logo

ప్లస్‌టూ ఫలితాల విడుదల

మహానగర చెన్నై కార్పొరేషన్‌ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్‌ డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

Published : 07 May 2024 00:13 IST

జీసీసీ పాఠశాలల్లో 87.13 శాతం ఉత్తీర్ణత

పూంగోదై, షారూక్‌, హరినిప్రియ, దివ్యశ్రీ

చెన్నై, న్యూస్‌టుడే: మహానగర చెన్నై కార్పొరేషన్‌ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్‌ డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ వెల్లడించారు. రిప్పన్‌ బిల్డింగ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్‌ పరీక్షలు 4,998 మంది రాయగా 4,355 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. గతేడాది 86.86 శాతం మంది పాసయ్యారని తెలిపారు.

వందకు వంద..

పలు పాఠ్యాంశాల్లో 100/100 మార్కులను 56 మంది విద్యార్థులు పొందారు. కామర్స్‌లో 16 మంది, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 14 మంది, ఎకనామిక్స్‌లో 12 మంది, కంప్యూటర్‌ సైన్స్‌లో 9 మంది, అకౌంటెన్సీలో ఇద్దరు, భౌగోళిక శాస్త్రంలో ఒకరు, గణితంలో ఒకరు, జంతుశాస్త్రంలో ఒకరు వందకు వంద సాధించారు.

విలేకర్లకు వివరాలు వెల్లడిస్తున్న రాధాకృష్ణన్‌

తొలి ఐదు స్థానాల్లో..

పెరంబూర్‌లోని ఎం.హెచ్‌.రోడ్డులో ఉన్న చెన్నై బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థిని పూంగోదై 578 మార్కులతో తొలిస్థానంలో నిలిచింది. కొళత్తూర్‌ చెన్నై మహోన్నత పాఠశాల విద్యార్థి షారూక్‌ 575 మార్కులతో రెండో స్థానంలో, ఎం.హెచ్‌.రోడ్డులోని చెన్నై బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థిని హరిని ప్రియ, దివ్యశ్రీ 573 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధం కావడం కోసం ఆరు నెలలుగా టీవీ చూడటం మానేసినట్లు తొలిస్థానంలో నిలిచిన పూంగోదై తెలిపారు. ఆమె తండ్రి పార్తిబన్‌ ఆటో డ్రైవరుకాగా తల్లి శివకామి ఇంటి పనులు చేస్తున్నారు.

వందశాతం పాఠశాలలు..

నుంగంబాక్కంలోని చెన్నై బాలికల మహోన్నత పాఠశాల 100శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. అప్పాసామి వీధిలోని చెన్నై మహోన్నత పాఠశాల 98శాతంతో రెండో స్థానం, తిరువాన్మియూర్‌లోని చెన్నై మహోన్నత పాఠశాల 96.43శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది.

మార్కుల ఆధారంగా..

42 మంది విద్యార్థులు 551కుపైగా, 210 మంది 501 నుంచి 550 వరకు, 467 మంది విద్యార్థులు 451 నుంచి 500 వరకు మార్కులు పొందారు.

సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి: గవర్నర్‌ పిలుపు

చెన్నై, న్యూస్‌టుడే: సవాళ్లు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని విద్యార్థులకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి పిలుపునిచ్చారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో అద్భుతాలు సృష్టించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసం విద్యార్థులకు ఫలితాన్ని ఇచ్చిందన్నారు. మద్దతు, మార్గదర్శకాలు అందించిన తల్లిదండ్రులు, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులకూ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో అపారమైన శక్తిసామర్థ్యాలు దాగి ఉన్నాయని, తలెత్తుకుని ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

‘నాన్‌ ముదల్వన్‌’తో ఉద్యోగావకాశం

టీనగర్‌, న్యూస్‌టుడే: నాన్‌ ముదల్వన్‌ పథకం కింద నైపుణ్య శిక్షణ అభ్యసించిన ఓ విద్యార్థిని సోమవారం విడుదలైన ప్లస్‌టూ పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించడంతో పాటు ఉద్యోగావకాశం కూడా పొందారు. సేలం జిల్లా గుగై కార్పొరేషన్‌ పాఠశాలలో చదువుకున్న శివాని అనే విద్యార్థిని 569 మార్కులు పొంది పాఠశాలస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రవేశపెట్టిన ‘నాన్‌ ముదల్వన్‌’ పథకం కింద నైపుణ్య విద్య సంబంధిత శిక్షణ పొందారు. తద్వారా హెచ్‌సీఎల్‌ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. సంస్థ ద్వారా ఇంటర్న్‌షిప్‌ పొందడంతో పాటు ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా అర్హత సాధించారు. సహ విద్యార్థినిలు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.

కింగ్‌కాంగ్‌ కుమార్తెకు 404 మార్కులు

చెన్నై, న్యూస్‌టుడే: హాస్యనటుడు కింగ్‌కాంగ్‌ కుమార్తె ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో 404 మార్కులు పొందింది. రజనీకాంత్‌ నటించిన ‘అదిశయ పిరవి’ ద్వారా శంకర్‌ హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. కింగ్‌కాంగ్‌ అనే స్క్రీన్‌ పేరుతో గుర్తింపు పొందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె శక్తిప్రియ సోమవారం విడుదలైన ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో 404 మార్కులు పొందారు. ఇది తనను గర్వించేలా చేసిందని, ఆమె కలను సాకారం చేయడమే తమ ఆకాంక్షగా కింగ్‌కాంగ్‌ వెల్లడించారు. ఆమె ఇష్టపడిన కోర్సు చదివిస్తామని తెలిపారు.

కుటుంబ సభ్యులతో కింగ్‌కాంగ్‌

తండ్రి మరణాన్ని తట్టుకుని 86 శాతం

సైదాపేట: విళుప్పురం జిల్లా తిరువెన్నెయనల్లూరు సమీపం కరువేపిల్లైపాళెయం గ్రామానికి చెందిన సుబ్బరాయులు (54) సైకిల్‌పై మిరపకాయలు అమ్ముతుంటాడు. ఈ క్రమంలో అతను సైకిల్‌పై విక్రయానికి వెళ్తుండగా కారు ఢీకొని గత నెల 4వ తేదీ మృతి చెందాడు. అతని ఐదుగురు కుమార్తెల్లో 12వ తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అనిత తండ్రి మృతి చెందిన విషాదాన్ని దిగమింగి ప్లస్‌టూ పరీక్షలు రాసింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్లస్‌టూ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనిత 86 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

చెంగల్పట్టు జిల్లాలో 94.71 శాతం

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లాలో ఈఏడాది ప్లస్‌టూ వార్షిక పరీక్షలకు 25,242 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 11,455 మంది విద్యార్థులు, 13,787 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 23,907 మంది ఉత్తీర్ణత సాధించారు. 94.71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది 2.19 శాతం అధికం. రాష్ట్రవ్యాప్తంగా 18వ స్థానంలో ఉంది.

వివేకానంద పాఠశాలలో 100 శాతం

చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పట్టణంలోని వివేకానంద విద్యాలయ మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో 12వ సారి 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 183 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పాఠశాలలో విద్యార్థులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని