logo

అల్లకల్లోలం..

తమిళనాడు రాష్ట్రం పర్యాటకానికి పెట్టింది పేరు. అందులోనూ సముద్ర పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్షలాది, కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొస్తున్నారు.

Published : 10 May 2024 01:20 IST

హెచ్చరికలు పట్టించుకోని పర్యాటకులు

జాగ్రత్తలు పాటించక సాగర తీరాన దుర్ఘటనలు

 రెండు రోజుల్లో 8 మంది మృతి

తమిళనాడు రాష్ట్రం పర్యాటకానికి పెట్టింది పేరు. అందులోనూ సముద్ర పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్షలాది, కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొస్తున్నారు. ఆనందంలోనో, తొందరలోనో.. అధికార యంత్రాంగం చెబుతున్న జాగ్రత్తల్ని పాటించకపోవడంతో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. తాజాగా కన్యాకుమారిలో రెండ్రోజుల్లోనే 8మంది అలల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు యావత్‌ దేశాన్ని  కుదిపేశాయి. పర్యాటకులకు పెద్ద  హెచ్చరికలా మారాయి.

ఈనాడు-చెన్నై: రాష్ట్రానికి ఏటా 15కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. వారిలో ఎక్కువశాతం మంది సముద్రతీర ప్రాంతాలను ఇష్టపడతారు. వచ్చినవారిలో అధికశాతం మంది ఎక్కడో ఒకచోట సముద్రమున్న ప్రాంతానికి వెళ్లి సేదతీరుతుంటారు. సాగరంలోకి దిగాలని, సరదాగా ఆడుకోవాలని, నీటితో స్నానం చేయాలని.. ఇలా ఎన్నెన్నో కోరికలతో వస్తుంటారు. వాతావరణ హెచ్చరికలు గుర్తుచేసుకుని, జాగ్రత్తలు తీసుకుని తీర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని తాజా ఘటనలు గుర్తుచేస్తున్నాయి. ఒకవైపు వాతావరణ హెచ్చరికలున్నా.. ఆయా ఘటనల్లో మృతులు, ఇతర బృందాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరిగాయని పోలీసులు వివరిస్తున్నారు.

30 కి.మీ. పరిధిలోనే 3 ఘటనలు

ఈనెల 4, 5 తేదీల్లో కన్నియాకుమరి జిల్లా తీరంలో.. కేవలం 30 కి.మీ. మధ్యనే 3 బీచ్‌ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా జరగడం గమనార్హం. మూడు ఘటనలు ఒకేలా జరగడం కాకతాళీయమైనా.. ఆ రెండ్రోజుల్లో సముద్రం కల్లోలంగా ఉంటుందనే హెచ్చరికలు, బాగా ఈత వచ్చిన మత్స్యకారులు సైతం సముద్రంలోకి వెళ్లకూడదనే ఆంక్షలు ఉన్నాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా, గాలుల వేగం బలంగా ఉన్నా.. సముద్రంలోకి పర్యాటకులు వెళ్లడమే మరణాలకు కారణమైనట్లు పోలీసులు చెబుతున్నారు. అలల తాకిడి ఉద్ధృతంగా ఉండటంతో కొన్ని గంటలపాటు మృతదేహాలు కూడా దొరకలేదు. మత్స్యకార కుటుంబాలు, స్థానిక యంత్రాంగం ప్రాణాలొడ్డి వారి మృతదేహాల్ని తీసుకురావాల్సి వచ్చింది.

ఆ రెండ్రోజుల్లో హెచ్చరికలు ఇలా..

సముద్ర అలల తీవ్రతపై ఇన్‌కాయిస్‌ వాతావరణ విభాగం తీర ప్రాంతాలకు హెచ్చరికలు చేస్తుంటుంది. ఆది, సోమవారాల్లోనూ జారీచేశారు. వాటినే వాతావరణ విభాగమూ చెప్పింది. దక్షిణాది జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నమోదైన అలల ఉద్ధృతి చూస్తే.. 4న 1.98 మీ. ఎత్తుదాకా ఎగిసిపడ్డాయని, 5న 1.8 మీటర్లు ఎత్తున ఎగిశాయని చెబుతున్నారు. మనిషిని సైతం అమాంతంగా ఇవి ముంచేసే రకం. ఈ అలల్లోనే ఆది, సోమవారాల్లో పర్యాటకులు సముద్రజలాల్లోకి వెళ్లారు. 8మంది మృతిచెందారు. దేశానికి ఉపయోగపడాల్సిన 5మంది వైద్యవిద్యార్థులు, ఇద్దరు ఇతర పర్యాటకులు, ఏడేళ్ల ఓ చిన్నారి బలయ్యారు. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడూ ఉన్నారు.

ఘటన-1

తిరుచ్చి ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాలకు చెందిన 8మంది విద్యార్థులు నాగర్‌కోయిల్‌లో మరో విద్యార్థి సోదరుని వివాహానికి వచ్చారు. సోమవారం కన్నియాకుమరిలో సూర్యోదయాన్ని చూసుకుని.. 28 కి.మీ. దూరంలో ఉన్న లేమూర్‌ బీచ్‌కు వెళ్లారు. నీటిలో సరదాగా ఆడుకోవాలని వారు భావించారు. సముద్రం చురుగ్గా ఉండటంతో వెనక్కి రావాల్సి ఉండగా.. మొండిగా అలలతో ఆడటం మొదలుపెట్టారు. కాసేపటికే ఓ అల వచ్చి వారిని అమాంతం ముంచేసింది. నీటిలో ఊపిరాడక అరుస్తూ, కాళ్లు చేతులు కొట్టుకుంటూ ఉన్న ఈ విద్యార్థుల్ని చూసి.. దగ్గర్లోనే ఉన్న మత్స్యకారుడు నీళ్లలోకి దూకేశారు. కేవలం ముగ్గుర్ని మాత్రమే ఒడ్డుకు తేగలిగారు. మిగిలినవారు ఎంత వెతికినా దొరకలేదు. చివరికి గల్లంతైన 5గురు శవాలై తేలారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

లోపం ఎక్కడ..

వైద్య విద్యార్థుల ఘటనను ఓ పర్యాటకురాలు ప్రత్యక్షంగా చూశారు. ఆమె పేరు పవిత్ర. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. ‘వైద్య విద్యార్థులు బీచ్‌ వద్ద ఆడుతున్నారు. లోపలికి వెళ్లొద్దని వారిని అక్కడి భద్రతా సిబ్బంది హెచ్చరించడం నేను గమనిస్తున్నాను. వారు పెద్దగా పట్టించుకోనట్లు నాకనిపించింది. ఈలోపే ఊహించనిరీతిలో పెద్ద కెరటం వచ్చి లోపలికి లాక్కెళ్లింది. ఆ ఘటన చూసి మాకు వణుకుపుట్టింది’ అన్నారు. సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించినా.. విద్యార్థులు మాత్రం తేలిగ్గా  తీసుకున్నారు. సముద్రం ఏ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉంటుంది, ఎక్కడ సురక్షితంగా ఉంటుందనే స్థానిక భద్రతా సిబ్బంది, ఈతగాళ్లు చెప్పగలరు. వారి హెచ్చరికల్ని పాటించకుండా ముందుకెళ్లడం ముప్పును తెచ్చిపెట్టింది.

ఘటన-2

చెన్నై నుంచి 20 మంది పర్యాటకులు విహారయాత్రకు వెళ్లారు. వారంతా కలిసి కొడిమునై బీచ్‌కు వెళ్లారు. ఆరుగురు సముద్రపునీటిలో ఉన్న బండలపైకి ఎక్కారు. అక్కడికి అలలు వస్తూ వెళ్తున్నాయి. అప్పటికే అవి చురుగ్గా ఉన్నట్లు అక్కడున్నవారికి అర్థమైంది. ఆరుగురు మాత్రం వాటిని ఖాతరు చేయకుండా ఆనందాల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఒక్కసారి పెద్ద అల వచ్చి మీదపడింది. వారిని లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలోనూ అక్కడున్న మత్స్యకారుడు నీటిలోకి దూకేసి ఏకంగా నలుగుర్ని కాపాడగలిగారు. ఇద్దరు మాత్రం కనిపించలేదు. మృతిచెందినట్లు తర్వాత తేలింది.

ఘటన-3

తేంగాపట్టిణం బీచ్‌ కూడా ప్రమాదకరమైందే. ఆదివారం తండ్రి తన ఏడేళ్ల కుమార్తెతో కలిసి ఇక్కడ హార్బర్‌ బీచ్‌కు వెళ్లారు. నీటిలోకి వెళ్లి సరదాగా ఆడుకుంటుండగా తండ్రి అక్కడే ఉన్నాడు. రెప్పపాటులో వచ్చిన అల ఆమెను, తండ్రిని ఈడ్చుకెళ్లింది. ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ ఘటనలోనూ ఓ మత్స్యకారుడు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తండ్రిని కాపాడగలిగారుకానీ పాప మాత్రం కనిపించలేదు. ఈ దుర్ఘటన ఆదివారం జరగ్గా.. పాప మృతదేహం సోమవారం తీరానికి కొట్టుకొచ్చింది. తామిరభరణి నది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. ఇక్కడున్న హార్బర్‌కు ఓ పక్క నది, మరోపక్క సముద్రం ఉంది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆదివారం మాత్రం మరింత ఉద్ధృతంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని