logo

మహిళల పాలిట రక్తపోటు

అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి.

Published : 25 Apr 2024 00:20 IST

రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న మరణాలు
ప్రాణాంతకమవుతున్న కాన్పులు

అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం, పలు ఆసుపత్రుల్లో మరణాలు సంభవిస్తూనే ఉండటంతో పరిశోధనల్లో వేగం పెంచుతున్నారు. ప్రాణాల్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ముప్పు ముందే గుర్తించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది.

ఈనాడు, చెన్నై


రాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 2022-23లో తమిళనాట 479 ప్రసూతి మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 20శాతం అధిక రక్తపోటు, ప్రసవానంతర రక్తస్రావంతో చనిపోయారు. మరో 10శాతం మంది గుండె సంబంధ సమస్యలతో మృతి చెందారు. 9శాతం మంది సెప్సిస్‌, నాడీ సంబంధ రుగ్మతలతో చనిపోయారు. 8శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలు, 5శాతం మంది అబార్షన్‌, 3శాతం మంది అనీమియా కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ మరణాలపైనా నివేదికలు తెప్పించుకున్నారు. కాన్పు సమయంలో ఒకరికన్నా ఎక్కువ పిల్లలకు జన్మనివ్వడం, దీర్ఘకాలిక కార్మికుల్లాంటివి అధిక రక్తపోటుకు దారి తీస్తున్నట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. అనీమియా ఉన్న గర్భిణులకు ప్రసవానంతర రక్తస్రావం ప్రాణాలమీదకి తెస్తోందని అంటున్నారు. 2022లో కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రసూతి మరణాలు తమిళనాడులో ప్రతి లక్ష కాన్పుల్లో 58 నుంచి 54 తగ్గినట్లు వెల్లడిస్తున్నారు. ఈ మరణాలు అదుపులోకి రాకపోవడం, తీవ్రంగా వేధిస్తున్న అధిక రక్తపోటుకు కళ్లెం వేయలేకపోవడం ఆందోళనలకు గురిచేస్తోంది.

అబలలే ఎక్కువ

రాష్ట్రంలో అధిక రక్తపోటుతో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2011నాటికి అధిక రక్తపోటుతో మహిళల మరణాలు 3.9 శాతముంటే, పురుషులు 4.1శాతంగా ఉన్నారని అధికారులు వివరించారు. 2021కి వచ్చేసరికి పురుషుల మరణాలు 2.1శాతంగా ఉండగా, మహిళలు 2.4శాతం మంది మరణిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. పురుషులకన్నా మహిళలు 0.3శాతం ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. మధుమేహం కారణంగా 2021లో 4.3శాతం మంది మహిళలు చనిపోగా, 4శాతం మంది పురుషులున్నట్లు నివేదికలో వివరించారు. ఈ పరిస్థితులపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడిస్తోంది. మరోవైపు 2000-2021 మధ్య చోటుచేసుకున్న స్త్రీ, పురుషుల మరణాలపై ప్రత్యేక పరిశోధన చేశారు. 21ఏళ్లలో అధిక రక్తపోటు మరణాలు 4శాతం నుంచి 2.2శాతానికి తగ్గాయి. 2016-17 దాకా ఈ మరణాలు 8.3శాతంగా ఉండగా.. అప్పటినుంచి ఏటేటా క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు నివేదికలో తెలిపారు. మధుమేహంతో మరణించినవారి సంఖ్య చూస్తే ఏటేటా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నట్లు గమనించారు. కొవిడ్‌ ప్రబలినరోజుల్లో ఈ మరణాలు 5.8 శాతంగా ఉండగా, 2021కి 4.2 శాతానికి తగ్గినట్లు చెబుతున్నారు.

44 ఏళ్ల తర్వాత ముప్పు

  • మరణాలు ఏయే వయసుల్లో ఎక్కువగా ఉన్నాయనేదీ అధికారులు గణాంకాలు తీశారు. అధిక రక్తపోటు, మధుమేహంతో చనిపోయేవారు ఎక్కువగా 44ఏళ్ల పైబడినవారే ఉన్నట్లు వివరించారు.
  • అధిక రక్తపోటు విషయంలో.. 2020లో 15-44ఏళ్ల మధ్య 2.3శాతం మంది చనిపోగా 44ఏళ్ల పైబడినవారు 4.1శాతం ఉన్నారు. 2021లో 15-44ఏళ్ల మధ్య 1.4శాతం ఉండగా, 44ఏళ్ల పైబడినవారు 2.5శాతం మంది చనిపోయారు.
  • మధుమేహం కారణంతోనూ ఇలాగే ఉంది. 2020లో 15-44ఏళ్ల మధ్యవారు 3.2శాతం, 44ఏళ్ల పైబడినవారు 6.3శాతంగా మరణాలున్నాయి. 2021లో 15-44ఏళ్ల మధ్యవారు 3శాతం, 44ఏళ్ల పైబడ్డవారు 4.4శాతంమంది చనిపోయారు.

ఇంటి దగ్గరే ప్రభావమంతంగా..

డాక్టర్‌ టి.ఎస్‌.సెల్వవినాయగం

ప్రసూతి సమయాల్లో ప్రాణాపాయస్థితులు ఏమేర వస్తున్నాయనే కోణంలో ఆసుపత్రుల నుంచి ప్రత్యేక పరిశీలన చేయిస్తున్నామని ఆరోగ్యశాఖ చెబుతోంది. వాటిని నివారించేందుకు గ్రామీణ స్థాయినుంచే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.ఎస్‌.సెల్వవినాయగం తెలిపారు. అధిక ప్రమాద సంకేతాలతో ప్రసవానికి వచ్చే గర్భిణుల విషయంలో వైద్యపరంగా ఎలా వ్యవహరించాలనేదానిపై డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు పాటిస్తున్నట్లు ఆయన వివరించారు. గర్భిణులకు, ఇతర మహిళలకు మక్కలై తేడి మరుత్తువమ్‌ పథకంలో భాగంగా ఇళ్లదగ్గరే నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. గుర్తించినవారికి అక్కడికక్కడే వైద్యసలహాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.


ఆధునిక పరిష్కారం..

శిల్పా ప్రభాకర్‌ సతీష్‌

ప్రసూతి మరణాల్ని తగ్గించేందుకు అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయని జాతీయ ఆరోగ్య మిషన్‌ తమిళనాడు సంచాలకులు శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ చెబుతున్నారు. గర్భం, శిశు సమన్వయ పర్యవేక్షణ, మూల్యాకనం(పీఐసీఎంఈ) పద్ధతి ద్వారా గర్భిణి, పిండం స్థితిగతుల్ని తెలుసుకోగలుగుతున్నారని వివరించారు. మహిళల మరణాలకు కారణాల్ని కచ్చితంగా నిర్ధరించడానికి వీలవదని మరోమాటగా చెప్పారు. అనీమియా, అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో పాటు మానసికస్థితి కూడా కలిసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని, వారి ఆరోగ్య వివరాలు సంపాదించడంలో కొన్ని సమస్యలొస్తున్నట్లు వివరించారు. ఈ సమస్యలన్నీ అధిగమించేలా ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తోందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు