logo

విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!

విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

Published : 07 May 2024 00:07 IST

సన్నాహాల్లో పార్టీలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 7వ దశలో జూన్‌ 1న జరిగే ఎన్నికలతోపాటు విక్రవాండి అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది.ఏ సమయంలోనైనా ఉప ఎన్నిక తేదీ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. మంగళవారం(7న) నోటిఫికేషన్‌ వెలువడవచ్చని రాజకీయపార్టీలు ఎదురుచూస్తున్నాయి. 4 నుంచి అగ్నినక్షత్రం ప్రారంభమై ఎండలు మరింత పెరిగాయని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఉప ఎన్నిక తేదీ ప్రకటించాలని పీఎంకే అధ్యక్షుడు రామదాసు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు ప్రకటించినా పోటీకి రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి.

ఆశావహుల యత్నాలు..

పీఎంకే అన్నాడీఎంకే కూటమి నుంచి బయటికొచ్చినందున తమకు అనుకూలంగా ఉంటాయని డీఎంకే భావిస్తోంది. ఆ పార్టీ నుంచి బరిలో నిల్చేందుకు విళుపురం జిల్లాలో అనేక మంది ఆశావహులు పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తున్నారు. విళుపురం జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జయచంద్రన్‌, విక్రవాండి యూనియన్‌ కార్యదర్శి వేంబి రవి, మృతి చెందిన ఎమ్మెల్యే పుహళేంది కోడలు ప్రసన్నదేవి సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  • అన్నాడీఎంకేలో యూనియన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌ఎం పన్నీర్‌, జనరల్‌ బాడీ కమిటీ మాజీ సభ్యుడు లక్ష్మీనారాయణన్‌ సహా అనేక మంది ప్రయత్నిస్తున్నారు.
  • పీఎంకే తరఫున పోటీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు పుహళేందికి అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏజీ సంపత్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారని, ప్రస్తుతం ఆయన భాజపాలో ఉన్నందున పీఎంకే మద్దతుతో పోటీ చేయొచ్చని భాజపా నిర్వాహకులు అంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని