logo

లారీ డ్రైవరు దారుణహత్య

పొన్నేరి సమీప కేఎన్‌.కండ్రిగకు చెందిన శివకుమార్‌ (33) లారీ డ్రైవరు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.

Updated : 10 May 2024 05:26 IST

శివకుమార్‌ (పాతచిత్రం)
పొన్నేరి, న్యూస్‌టుడే: పొన్నేరి సమీప కేఎన్‌.కండ్రిగకు చెందిన శివకుమార్‌ (33) లారీ డ్రైవరు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇతను బుధవారం సాయంత్రం ఇంట్లో మద్యం తాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడిచేసి హతమార్చి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌ తమ్ముడు దేవేంద్రన్‌ అత్తతో మృతుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఆవేశానికి గురైన దేవేంద్రన్‌.. స్నేహితులతో కలిసి శివకుమార్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేశారు.


కొబ్బరికాయల వ్యాపారి...

శ్రీపెరుంబుదూర్‌: చెన్నై ముగప్పేర్‌ పశ్చిమ జస్వంత్‌ నగర్‌కు చెందిన వెంకటేశన్‌ (55) కొబ్బరి కాయల వ్యాపారి. ఇతని భార్య లక్ష్మి (50) విశ్రాంత ఉపాధ్యాయురాలు. వీరికి సంతోష్‌, చంద్ర కుమార్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంతోష్‌ (20) రామనాథపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 5వ తేదీ రెండో కుమారుడు చంద్రకుమార్‌కు నీట్‌ పరీక్ష ఉండటంతో తల్లిదండ్రులు అతన్ని కారులో కుండ్రత్తూర్‌ సమీప పూంతండలంలోని కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ కుమారుడిని దించేసి పొల్లాచ్చిలోని తమ పొలాలను చూడటానికి వెళ్లారు. తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుమారుడు సంతోష్‌ ఈ నెల 7వ తేదీ కుండ్రత్తూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంకటేశన్‌, లక్ష్మి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సేలం జిల్లా పల్లిపట్టి ప్రాంతంతో వారు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నారు. అక్కడ లక్ష్మి ఉంది. వెంట ఉన్న గణేశన్‌, కుమరేశన్‌, విగ్నేష్‌లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో.. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ప్రాంతంలో వెంకటేశన్‌ను సేలానికి చెందిన గణేశన్‌, అతని స్నేహితులు శరవణన్‌, కార్తిక్‌, కుమరేశన్‌, విగ్నేష్‌ హత్య చేసి గణేశన్‌ తోటలో పూట్చి పెట్టినట్లు తెలిసింది. వెంకటేశన్‌, లక్ష్మి కలిసి గ్రూప్‌-4 ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని, బాధితులు తమ డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో పొల్లాచ్చిలో ఉన్న తమ భూములను కృష్ణగిరికి చెందిన విజయరాజాకు విక్రయించడానికి నిర్ణయించుకున్నారని తేలింది. తరువాత విజయరాజా.. వెంకటేశన్‌, లక్ష్మిని కృష్ణగిరికి రమ్మని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారని, గతంలో భార్యాభర్తలు ఉద్యోగం పేరిట గణేశన్‌ను మోసం చేయడంతో అతను విజయరాజా ద్వారా వారిని కృష్ణగిరికి పిలిపించి స్నేహితులతో కలిసి వెంకటేశన్‌ను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు తెలిసింది. వెంకటేశన్‌ మృతదేహాన్ని వెలికితీయడానికి చర్యలు తీసుకుంటున్నారు.


అంబర్‌గ్రీస్‌ విక్రేత అరెస్టు

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: నాగపట్నానికి చెందిన సిలంబరసన్‌ జాలరి. ఇతను వారం రోజుల క్రితం సముద్రంలో చేపలు పడుతుండగా అంబర్‌గ్రీస్‌ లభించింది. దీన్ని విక్రయించేందకు అతను చెన్నై ఎన్నూరు సునామీ నగర్‌లోని బంధువు ఇంటికి బుధవారం రాత్రి చేరుకున్నాడు. అప్పుడు వాహనాల తనిఖీల్లో ఉన్న పోలీసులు సిలంబరసన్‌ను అదుపులోకి తీసుకుని సంచిలో ఉన్న రూ.కోటి విలువైన 800 గ్రాముల అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు.


బంగ్లాదేశ్‌ యువకులు....

కోయంబత్తూరు: కోయంబత్తూరు సమీప అన్నూరులో కొందరు బంగ్లాదేశ్‌ యువకులు చట్టవిరుద్ధంగా తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకుని అగస్థాన్‌ నిట్‌ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ అర్జు, బోలాస్‌బర్మన్‌ను గురువారం అరెస్టు చేశారు.


పోలీసునని చెప్పి నగల దోపిడీ

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: అంబత్తూరు సిప్కాట్‌ పక్కనే ఉన్న దుకాణంలో ఓ ప్రేమజంట బుధవారం సాయంత్రం శీతలపానీయం తాగుతుండగా పోలీసు స్టిక్కర్‌ అంటించి ఉన్న ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి అక్కడ ఆగాడు. తాను పోలీసునని, యువతి ధరించిన బంగారు గొలుసులపై అనుమానం ఉందని చెప్పాడు. నగలు ఇస్తే దర్యాప్తు అనంతరం తిరిగి అప్పగిస్తానని నమ్మబలికాడు. నిజమని నమ్మిన ప్రేమజంట 7 సవర్ల బంగారు నగలను అతనికి అందజేశారు. గంట తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వచ్చి నగలు తీసుకోవాలని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత వారు సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి నగలు ఇవ్వాలని పోలీసులను కోరగా.. అతను నకిలీ పోలీసని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఉద్యోగం పేరిట నగదు మోసం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: చెన్నై ఆరుంబాక్కానికి చెందిన అరుణ్‌ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌కి ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. అందులో ఉన్న లింక్‌పై క్లిక్‌ చేసి అందులో ఉన్న టాస్క్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేశాడు. చివరికి అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.50 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి రెడ్‌హిల్స్‌కి చెందిన తేజ, అన్నానగర్‌కి చెందిన విజయ్‌, హైదరాబాద్‌కి చెందిన సరస్వతిని గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 15 నకిలీ ఏటీఎం కార్డులు, 3 సెల్‌ఫోన్లు, 15 బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వారు కమీషన్‌ కోసం పనిచేస్తున్నారని, అసలు నిందితులు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.


బంగారు బిస్కెట్ల స్వాధీనం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: సింగపూర్‌ - కోవై మధ్య నడిచే విమానంలో బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు గురువారం కోవై విమానాశ్రయానికి చేరుకున్న విమానంలోని ఓ ప్రయాణికుడి నుంచి కిలో బరువున్న 10 బంగారు బిస్కెట్లు, బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.


బాలికపై అత్యాచారం.. వృద్ధుడికి 20 ఏళ్ల జైలు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి జైలు శిక్ష విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. పుదుకోట్టై జిల్లాకు చెందిన 63ఏళ్ల వృద్ధుడు 2023 మే 29న అదే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వృద్ధుడిని అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ ముగియడంతో గురువారం పుదుకోట్టై మహిళా కోర్టులో న్యాయమూర్తి జయంతి తీర్పునిచ్చారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడునెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించారు.


మంత్రిలా మాట్లాడి నగదు స్వాహా

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ జిల్లా పెరుందురైలోని పారిశ్రామికవేత్తకు ఫోన్‌ చేసి తాను కాంగేయం మాజీ ఎమ్మెల్యేనని, తనకు రూ.50 వేలు అవసరం ఉంది, తాను పంపుతున్న వ్యక్తి చేతికివ్వమని చెప్పారు. డబ్బు ఇచ్చిన తర్వాత అనుమానం రావడంతో పారిశ్రామికవేత్త సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దించి సదరు వ్యక్తి కోసం గాలించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా తిరుచ్చిలో ఉన్న కన్నియాకుమరికి చెందిన రవిగా గుర్తించి అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్‌లు, మూడు సిమ్‌ కార్డులు, ప్రముఖుల వివరాలన్న డైరీ స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని