logo

ప్రభుత్వ ఉద్యోగంవారికి కలే!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లవుతోంది. అన్ని ప్రాంతాలకు చదువు, అభివృద్ధి చేరుతున్నాయిగానీ.. తమిళనాడులోని పళియర్‌ తెగ ప్రజలకు మాత్రం అవి ఇప్పటికీ కలగానే ఉన్నాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పెద్దగా అవగాహనలేదు.

Published : 08 May 2024 00:48 IST

 పెద్ద చదువులకు నోచుకోని పళియర్‌ తెగ ప్రజలు
కుల ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌ కార్డులూ లేవు
తాజా పరిశోధనలో వెల్లడి

కొడైక్కానల్‌లోని కడుగుతాడి గ్రామం

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లవుతోంది. అన్ని ప్రాంతాలకు చదువు, అభివృద్ధి చేరుతున్నాయిగానీ.. తమిళనాడులోని పళియర్‌ తెగ ప్రజలకు మాత్రం అవి ఇప్పటికీ కలగానే ఉన్నాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పెద్దగా అవగాహనలేదు. అది పొందాలంటే ఏం చేయాలో కూడా తెలీదు. అలాంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయంటే.. ఆశ్చర్యమే. తాజాగా విడుదలైన ఓ పరిశోధన వారి గురించి ఎన్నో విషయాలు బయటపెట్టింది.

ఈనాడు-చెన్నై

ళియార్‌ తెగ.. రాష్ట్రంలో అరుదుగా వినిపించే పేరు. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లీగల్‌ యాక్షన్‌ అడ్వొకసీ అండ్‌ సర్వీస్‌(ఎల్‌ఏఏఎస్‌), నాట్టై కాప్పోం స్వచ్ఛంద సంస్థలు ఓ పుస్తకం ప్రచురించారు. దిండుక్కల్‌, తేని ప్రాంతాల్లోని పళియర్‌ తెగ ప్రజల పరిస్థితులపై ఇందులో వివరంగా చెప్పారు. ఎస్‌.జె.అలోసియస్‌ ఇరుదయమ్‌ వారిపై లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని రాసి తాజాగా విడుదల చేశారు. సామాజిక సమస్యలపై తీవ్రంగా స్పందించే ఈయన.. దళితులు, నిరాదరణకు గురైన గిరిజనులపై ఇప్పటికే పలు పుస్తకాలు రాశారు. మదురైలోని ఐడియాస్‌ పరిశోధన కేంద్రం సంచాలకులుగా ఉన్నారు. నేషనల్‌ కాంపెయిన్‌ ఆన్‌ దళిత్‌ హ్యూమన్‌ రైట్స్‌(ఎన్‌సీడీహెచ్‌ఆర్‌) వ్యస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు.

బడి నుంచి గ్రామంలోకి వెళుతున్న విద్యార్థినులు

వెల్లడైన విషయాలివి..

తాజాగా విడుదలైన పరిశోధక పుస్తకంలోని వివరాలను అనుసరించి.. దిండుక్కల్‌, తేని జిల్లాల్లోని వారి తెగలు నివసించే 36 గ్రామాల్లో 1,173 కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ సాధ్యపడలేదని పేర్కొన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, ఇప్పటిదాకా మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు బహు దూరమైపోయారని చెప్పారు. ఇక్కడ 4,819 మంది జనాభా ఉంటుందని, తెగవారిలో పేదరికం రాజ్యమేలుతోందని అన్నారు. నిరక్ష్యరాస్యత, అవగాహనలోపాలు వారికి శాపంగా మారాయని వెల్లడించారు. మరీ దారుణమేంటంటే.. వారికి కుల ధ్రువీకరణపత్రాలు కూడా లేవని మరో విషయంగా వెల్లడించారు. ఆధార్‌, ఓటు కార్డులు సైతం వారి వద్ద లేవంటే.. వెనకబాటుకు ఇదే నిదర్శనమని పుస్తకంలో వివరించారు. 52శాతం మంది పురుషులకు, 45శాతం మంది స్త్రీలకు సాధారణ చదువులూ అందడంలేదని తెలిపారు.

హక్కుల కోసం ఆగని పోరాటం..

ఈ తెగలవారు తమ హక్కుల కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. దిండుక్కల్‌, తేనితో పాటు మదురై తదితర ప్రాంతాల్లోనూ వారి జనాభా వెనకబాటులోనే ఉంది. వారి ఊర్లకు వెళ్లేందుకు దారులు కూడా సరిగా ఉండవు. అటవీ ప్రాంతాలద్వారా పలుచోట్లకు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మదురైలోని తొట్టప్పనాయక్కనూర్‌ సమీపంలోని కురింజినగర్‌లో ఉండే 27 పళియర్‌ తెగవారికి విద్యుత్తు కనెక్షన్లు వచ్చేందుకు ఏకంగా 20ఏళ్ల పోరాటం చేయాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

పళియర్‌ తెగపై ప్రచురితమైన తాజా పుస్తకం

గతేడాది వారు విద్యుత్తు వెలుగులు చూడగలిగారు. దిండుక్కల్‌ జిల్లా పళని పరిధిలో ఉండే పళియర్‌ తెగవారికి ఇదివరకు కుల ధ్రువీకరణపత్రాలు అందలేదని స్థానికులు చెబుతున్నారు. ఇవి లేనిదే ఉపాధి దొరకడం కష్టమైన తరుణంలో పోరాటమే చేయాల్సి వస్తోందని అంటున్నారు. స్థానికంగా దొరికిన వాటితోనే ఉపాధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.


ఆదుకోవడం అత్యవసరం

ఎస్‌.జె.అలోసియస్‌ ఇరుదయమ్‌

‘జైభీమ్‌’ సినిమా ఈ పరిశోధనవైపు ఉసిగొల్పినట్లు పరిశోధకులు ఇరుదయమ్‌ వివరిస్తున్నారు. ఈ సినిమాలో ఓ గిరిజన మహిళ తనకు దక్కాల్సిన న్యాయం కోసం జరిపే పోరాటం నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు వివరించారు. తాను పరిశోధించిన 36 గ్రామాల పరిస్థితే ఇతర చోట్లా ఉండొచ్చని చెబుతున్నారు. పలుచోట్ల ఇంతకంటే దారుణంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పళియర్‌ తెగ లాంటి ఆదివాసీ సామాజిక వర్గాల్ని ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నాలు చేయాలని పిలుపునిస్తున్నారు. తెగల జీవనోపాధికి వెంటనే ప్రణాళికలు చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధి నిర్ణయించి వారి మెరుగుదలకు కంకణం కట్టుకోవాలని చెబుతున్నారు. అభివృద్ధి దూరంగా ఉన్న ఈ తెగలకోసం ప్రత్యేక నిధి ప్రకటించాలని కోరారు.


గవర్నర్‌కు వినతి

ఆర్‌ఎన్‌ రవి దంపతులతో తెగ మహిళలు

గతేడాది గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కొడైక్కానల్‌ సమీపంలో పళియర్‌ గృహాలు సందర్శించారు. సరైన ఉపాధి మార్గాలు తమకు దొరకడంలేదని, శాశ్వత భూములు తమకు అవసరమని ప్రజలు విన్నవించారు. ప్రభుత్వం తమకు ఇళ్లు, నీరు అందిస్తోందని తెలిపారు. ఎస్టీ జాబితానుంచి పళియర్‌ తెగ తీసివేయడంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నామని పలువురు కుటుంబీకులు గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. ఓ వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఆయా తెగలున్న గ్రామాల్లో పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బడిమానేసిన పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు కసరత్తు చురుగ్గా సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు