logo

చీకట్లో పోలింగ్‌ కేంద్రాలు.. కనిపించని గుర్తులు

ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. 

Published : 07 May 2024 04:29 IST

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి.  ఇక్కడ చీకటి గదుల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లైటింగ్‌ లేకపోవడంతో బ్యాలెట్‌పై గుర్తులు కనిపించక అవస్థలు పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు కలిపి ఎలమంచిలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు సరిగాలేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక టెంట్‌ వేసి సరిపెట్టారని ఇది హెల్ప్‌డెస్క్‌కు సరిపోయిందని, మిగిలిన వారు ఎండలో నిలబడాల్సి వచ్చిందని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉండే ఓటర్లకు, స్థానిక నియోజకవర్గంలో ఉండే ఓటర్లకు వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో అనుభవం ఉన్న వారిని నియమించకపోవడం వల్ల పోలింగ్‌ నెమ్మదిగా సాగింది. చాలా మంది ఓటుకోసం తహసీల్దార్‌ కార్యాలయల్లో తమ పత్రాలు సమర్పించినా వారికి ఓటు రాలేదు. దీంతో వీరందరినీ మళ్లీ కొత్తగా పోస్టల్‌ బాలెట్‌కు దరఖాస్తు చేసుకోమన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరిలో పోలింగ్‌ విధుల ఆర్డర్లు వచ్చిన వారు ఇక్కడ ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. విలేకరులను పోలింగ్‌ కేంద్రాల వద్దకు అనుమతించకపోయినా పార్టీ నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం ఫోన్లతో సహా లోపలికి అనుమతించారు. ఎన్నికల పరిశీలకులు ఈ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని