logo

కోతలు.. వాతలు..!

గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఎమెర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో కాకుండా సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఎడాపెడా కోతలు విధిస్తున్నారు.

Updated : 13 Jun 2023 05:39 IST

గ్రామాల్లో అప్రకటిత విద్యుత్తు కోతలు
బిల్లుల్లో అదనపు ఛార్జీల బాదుడు
ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, పాయకరావుపేట గ్రామీణం, కశింకోట, కె.కోటపాడు, మునగపాక

గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఎమెర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో కాకుండా సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. నగర ప్రాంతంలో సరఫరాకు ఇబ్బందుల్లే కున్నా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు. సమయపాలన లేకుండా రాత్రిళ్లు కూడా విద్యుత్తు కోతలు అమలు చేయడంతో పల్లెవాసులకు కంటి మీద కునుకు కరవవుతోంది. మరోవైపు విద్యుత్తు బిల్లుల్లో ట్రూఅప్‌, ఇంధన కొనుగోలు ఛార్జీలంటూ అదనపు వడ్డింపులు విధిస్తూ వినియోగదారులకు భారీగా వాతలు పెడుతున్నారు.

మ్మడి జిల్లాలో అన్ని రకాల కేటగిరీ విద్యుత్తు కనెక్షన్లు 17 లక్షల వరకు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో రోజుకు 28 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. ఈ ఏడాది జూన్‌లో రోజుకు 32 మిలియన్‌ యూనిట్లు దాటిపోతోంది. సోమవారం అత్యధికంగా రికార్డుస్థాయిలో 34.1 మి.యూ వినియోగం నమోదైంది. గతేడాదితో పోల్చితే రోజుకు నాలుగైదు మిలియన్‌ యూనిట్ల వాడకం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో విద్యుత్తు వినియోగం అమాంతంగా పెరిగింది. దీంతో సరఫరాలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరగడంతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల లోవోల్టేజీ సమస్యతో నెట్టుకురావాల్సి వస్తోంది.

వెతలు ఎన్నో..

పాయకరావుపేట మండలంలోని సత్యవరం, గుంటపల్లి, అరట్లకోట, మాసాహెబ్‌పేట తదితర ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్తు సరఫరాలోనూ కోతపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేతికి అందొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటున్నారు. తమలపాకు తోటకు నీరుపెట్టడానికి జనరేటర్‌ను అద్దెకు తెచ్చి పెట్టుకున్నామని రెండు రోజులకు రూ.7 వేలు ఖర్చయిందని సత్యవరానికి చెందిన ఓ రైతు చెప్పారు.

కశింకోట మండలంలో వేళాపాళ లేని విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతోపాటు రైస్‌ మిల్లులు, పిండి మిల్లులు పనిచేయక వాటి ముందు బస్తాలు పేరుకుపోతున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయక గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయ మోటార్లు పనిచేయకపోవడంతో తోటలు నీరందక ఎండుతున్నాయి. తీడ, చెరకాం, అడ్డాం, మోసయ్యపేట, కచ్చర్లపాలెంలో కరెంటు కోతల ప్రభావం ఎక్కువగా ఉంది.

కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామాన్ని తరుచూ చీకట్లు అలముకుంటున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడ కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు. లో ఓల్టేజీ సమస్యలూ ఉన్నాయి. విద్యుత్తు సమస్యలను పరిష్కరించడానికి చౌడువాడలో ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచి ఎరుకునాయుడు సీఎండీకి ఇదివరకు వినతి పత్రం అందించారు.

వడ్డింపు ఇలా..

ఇప్పటికే విద్యుత్తు బిల్లుల్లో ట్రూ అప్‌ ఛార్జీలు పేరిట వసూళ్లు చేస్తున్నాయి.  తాజాగా గతేడాది విద్యుత్తు కొనుగోళ్లుకు సంబంధించి ఇంధన, విద్యుత్తు కొనుగోలు ఛార్జీలు (ఎఫ్‌పీపీసీఏ)ను యూనిట్‌కు 19 పైసల నుంచి గరిష్ఠంగా 65 పైసలు చొప్పున వసూళ్లు చేయడం మొదలుపెట్టాయి. గత నెల నుంచే ఈ అదనపు ఛార్జీలను బిల్లుల్లో కలిపి ఇస్తున్నారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో మొదటి మూడు నెలలు (ఏప్రిల్‌ నుంచి జూన్‌) 19.75 పైసలు, తర్వాత జులై నుంచి సెప్టెంబర్‌ వరకు 61.94 పైసలు, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 56.52 పైసలు, 2024 జనవరి నుంచి మార్చి వరకు 65 పైసలు చొప్పున యూనిట్‌కు లెక్కించి బిల్లింగ్‌ చేస్తారు. మొదటి మూడు నెలలు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి సుమారు రూ.36 కోట్ల మేర ముక్కుపిండి వసూలు చేయనున్నారు.


చిన్న గాలివీచినా కరెంటు నిలిపేస్తున్నారు

-మారిశెట్టి అప్పలనాయుడు, రైతు, మునగపాక

చిన్న గాలి వీచినా ముందుగా వ్యవసాయ విద్యుత్తు నిలిపేస్తున్నారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేయాలి. వారంలో రెండుమూడు రోజులు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు.


కోతలు ఎక్కడా లేవు..

- మహేంద్రనాథ్‌, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్‌

విద్యుత్తు కోతలను ఎక్కడా అమలు చేయడం లేదు. కరెంటు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనివల్ల కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించి సరిచేస్తున్నాం. వ్యవసాయ విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూస్తున్నాం. గాలుల సమయంలో స్తంభాలు పడిపోవడం.. వైర్లు ట్రిప్‌ అవ్వడం జరుగుతుంటుంది. అందువల్లే ముందుజాగ్రత్తగా కొంత సమయం కరెంటు ఆపుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని