లాడుతున్న దర్శకుడు హరి

వేలూర్‌, న్యూస్‌టుడే: ఆంధ్రా - తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పడే సమస్యలపై ‘రత్నం’ సినిమాను వేలూర్‌ జిల్లాలో చిత్రీకరించామని సినిమా దర్శకుడు హరి తెలిపారు. వేలూర్‌ విష్ణు థియేటర్‌లో శుక్రవారం విడుదల కానున్న విశాల్‌ నటించిన ‘రత్నం’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం వేలూర్‌ విరుదంబట్టులోని విష్ణు థియేటర్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరి విలేకరులతో మాట్లాడుతూ... రత్నం తన 17వ చిత్రమని, విశాల్‌తో 3వ చిత్రంగా పేర్కొన్నారు. ఈసారి వైవిధ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆంధ్రా - తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో నెలకొంటున్న సమస్యలపై కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. పూర్తిగా వేలూర్‌ జిల్లాలో చిత్రీకరించామని, ఇందుకు జిల్లా రాజకీయ ప్రముఖుల సహకారం కూడా తీసుకున్నామని చెప్పారు.


‘వడకన్‌’ టీజర్‌ విడుదల

చిత్రం పోస్టర్‌

చెన్నై: రచయిత భాస్కర్‌ శక్తి దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘వడకన్‌’. డిస్కవరీ సినిమాస్‌ మూ.వేడియప్పన్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కుంగుమ రాజ్‌ నాయకుడిగా, వైరమాల నాయికగా పరిచయమవుతున్నారు. రాష్ట్రంలో పనిచేసే వలస కూలీల జీవితగాథ నేపథ్యంతో చిత్రం తెరకెక్కింది. లింగుసామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌ సంస్థ చిత్రాన్ని విడుదల చేస్తుంది. చిత్రం టీజర్‌ను దర్శకుడు లింగుసామి తన ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు.


మే 3న కురంగు పెడల్‌...

చెన్నై: కమలకణ్ణన్‌ దర్శకత్వంలో నటుడు శివకార్తికేయన్‌కు చెందిన ఎస్కే ప్రొడక్షన్‌ నిర్మించిన చిత్రం ‘కురంగు పెడల్‌’. చిత్రంలో కాళి వెంకట్‌ ప్రధానపాత్ర పోషించారు. రాశి అళగప్పన్‌ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ నేపథ్యంలో చిత్రం మే 3న విడుదలకానుందని దర్శకుడు కమలకణ్ణన్‌ తన ఎక్స్‌ పేజీలో ప్రకటించారు.


స్టార్‌ పాట...

చెన్నై: ఇళన్‌ దర్శకత్వంలో కవిన్‌ ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘స్టార్‌’. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతలను అలరించాయి. ఈ నేపథ్యంలో నాలుగో పాట ‘జిమిక్కి గజల్‌్’ పాట లిరిక్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటను నేహా గిరిశ్‌ పాడారు. పాటను నిరంజన్‌ భారతి, హఫీస్‌ హోసియాపురి సంయుక్తంగా రాశారు. చిత్రం మే 10న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని