logo

తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు

స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం  శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్‌, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Published : 06 May 2024 01:43 IST

ప్రభుత్వానికి జలమండలి ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, వడపళని: స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం  శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్‌, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

రూ.100 కోట్లతో నివేదిక

తిరునిండ్రవూరు చెరువు 349 హెక్టార్లలో చెన్నై నగరానికి పశ్చిమంగా ఉంది. మురుగు నీరు, ఆక్రమణలతో కుచించుకుపోయింది. దీనికితోడు ఏళ్ల తరబడి పూడికతీత పనులు కూడా జరగలేదు. గతంలో తాగునీటి అవసరాలకు పోరూరు, రెట్టేరి, నెమం, అయనంబాక్కం చెరువులను వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటిని నియంత్రించి, తిరునిండ్రవూరు చెరువులో సమృద్ధిగా నీటిని నిల్వ చేసేందుకు రూ.100 కోట్లతో సమగ్ర నివేదికను జలమండలి విభాగం ప్రభుత్వ ఆర్థిక విభాగానికి పరిశీలనార్థం పంపింది.

500 ఎంసీఎఫ్‌టీలకు పెంచే యోచన

ఈ చెరువులో నీటి సామర్థ్యాన్ని 150 నుంచి 500 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల వరకు పెంచుకునే వీలుందని జలమండలి విభాగ అధికారులు పేర్కొన్నారు. చెరువులో 1.50 మీటర్ల వరకు చెత్తాచెదారాలు పేరుకుపోయాయని, మురుగు శుభ్రం చేసి ఆక్రమణలు తొలగించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు. చేపట్టనున్న ప్రాజెక్టుతో ఆదాయం కూడా సమకూరనుంది. చెరువు నుంచి 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల కోర్స్‌ సాయిల్‌ (సవుడు)ను తొలగించి దాని ద్వారా రూ.36 కోట్ల మేరకు ఆదాయాన్ని గడించే వీలుంది. వరదలు సంభవించినప్పుడు పెరియార్‌ నగర్‌, ముత్తమిళ్‌ నగర్‌, తిరునిండ్రవూరు పరిసరాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ‘తమిళనాడు అర్బన్‌ హ్యాబిటెట్ డెవలప్‌మెంట్ బోర్డ్‌’ (టీఎన్‌యూహెచ్‌డీబీ) చెరువుకు సమీపంలోని మత్తమిళ్‌ నగర్‌, కన్నికాపురం, పెరియార్‌ నగర్‌ ప్రాంతాల్లో ఇళ్లను ఏర్పాటు చేసిందని, చెరువులో నీరు నిండినప్పుడు ఈ ప్రాంతాలన్నీ నీటమునిగి ఉంటాయని అధికారులు గమనించారు. 4.8 కి.మీ వరకు చెరువును, తీరం వద్ద బలోపేతం చేసి, నీటిని నియంత్రించేందుకు షట్టర్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా జలమండలి విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

శాశ్వత వనరుగా...

ప్రస్తుతం ఆవడి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెన్నై మెట్రో వాటర్‌ నుంచి అధిక మొత్తంలో తాగునీరు సరఫరా అవుతోంది. తిరునిండ్రవూరు చెరువును శాశ్వతంగా తాగునీటి సరఫరాకు అనుగుణంగా తీర్చిదిద్దితే ఆవడి, పరిసర ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండగలదు. పూండి జలాశయంలో అధికంగా చేరుకునే నీటిని పూండి - చెంబరంబాక్కం లింకు కాలువ ద్వారా తిరునిండ్రవూరు చెరువుకు తరలించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. దీంతో చెరువులో నీటి నిల్వ కూడా పెరుగుతుందని, కొంత నీటిని చెన్నైకి కూడా సరఫరా చేసే వీలుంటుందని ఓ అధికారి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని