logo

తుదిదశలో వణంగాన్‌ చిత్రీకరణ

బాలా దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వణంగాన్‌’. మమితా బైజు, రోషిని ప్రకాశ్‌, సముద్రఖని, మిష్కిన్‌ తదితరులు ఇతర నటీనటులు.

Updated : 01 May 2024 01:04 IST

చిత్రం పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: బాలా దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వణంగాన్‌’. మమితా బైజు, రోషిని ప్రకాశ్‌, సముద్రఖని, మిష్కిన్‌ తదితరులు ఇతర నటీనటులు. సురేశ్‌ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. చిత్రీకరణ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. ఈ విషయాన్ని పోస్టరు ద్వారా చిత్రబృందం వెల్లడించింది.


17న తెరపైకి ఎలక్షన్‌

సినిమా పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: ‘ఉరియడి’, ‘ఉరియడి-2’, ‘ఫైట్‌ క్లబ్‌’ సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు విజయకుమార్‌. ఆయన ముఖ్యపాత్ర పోషించిన చిత్రం ‘ఎలక్షన్‌’. ‘అయోద్ది’ ఫేమ్‌ ప్రీతి అస్రాణి, రిచ్చా జోషి, ‘వత్తికుచ్చి’ దిలీపన్‌, పావెల్‌ నవగీతన్‌, జార్జ్‌ మరియం, నాచ్చియాళ్‌ సుగంధి తదితరులు నటించారు. మే 17న థియేటర్లలో విడుదల కానుందని చిత్రబృందం వెల్లడించింది. వేలూర్‌ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో చిత్రం రూపొందింది. ఎలక్షన్‌ పాట కొన్ని రోజుల కిందట విడుదలై యూట్యూబ్‌లో మిలియన్‌ వీక్షణలు దాటడం గమనార్హం.


రసవాతి ట్రైలర్‌ విడుదల

ట్రైలర్‌లోని సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: ‘మౌనగురు’, ‘మగాముని’ చిత్రాలతో కోలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శాంతకుమార్‌. మూడో చిత్రంగా ‘రసవాతి’ రూపొందించారు. అర్జున్‌దాస్‌, తన్యా రవిచంద్రన్‌ నాయకానాయికలు. రేష్మా వెంకటేశ్‌, సుజిత్‌ శంకర్‌, జి.ఎం.సుందర్‌, ఎస్‌.రమ్మ తదితరులు ముఖ్య తారాగణం. తమన్‌ సంగీతం సమకూర్చారు. జనవరిలో టీజర్‌ విడుదలవగా సోమవారం సాయంత్రం ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకులు లోకేశ్‌ కనకరాజ్‌, కార్తిక్‌ సుబ్బురాజ్‌, సంగీత దర్శకుడు అనిరుద్‌, నటులు కార్తి, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు తమ ఎక్స్‌ పేజీల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. 10న థియేటర్లలో ప్రదర్శితమవనుంది.


వైవాహిక జీవితంలోకి నటుడు జై?

జై పోస్టు చేసిన ఫొటో

చెన్నై, న్యూస్‌టుడే: ‘న్యూ లైఫ్‌ స్టార్టెడ్‌.. విత్‌ గాడ్స్‌ బ్లెసింగ్స్‌’ అనే వాక్యాన్ని జోడించిన ఫొటోను నటుడు జై తన ఎక్స్‌ పేజీలో పోస్టు చేయడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. దానికి కారణం, ఆ ఫొటోలో నటి ప్రగ్యా నాగ్రతో కలిసి ఉండగా ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వేలాడుతూ కనిపించడమే. ప్రగ్యా నాగ్రను వివాహం చేసుకున్న విషయాన్ని ఇలా ఫొటోతో కూడిన వ్యాఖ్యతో జై సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. నిజంగానే నటిని పెళ్లి చేసుకున్నారా? లేక ఏదైనా సినిమా ప్రమోషనా? అనే అనుమానాలూ తెరపైకి వచ్చాయి. ప్రగ్నా నాగ్ర తమిళంలో ‘వరలారు ముక్కియం’, ‘ఎణ్‌4’ తదితర చిత్రాల్లో నటించారు.


చిచ్చుపెట్టిన ఏది గొప్ప?

వైరముత్తు, గంగై అమరన్‌

చెన్నై, న్యూస్‌టుడే: సంగీతం గొప్పదా? భాష గొప్పదా? అనే అంశం తమిళ చిత్రసీమలో చిచ్చు రాజేసింది. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంగీతం గొప్పదా? భాష గొప్పదా? అనే అంశంపై ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తు మాట్లాడారు. రెండు గొప్పవేనని చెబుతూనే భాష లేకుండా సంగీతం లేదనే విషయాన్ని చెప్పారు. ఇది గ్రహిస్తే జ్ఞాని అని, లేకుంటే అజ్ఞాని అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, గేయరచయిత, సంగీత దర్శకుడైన గంగై అమరన్‌ స్పందించారు. తమ ద్వారా ఎదిగిన వ్యక్తి నేడు ఆ చోటునే కాళ్ల కింద తొక్కేలా వైరముత్తు వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఆయన పాటలకు ఎక్కువ ఖ్యాతి రావడంతో గర్వం తలకెక్కిందని, అదుపు చేసే వ్యక్తులు లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇళయరాజా లేకుంటే వైరముత్తు పేరు కనిపించేది కాదన్నారు. ఇళయరాజా గురించి ఆరోపణలు, లోపాలు చెప్పేలా ఉంటే దాని పరిణామాలను వైరముత్తు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇకపై నోరు మూసుకుని పని చేసుకుంటే మంచిదనీ హెచ్చరించారు.


నటుడు నాజర్‌ పేరుతో నగదు మోసం

పోలీసులకు నడిగర్‌ సంఘం ఫిర్యాదు

ప్యారిస్‌: సినీ నటుడు నాజర్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ సామాజిక మాధ్యమాల్లో కొందరు నగదు మోసానికి పాల్పడుతున్నట్లు నడిగర్‌ సంఘం తరఫున పోలీసులకు ఫిర్యాదు అందింది. నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పేరుపై కొందరు నకిలీ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాలు తెరిచి నగదు మోసానికి పాల్పడుతున్నట్లు తెలియడంతో సెయింట్‌ థామస్‌ మౌంట్‌ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ఆందోళన

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ‘విడుదలై 2’ సినిమాలో నటించిన జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు డబ్బులు ఇవ్వకపోవడంతో అర్ధరాత్రి గొడవకు దిగారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి తదితరులు నటిస్తున్న చిత్రం ‘విడుదలై 2’. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తెన్‌కాశిలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు మదురై నుంచి జూనియర్‌ ఆర్టిస్ట్‌లు వెళ్లారు. వారికి మాట్లాడినంత డబ్బులు ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో వారు తెన్‌కాశి రైల్వేస్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి చిత్ర ప్రొడక్షన్‌ విభాగంతో గొడవకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని