logo

మెట్రో ప్రయాణికులకు ఎన్‌సీఎంసీ కార్డులు

చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌) కల్పిస్తోంది.

Published : 01 May 2024 01:16 IST

కొత్తగా వచ్చేవారికి ‘స్మార్ట్‌ కార్డు’ల నిలిపివేత
సీఎంఆర్‌ఎల్‌ నిర్ణయం
న్యూస్‌టుడే, వడపళని

ఎన్‌సీఎంసీ కార్డు

చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌) కల్పిస్తోంది. అందులో భాగంగా స్మార్ట్‌ లేదా ట్రావెల్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌ విధానం, యాప్‌, పేటీఎం, ఫోన్‌పే వంటివి అందుబాటులోకి తెచ్చింది. అన్ని విధాలైన రవాణా, ఇతరత్రాలకు వీలుగా ‘నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌’ (ఎన్‌సీఎంసీ)ని బాగా ప్రాచుర్యంలోకి తేవాలనే ఉద్దేశంతో తాజాగా స్మార్ట్‌ కార్డులకు స్వస్తి పలికింది. అయితే ఇప్పటికే స్మార్ట్‌ కార్డులున్న వారు రీఛార్జ్‌ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఇకపై కొత్తగా ఇచ్చే వారికి జారీ చేయరు.

అధికంగా వినియోగం

‘ఎన్‌సీఎంసీ’ కార్డు ప్రయాణికులకు అన్ని రకాల రవాణాలకు వీలుగా ఉంటుందని కొత్తగా వచ్చేవారికి ఆ కార్డులనే అందజేయనున్నట్టు సీఎంఆర్‌ఎల్‌ పేర్కొంది. నగరంలో తొమ్మిదేళ్ల క్రితం మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో స్మార్ట్‌ కార్డులు, టోకెన్ల విధానంతో ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేసే వీలు కల్పించారు. ఈ రోజుకీ అనేక మంది ఆ విధానాన్ని అవలంబిస్తూనే ఉన్నారు. మార్చిలో ప్రయాణాలు సాగించిన 86.82 లక్షల మందిలో 37.64 లక్షల మంది స్మార్ట్‌ కార్డులు వినియోగించుకున్నారని సీఎంఆర్‌ఎల్‌ డేటాలో తెలుస్తోంది.

అవీ కొనసాగించాలి

గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌సీఎంసీ కార్డులను ప్రవేశపెట్టడంతో అదే ఏడాది నవంబరు నుంచి స్మార్ట్‌ కార్డుల అందజేత నిలిపేసినట్లు సీఎంఆర్‌ఎల్‌ అధికారి ఒకరన్నారు. స్మార్ట్‌ కార్డుతో కలిగే ప్రయోజనాలు ఎన్‌సీఎంసీ కార్డులో కూడా ఉంటాయని, ప్రయాణాలకు మాత్రమే కాకుండా దుకాణాలు, ఇతర రవాణా సదుపాయాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. అయితే స్మార్ట్‌ కార్డుల అందజేత ఆపేయకుండా కొనసాగిస్తే బాగుంటుందని కొందరు పేర్కొంటున్నారు. ఎన్‌సీఎంసీ కార్డుకు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని, అదే స్మార్ట్‌ కార్డుకయితే అవసరం లేదని తెలుపుతున్నారు. గుర్తింపు కార్డు చూపించే సమయం ప్రయాణికుల్లో చాలా మందికి ఉండదన్నారు. వృద్ధులకు స్మార్ట్‌ కార్డు రీఛార్జ్‌ చేసుకోవడానికి, టిక్కెట్లు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని