logo

కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు

మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Updated : 26 Apr 2024 05:08 IST

సిద్ధమవుతున్న సీఎంఆర్‌ఎల్‌

విహంగ వీక్షణం

న్యూస్‌టుడే, వడపళని: మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో దశలోని అయిదో మార్గంలో కత్తిపార కూడలి గుండా ట్రాక్‌ నిర్మాణం జరగనుంది. చెన్నై మహానగరంలో కత్తిపార కూడలి వద్ద పలు ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా పైవంతెన ఉంది. ఈ వంతెనపై నిత్యం వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. ఇప్పటికే ఇక్కడ మెట్రో మొదటి దశ మార్గంలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. రెండో దశ 5వ మార్గంలో ఇక్కడ ట్రాక్‌ నిర్మాణానికి సీఎంఆర్‌ఎల్‌ సన్నద్ధమవుతోంది.

ఏఏఐ అనుమతి మేరకే నిర్మాణం

ఈ కూడలిలో రెండో దశలో పనుల కోసం ‘కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ’, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి తీసుకున్నట్టు సీఎంఆర్‌ఎల్‌ అధికారి ఒకరన్నారు. ఈ ప్రాంతంలో విమానాలు చాలా దగ్గరి నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి కావున పిల్లర్ల నిర్మాణ సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పారు. ఏఏఐ అనుమతించిన ఎత్తు వరకే నిర్మాణం కూడా జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మెట్రో మొదటి దశలో ఉన్న మార్గానికి దగ్గరగా నిర్మాణం జరుగుతుందని, అందుకోసం ‘కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ’ నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో రైళ్లు నడవని సమయంలో అంటే అర్ధరాత్రి నుంచి ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజాము వరకు పనులు జరుగుతాయని తెలిపారు.

కత్తిపారా కూడలిలో జరుగుతున్న మెట్రో పనులు

రెండో దశలో జరుగుతున్న పనులు పూర్తి కాగానే మాధవరం, అన్నానగర్‌, విల్లివాక్కం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలైన మడిపాక్కం, కీల్‌కట్టలై, మేడవాక్కం, షోలింగనల్లూరుకు సులువుగా చేరుకోగలరు. నాలుగో మార్గంలో లైట్ హౌజ్‌ నుంచి పూనమల్లి, మూడో మార్గంలో మాధవరం నుంచి తిరుమయిలై మీదుగా సిప్కాట్ వరకు పనులు వేగంగా సాగుతున్నాయి.

సవాలుతో పనులు

కత్తిపార కూడలిలో మొదటి దశలో ఉన్న మార్గానికన్నా బాగా ఎత్తులో రెండో దశ మార్గం నిర్మాణం కానుంది. నగరంలో పలు ప్రాంతాలకు ప్రధానంగా ఉన్న ఈ పైవంతెన అనేక మలుపులతో కూడి ఉంది. ఇక్కడ 108 అడుగుల ఎత్తైన పిల్లర్‌పై ట్రాక్‌ నిర్మాణ పెద్ద సవాలుతో కూడుకుందని సీఎంఆర్‌ఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు. సమీపంలో ఉన్న విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ఇతర వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు