logo

‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!

వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు.

Published : 01 May 2024 03:21 IST

వైద్యారోగ్యశాఖలో అధికారుల తీరుపై విమర్శలు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. దీని ప్రకారం ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఇచ్చిన ఆదేశాలు ‘కాగితానికే’ పరిమితమయ్యాయి. వాటిని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి మాత్రమే పంపారని, సదరు ఉద్యోగులకు పంపకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా ఉద్యోగులు ఇప్పటికీ డిప్యుటేషన్‌పై తమకు నచ్చిన ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు.

వివిధ ఆసుపత్రుల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ శాతం నగరంలో స్థిరపడ్డారు. గతంలో వారంతా గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. దీంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో డిప్యుటేషన్లు వేయించుకున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు గతంలో ఆర్డీ కార్యాలయంలోని అధికారికి కొంత మొత్తం చెల్లించారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇటీవల డిప్యుటేషన్లు రద్దు చేయడంతో కొందరు పాత ఆసుపత్రులకు వెళ్లిపోయారు. మరికొందరు ఇప్పటికీ నగరంలోనే పనిచేసేలా అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే 10 మందికి పైగా పనిచేస్తున్నారని సమాచారం.

ఆదేశించినా.. వెళ్లట్లేదు: రాంబిల్లి పీహెచ్‌సీ నుంచి ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ ఏడాది క్రితం డిప్యుటేషన్‌పై విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)కు వచ్చారు. పీహెచ్‌సీలో పని ఒత్తిడి దృష్ట్యా తిరిగి వచ్చేయాలని గతంలోనే ఆయనను ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ కొంత కాలం ఇక్కడే ఉంచేలా విమ్స్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడున్న జూనియర్‌ అసిస్టెంట్లకు పనినేర్పేందుకు వచ్చారని, శిక్షణ పూర్తి కాగానే వెళ్లిపోతారంటున్నారు. వాస్తవానికి ఏడాదిగా ఆయన ఎవరికీ శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. రాంబిల్లి పీహెచ్‌సీలో సీనియర్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  • శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆఫీసర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది సూపరింటెండెంట్‌గా వచ్చిన ఒకరు నెల రోజుల్లోనే డిప్యుటేషన్‌పై విమ్స్‌కు వెళ్లిపోయారు. ఆయన బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చూస్తున్నారు. డిప్యుటేషన్‌ రద్దయినా ఇంకా విమ్స్‌లోనే పనిచేస్తున్నారు.
  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఓ పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్డీ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వారంలో మూడు రోజులు పీహెచ్‌సీలో, మరో మూడు రోజులు ఆర్డీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. డిప్యుటేషన్లు రద్దయినా ఆయన వారానికి మూడు రోజులు మాత్రమే పీహెచ్‌సీకి వెళ్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని