logo

ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్‌ కేంద్రాలు

తంజావూర్‌, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్‌ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేరుతో తంజావూర్‌, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి.

Updated : 06 May 2024 06:50 IST

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని

పరీక్ష కేంద్రం వద్ద రిహానా

ఆర్కేనగర్‌: తంజావూర్‌, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్‌ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేరుతో తంజావూర్‌, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ రెండింటిని నీట్‌ కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టుకోట్టై సమీపం ఊరణికి చెందిన రిహానా.. కుంభకోణం పరీక్ష కేంద్రానికి బదులు తంజావూర్‌లోని కేంద్రానికి వెళ్లింది. అక్కడి వెళ్లాక విషయం తెలియడంతో వెంటనే కారులో కుంభకోణానికి బయల్దేరింది. మధ్యాహ్నం 1.40 గంటలకు కేంద్రానికి చేరుకుంది. సమయం దాటిపోవడంతో ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేక కన్నీటితో వెనుదిరిగింది. అదేవిధంగా తంజావూర్‌కు చెందిన మరో విద్యార్థిని తంజావూర్‌ తామరై కేంద్రానికి వెళ్లగా తనకు కుంభకోణం కేంద్రాన్ని కేటాయించారని తెలిసి ద్విచక్రవాహనంపై వేగంగా 1.25 గంటలకు చేరుకోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించారు. ఒకే జిల్లాలో 40 కి.మీ దూరంలో ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో ఏటా విద్యార్థులు ఇలానే గందరగోళానికి గురై పరీక్షకు దూరమవుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒకే కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

కుటుంబ గొడవలతో మరో యువతి...

ఆర్కేనగర్‌:  కుటుంబ గొడవల కారణంగా నీట్‌ రాయాల్సిన విద్యార్థిని గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పత్తూర్‌ జిల్లా పుదూర్‌ ప్రాంతానికి చెందిన కమల్‌నాథన్‌, ఇలక్కియ భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల కుమార్తె ఉంది. కమల్‌నాథన్‌ అక్క మణిమేఘలై కుమారులైన కోదండన్‌ (33), మోహన్‌కుమార్‌ (30) తరచూ మేనమామ కుమార్తెతో గొడవపడుతుండేవారు. ఇదిలా ఉండగా శనివారం మళ్లీ యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కమల్‌నాథన్‌.. వారిని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మేనమామ, అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీని గురించి బాధిత యువతి మాట్లాడుతూ.. తాను నీట్‌కు కష్టపడి చదివానని, కుటుంబ గొడవ కారణంగా పరీక్షకు దూరమయ్యాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని