logo

Vizag: బీచ్‌కు ఎలా వెళ్లింది.. గర్భిణి మృతి కేసులో ఎన్నో అనుమానాలు

నగరంలోని ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తరువాత శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) ఐదు నెలల గర్భిణి.

Updated : 27 Apr 2023 09:31 IST

ఈనాడు-విశాఖపట్నం:  నగరంలోని ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తరువాత శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) ఐదు నెలల గర్భిణి. ఏడాది క్రితం గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం పెద నడుపూరు ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి. మణికంఠతో వివాహం అయింది.  ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నప్పటికీ... మృతదేహం దొరికిన తీరుబట్టి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు బీచ్‌ వద్దకు ఎలా వెళ్లింది? ఎవరైనా తోడు వెళ్లారా? అనే కోణంలో సీసీ ఫుటేజీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బీచ్‌లో ఏ ప్రదేశం వద్దకు వెళ్లారు? ఏ సమయంలో చేరుకున్నారు? ఎంత సేపు గడిపారు? అనే కోణంలో ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి నుంచి మంగళవారం రాత్రి 7.30 గంటలకు నీలి రంగు గౌను ధరించి వెళ్లినట్లు కుటుంబీకులు, స్థానికులు  చెబుతున్నారు. బీచ్‌లో రాత్రి 10-11 గంటల వరకు సందడిగానే ఉంటుంది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. పైగా బీచ్‌ పెట్రోలింగ్‌, రక్షక్‌ టీం, బీచ్‌ గార్డ్స్‌ సంచరిస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యకు యత్నిస్తే తెల్లవారుజామున 2 గంటలకే మృతదేహం వెలుగులోకి రావడం, ఇసుకలో కూరుకుపోవడం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటం వంటివి ప్రశ్నలుగా మారాయి.  ఒంటిపై గాయాల్లేవని పోలీసులు చెబుతుండగా, పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. గురువారం పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. బీచ్‌ సమీపంలో ఇటీవల గంజాయి ముఠాలు హడావుడి ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

కడుపులో బిడ్డ కోసమైనా ఆలోచించాల్సింది: ‘మంగళవారం సాయంత్ర 6.15గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడింది. చాలా వరకు సర్దిచెప్పాను. కుటుంబంలో చిన్న,చిన్న సమస్యలొస్తాయని, సర్దుకు పోవాలని కోరాను. కనీసం కడుపులోని బిడ్డ కోసం ఆలోచించినా బాగుండేది. ఫోన్‌ చేసి మాట్లాడుతున్నప్పుడే స్విచ్‌ ఆఫ్‌ చేసింది. తొందరపాటు వద్దంటూ ఎన్నో మెసేజ్‌లు పెట్టాను. న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాను. ఇంతలోనే ఈ దారుణం జరిగింది’ అని శ్వేత భర్త మణికంఠ పేర్కొంటున్నారు.


సివిల్స్‌కు సన్నద్ధమవుతానంది..

‘నా కూతురు గుణం, అందంలో లక్ష్మీదేవి. బీటెక్‌ చదివిన శ్వేత సివిల్స్‌కు సన్నద్ధం అవుతానంది. పెళ్లైన తర్వాత చదివించకుండా వంటింటికి పరిమితం చేశారు. శ్వేత అత్తది నటన. అత్త, ఆడపడుచు కడుపుతో ఉన్న అమ్మాయిని హింసలు పెట్టారు. నెల రోజుల క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను బెదిరించారు. మంగళవారం కూడా ఫోన్‌ చేసి అత్త ఇంటిలో ఇబ్బందులు చెప్పింది. ఇంటికి వచ్చేయమని చెప్పాను. వరకట్నం కోసం శ్వేతను వేధించేవారు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం చాల్లేదని, ఇంకా తేవాలని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేశారు. పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నం ఇవ్వగా, మరో రూ.లక్ష లాంఛనాల కింద ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారన్నారు. కూతురులా చూసుకుంటామని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టారు’ అని శ్వేత తల్లి రమ విలపించారు. ఈమేరకు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాల్లేవని ఈస్ట్‌ ఏసీపీ వివేకానంద తెలిపారు. సముద్రంలో గల్లంతైన వ్యక్తులు ఇసుకలో కూరుకుపోవడం సహజంగా జరుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని