logo

పెరిగిన పోలింగ్‌ ఎవరికి లాభం?

రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి.

Published : 26 Apr 2024 01:10 IST

4 స్థానాల్లో రాష్ట్ర సగటును మించి ఓటింగ్‌
పలుచోట్ల ఉత్కంఠపోరు తప్పదంటున్న విశ్లేషకులు

రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. రెండు కూటములు కాస్తా మూడయ్యాయి. ఎవరిది పైచేయి అన్నదానిపై పోలింగ్‌ సరళి   కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ 69.72 శాతంగా నమోదైంది.   ఈ సగటుకు మించి ఓటింగ్‌ జరిగిన స్థానాల్లో  రాజకీయ పార్టీ పోటీని చూస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి.

ఈనాడు-చెన్నై

రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. ఏకంగా 24 స్థానాల్లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా ఓటింగ్‌ నమోదైంది. ప్రధాన కూటముల్ని నడిపే అగ్రపార్టీల పరిస్థితి ఈ స్థానాల్లో ఎలా ఉందని పరిశీలిస్తే.. రాష్ట్ర సగటుకన్నా పెరిగిన పార్లమెంటు స్థానాల్లో 4 చోట్ల పోలింగ్‌ బాగా కొనసాగింది. గత ఎన్నికలతో పోల్చితే 3 స్థానాల్లో భారీగా ఓట్లు పోలవగా.. 7 చోట్ల స్వల్పంగా తగ్గింది. మిగిలిన నియోజకవర్గాల్లో గతంకన్నా పోలింగ్‌ బాగా తగ్గింది. మరో కోణంలో చూస్తే.. ఈ 24 ప్రభావిత కేంద్రాల్లో భాజపా లేకుండా డీఎంకే, అన్నాడీఎంకే నేరుగా 8 స్థానాల్లో పోటీపడుతున్నాయి. మరో 6 స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా నేరుగా బరిలో నిలిచాయి.

ఎవరి ప్రభావం..

డీఎంకే, అన్నాడీఎంకే నేరుగా పోటీ చేస్తున్న స్థానాల్లో ఓ పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేకించి 4 లోక్‌సభ స్థానాల్లో భారీగా పోలింగ్‌ జరిగింది. ధర్మపురి(81.20శాతం), కళ్లకురిచ్చి(79.21శాతం), సేలం(78.16శాతం), వేలూరు (73.53శాతం) ఆ జాబితాలో ఉన్నాయి. వేలూరు మినహా మిగిలిన 3చోట్లా పీఎంకే బరిలో ఉండటం విశేషం. ఆ స్థానాల్లో భారీగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రావడం ఎవరివైపు మొగ్గు చూపుతుందోనని ఎవరికివారు అంచనాల్లో వారున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేతో ఢీకొట్టేందుకు భాజపా తమ కమలం గుర్తుపై పుదియ నీది కట్చి అధినేత ఎ.సి.షణ్ముగాన్ని వేలూర్‌ నుంచి బరిలో దింపింది. ఇక్కడ కూడా పోలింగ్‌ శాతాలు పెరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అగ్రపార్టీలు బరిలో ఉన్నచోట్ల ఈస్థాయి పోలింగ్‌పై రాజకీయ నిపుణులు విశ్లేషణల్లో మునిగితేలుతున్నారు. ధర్మపురి, కళ్లకురిచ్చి, సేలం స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు దీటుగా పీఎంకే నిలవడంతో ఈసారి ఓటర్లు ఎవరి పక్షమనేది ఆసక్తిగా ఉంది. గత ఎన్నికల్లో పీఎంకే, అన్నాడీఎంకే ఒకే కూటమిలో ఉన్నా.. ఇప్పుడు వేరయ్యాయి.

ఈ స్థానాల్లో ఆసక్తికరం..

మూడు అగ్రకూటముల్లో డీఎంకే, అన్నాడీఎంకే నేరుగా పోటీపడే స్థానాల్లో కొన్నిచోట్ల గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌శాతం బాగా తగ్గింది. ఆరణి, అరక్కోణం, కాంచీపురం (ఎస్సీ), ఈరోడ్‌, తేని స్థానాల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 3, 4 శాతం పోలింగ్‌ పడిపోయిందిక్కడ. తేనిలో ఏకంగా 5.31 శాతం తగ్గింది. తేని మినహా మిగిలిన అన్నిచోట్లా గత ఎన్నికల్లో డీఎంకే పాగా వేసింది. తేనిలో మాత్రం అన్నాడీఎంకే గెలిచింది. ఈసారి ఈ స్థానాల్లో అనూహ్యంగా ఓటుశాతం తగ్గడానికి కారణాలు ఏమై  ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క.. డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కలిసి నేరుగా పోటీచేసే స్థానాల్లో.. తిరువణ్ణామలై, నీలగిరిలో సైతం పోలింగ్‌ తగ్గింది. ఈ రెండుచోట్లా గత ఎన్నికలతో పోల్చితే సుమారు 4శాతం తక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడా గతసారి డీఎంకే పాగా వేసింది. ఈసారి తెరపైకి భాజపా నేరుగా రావడం, ఈ రెండుస్థానాల్లో పోలింగ్‌ పడిపోవడం దేనికి సంకేతమనేది చర్చ సాగుతోంది. నీలగిరిలో డీఎంకే నుంచి ఏ.రాజా, భాజపా నుంచి ఎల్‌.మురుగన్‌లాంటి కీలక నేతలు పోటీలో ఉన్నారు.

హోరాహోరీనే..

మూడు కూటముల అగ్రపార్టీలు పోటీచేస్తున్న స్థానాల్లో కొన్నిచోట్ల రాష్ట్ర సగటును మించడంతో పాటు పోలింగ్‌శాతాలు గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనిపించింది. నామక్కల్‌(78.21శాతం), పెరంబలూర్‌ (77.43శాతం), పొల్లాచ్చి(70.41శాతం) ఈ కోవలో ఉన్నాయి. జనాల్లో కొంత ఆసక్తి తగ్గడం.. గతంతో పోల్చితే ఓటింగ్‌శాతం పెరగకపోవడం చూస్తుంటే.. ఎవరు గెలుస్తారనే అంచనాల్ని ఇప్పటికీ పట్టలేకున్నారు. ఫలితం హోరాహోరీగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపునకు చాలా సమయం ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని