logo

దాతృత్వం అమోఘం

ఐఐటీ మద్రాస్‌ అంటేనే ఒక ప్రత్యేక ముద్ర. వారు నిర్వహించే ప్రాజెక్టులకు ఎంతో ప్రజాదరణ. ఇక్కడ చదివిన విద్యార్థులంటే పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మరీ ముఖ్యంగా కంపెనీలు పెట్టాలనే ఆలోచనలు ఇక్కడి విద్యార్థుల్లో ఉంటాయి.

Published : 09 May 2024 00:57 IST

ఐఐటీఎంకు 2023-24లో  అత్యధిక విరాళాలు
ఏకంగా రూ.513.38 కోట్లతో రికార్డు
భవిష్యత్తు సమాజహిత కార్యక్రమాలకు ఊతం

కీలక దాతలు వరుసగా.. కృష్ణ చివుకుల, సునీల్‌ వాధ్వానీ, క్రిస్‌ గోపాలకృష్ణన్‌, గిరీష్‌రెడ్డి, గురురాజ్‌ దేశ్‌పాండే,  సుబ్రమణ్యం శంకర్‌, వెంకట్‌ రంగన్‌, మహేశ్వర సాయిరెడ్డి

ఐఐటీ మద్రాస్‌ అంటేనే ఒక ప్రత్యేక ముద్ర. వారు నిర్వహించే ప్రాజెక్టులకు ఎంతో ప్రజాదరణ. ఇక్కడ చదివిన విద్యార్థులంటే పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మరీ ముఖ్యంగా కంపెనీలు పెట్టాలనే ఆలోచనలు ఇక్కడి విద్యార్థుల్లో ఉంటాయి. అలాంటి ఐఐటీఎంకు దాతల నుంచి భారీఎత్తున నిధులు సమకూరుతున్నాయి. వాటి ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు మరింత పెంచేందుకు ఈ విద్యాసంస్థ చక్కటి ప్రణాళికలు చేస్తోంది.

ఈనాడు-చెన్నై: ఐఐటీ మద్రాస్‌(ఐఐటీఎం)కు గత 10 ఆర్థిక సంవత్సరాలుగా రూ.1387.49 కోట్లు సమకూరాయి. ఈ మొత్తం నిధుల్లో తాజా ఆర్థిక సంవత్సరంలోనే 37శాతం నిధులు వచ్చాయి. ఐఐటీఎం చరిత్రలోనే ఇది అత్యధిక నిధుల సేకరణ. 2022-23లో రూ.231.10కోట్లు రాగా.. 135శాతం అధిక నిధులతో ఈసారి దాతలు స్పందించారు. దీంతో రూ.513.38 కోట్లు దక్కాయి.

ఇక్కడే చదివి.. ఎత్తుకు ఎదిగి

అత్యధికంగా పూర్వ విద్యార్ధులే పెద్దమనసు చాటుకున్నారు. ఈ క్యాంపస్‌లో చదివాక ప్రయోజకులు కావడంతో తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. వారు ఏకంగా రూ.368.19 కోట్లు ఈసారి ఇచ్చారు. మరోవైపు వివిధ కార్పొరేట్‌ సంస్థలు రూ.95.53 కోట్లను సీఎస్‌ఆర్‌ కింద అందించాయి. ఇతరుల దాతృత్వం రూ.49.64 కోట్లుగా ఉంది. పూర్వవిద్యార్థులు ఏకంగా 960మంది ముందుకు రావడం విశేషంగా చెబుతున్నారు. సీఎస్‌ఆర్‌ కింద 112 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. 16మంది పూర్వవిద్యార్థులు, మరో 32 సంస్థలు రూ.కోటి చొప్పున ఇచ్చారు.

భారీ ఒప్పందాలు

ఇంకా రూ.717.80కోట్లు ఇచ్చేందుకు అవగాహన ఒప్పందాలు అయ్యాయి. ఇందులోనూ పూర్వవిద్యార్థులు రూ.455.60 కోట్లతో ముందుకు రాగా, మరికొన్ని సంస్థలు రూ.262.20 కోట్లు ఇస్తామని ప్రకటించాయి. త్వరలోనే ఇవి కూడా అందేలా కసరత్తు చేస్తున్నట్లు ఐఐటీఎం యంత్రాంగం వివరిస్తోంది.

తెలుగు లెస్స..

దాతల్లో పలువురు తెలుగువారు కృష్ణచివుకుల, గిరీష్‌రెడ్డి, మహేశ్వరసాయిరెడ్డి తదితరులున్నారు. విద్యార్థుల ప్రతిభ ప్రోత్సహించడంతో పాటు క్రీడా ఉపకారవేతనాల్ని కృష్ణ చివుకుల ఇస్తున్నారు. ఐఐటీఎంలో గిరీష్‌రెడ్డి ప్రత్యేక కేంద్రాన్ని తెరిచారు. ప్రాజెక్టు బ్రైట్‌ ఫ్యూచర్‌ పేరుతో మహేశ్వరసాయిరెడ్డి పలురకాలుగా కృషి చేస్తున్నారు.

కీలక ప్రాజెక్టులొచ్చాయి

  • దాతల ప్రోత్సాహంతో స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ కార్యక్రమానికి తెరతీశారు. రూ.110 కోట్లతో వాధ్వానీ స్కూల్‌ ఆఫ్‌ డాటా సైన్స్‌ అండ్‌ ఏఐని స్థాపించారు.
  • క్రీడల్లో రాణించినవారికి ప్రత్యేక ఉపకార వేతనాలతో యూజీ కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం పేరుతో ఇది ప్రాచుర్యంలో ఉంది.
  • గాలిమర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మధుమేహంపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోగులకు మేలు జరిగే ప్రాజెక్టు ఇది.
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా కృత్రిమమేధ ప్రాజెక్టు తెచ్చారు. సుస్థిరమైన సప్లై చైన్‌ వ్యవస్థ కోసం పరిశోధనలు చేసేవారికి ఫెలోషిప్‌లు ప్రకటించారు. మాస్టర్స్‌, డాక్టరేట్‌ చేసే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది.
  • యూజీ అటానమీ ల్యాబొరేటరీ తెచ్చారు. బోధన పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగంపై ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మెడికల్‌సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీఎస్‌ డిగ్రీ మొదలుపెట్టారు.

ప్రత్యేక వ్యవస్థలతో..

దాతలు ఎంతబాగా ముందుకొస్తోంటే అంత బాగా విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా సీఎస్‌ఆర్‌ నిధులిస్తున్న సంస్థలు, పూర్వవిద్యార్థులతోనే సాధ్యమవుతోంది. ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌, ఐఐటీ మద్రాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిధుల సేకరణ జరుగుతోంది.

ప్రొఫెసర్‌ వి.కామకోటి, ఐఐటీఎం సంచాలకులు

ఉత్తమంగా ఎదుగుతోంది..

దాతలతో ఎంతోమంది విద్యార్థులకు విద్య అందుతోంది. ఇదంతా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడుతుంది. పూర్వ విద్యార్థుల దాతృత్వం మాటల్లో చెప్పలేనిది. 2022-23తో పోల్చితే 2023-24లో 282శాతం ఎక్కువగా నిధులిచ్చారు. వాటిద్వారా సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు, స్కాలర్‌షిప్పులు, ఇతర అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నింటి ఫలితంగానే ఐఐటీఎం సీఎస్‌ఆర్‌ ప్రాజెక్టుల్లో ఉత్తమంగా ఉంది.

ప్రొఫెసర్‌ మహేష్‌ పంచాజ్ఞుల, డీన్‌(పూర్వవిద్యార్థులు, కార్పొరేట్‌ సంబంధాలు)

నమ్మకం పెరిగింది

వచ్చిన నిధుల్ని క్యాంపస్‌ అభివృద్ధితో పాటు పర్యావరణ సాంకేతికత మీద వెచ్చిస్తున్నాం. ఐఐటీ మద్రాస్‌ చేపడుతున్న కార్యక్రమాలపై పలు సంస్థలు సైతం నమ్మకం ఉంచుతున్నాయి. నిధుల సేకరణకు, ఖర్చుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటుచేశాం.

కవిరాజ్‌ నాయర్‌, సీఈవో, ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌

దేశం గర్వించేలా..

పూర్వవిద్యార్థులే ఐఐటీఎంకు బలంగా ఉన్నారు. భవిష్యత్తులోనే మరిన్ని మైలురాళ్లు ఈ సంస్థ అధిగమిస్తుందని ఆశాభావంతో ఉన్నాం. దేశాన్ని ముందుకు నడిపించడంలో దాతల ఔదార్యం ఎంతో ఉంది. ఆ నిధులతో దేశానికి ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. పూర్వవిద్యార్థుల సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, పాఠశాలలు తేగలిగాం.

వి.శంకర్‌, సీఏఎంఎస్‌ వ్యవస్థాపకులు, ఐఐటీఎంఏసీటీ ఛైర్మన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని