logo

ఇలాక్కూడా చెబుతారా?!

గాజువాకలో  మంగళవారం నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం విని జనం అవాక్కయ్యారు. వివిధ అంశాలపై జగన్‌ చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేకపోవడంతో ఇలాక్కూడా చెబుతారా అని ఆశ్చర్యపోయారు.

Published : 08 May 2024 03:29 IST

జగన్‌ ప్రసంగానికి జనం అవాక్కు

ఈనాడు, విశాఖపట్నం: గాజువాకలో  మంగళవారం నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం విని జనం అవాక్కయ్యారు. వివిధ అంశాలపై జగన్‌ చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేకపోవడంతో ఇలాక్కూడా చెబుతారా అని ఆశ్చర్యపోయారు.

విశాఖలో రైల్వే జోన్‌ ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే జగన్‌ సర్కార్‌ ఇవ్వలేదని ప్రధాని మోదీ స్వయంగా కుండ బద్ధలు కొట్టి చెప్పారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. రైల్వే జోన్‌కు భూములు ఇచ్చినా కూడా కావాలనే అభ్యంతరాలు పెడుతున్నారన్నారు. ముడసర్లోవ రిజర్వాయిర్‌ సమీపంలోని క్యాచ్‌మెంట్‌ ఏరియా (పరివాహక ప్రాంతం)లో రైల్వే జోన్‌కు ఏపీ సర్కారు స్థలం చూపించింది. అక్కడ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలున్నాయి. ఇలా అనువుగాని చోట రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించి చేతులు దులిపేసుకుంది. అంతటితో తమపని అయిపోయిందనట్టు ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.

మళ్లీ జనం చెవిలో పూలు: ‘మాట తప్పం..మడం తిప్పం’ అనే జగన్‌ విశాఖ పరిపాలనా రాజధాని అంటూ ఉత్తరాంధ్ర చెవిలో పూలు పెడుతూ వచ్చారు. 2022 ఉగాది నాటికి జగన్‌ విశాఖకు మకాం మారుస్తారంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో మొదలైన పల్లవి ఎన్నికల ముందు వరకు చెబుతూనే ఉన్నారు. పెట్టుబడుల సదస్సు, చలనచిత్ర ప్రముఖులతో భేటీ సమయంలోనూ జగన్‌ స్వయంగా విశాఖకు మకాం మార్చేస్తున్నా అంటూ ఊదరగొట్టారు. సీన్‌ కట్‌ చేస్తే..‘మళ్లీ అధికారంలోకి వస్తే జూన్‌ 4వ తేదీన విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తాం’ అంటూ మళ్లీ అదే రాగం అందుకున్నారు.

సభకు జగన్‌ చేరుకోకముందే అధిక సంఖ్యలో ప్రజలు వెనుదిరిగారు. ప్రసంగించే సమయానికి సగానికిపైగా పాత గాజువాక రహదారి ఖాళీ అయింది. ఈ అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జగన్‌ వెంట విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని