logo

ఇచ్చేదేం లేదు.. అంతా పట్టుకుపోవడమే!

నోటి ముందు కూడు లాగేయడం జగన్‌ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు.

Published : 09 May 2024 03:58 IST

జగన్‌ మార్కు పాలన జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం
అనకాపల్లి, న్యూస్‌టుడే

నోటి ముందు కూడు లాగేయడం జగన్‌ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు. రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటానంటూ పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలకు, చేసిన పనులకు పొంతన లేదు. అనకాపల్లిలో తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని, ఎప్పటి నుంచో ఉన్న ఏరువాక కేంద్రాన్ని తరలించేసి జిల్లా రైతులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది.  

వ్యవసాయం గిట్టుబాటు కానందున జిల్లాలోని అధిక శాతం రైతులు ఉద్యాన పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. వీరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో 2017 జూన్‌లో అనకాపల్లికి అప్పటి తెదేపా ప్రభుత్వం ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసింది. అనకాపల్లి మండలం టి.వెంకుపాలెంలో ఇందుకోసం స్థలం కేటాయించారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో 2018 మే 11న తాత్కాలికంగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక ఉద్యోగిని నియమించారు. రెండేళ్లు యార్డులోనే పరిశోధన కేంద్రం కొనసాగింది. అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ఉండేవారు. దీంతో ఆయన పట్టుబట్టి ఈ కేంద్రాన్ని మంజూరు చేయించారు. స్థల సేకరణకు రూ. 6 కోట్లు, భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ. 4.81 కోట్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో దీనిని ఇక్కడ నుంచి తరలించేసింది. దీనిపై ఉద్యాన రైతులు లబోదిబోమన్నా కనీసం పట్టించుకోలేదు.

ఉద్యాన రైతుల అగచాట్లు

జిల్లాలో 10,880 హెక్టార్లు మామిడి, 27,900 హెక్టార్లలో జీడిమామిడి, 9,200 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. కూరగాయల సాగు కూడా అధికమే. ఇక్కడ దాదాపు నాలుగువేల హెక్టార్లలో వంకాయ, టమాటా, బీర, బెండ, కాకర, దోస వంటి పంటలను పండిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువగా కొబ్బరి సాగు చేస్తున్నారు. అందుకే అనకాపల్లి పరిశోధన కేంద్రంలో మామిడి, జీడిమామిడి, కొబ్బరి, కూరగాయలపై పరిశోధనలు చేసేవారు. దీనిని ఇక్కడి నుంచి తరలించేశాక సరైన యాజమాన్య పద్ధతులు చెప్పే నాథుడు లేరు. ఉద్యాన శాఖ అధికారులు బాపట్ల పరిశోధన కేంద్రం నుంచి జీడిమొక్కలు తీసుకువచ్చి రైతులకు ఇస్తున్నారు. కొబ్బరి, మామిడి మొక్కలను సొంతంగా తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. వీటిలో జిల్లాకు అనువైన రకాలు అంతగా ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఉద్యాన పంటలపై మిడతల తాడి పెరుగుతోంది. మామిడి, జీడిమామిడి పూత సమయంలో పురుగులు సోకి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పరిశోధన కేంద్రం ఉంటే వీటి నివారణకు సకాలంలో సూచనలందేవి. ఈ కేంద్రాన్ని తరలించేసి జగన్‌ సర్కారు తమ పొట్ట కొట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏరువాక.. వెళ్లిపోయే!

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. వీరు చేస్తున్న పరిశోధనలు రైతులకు పూర్తి స్థాయిలో చేరడం లేదు. రైతులు నేరుగా అనకాపల్లి రావడం తక్కువ. అందుకే శాస్త్రవేత్తలనే నేరుగా రైతుల పంటపొలాల వద్దకు పంపాలనే లక్ష్యంతో ఏరువాక కేంద్రాన్ని ఇక్కడ 2003లో ఏర్పాటు చేశారు. ఇందు కోసం పరిశోధన కేంద్రం ఆవరణలోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలను నియమించారు. జిల్లా అంతటా తిరిగేందుకు వాహన సదుపాయం కల్పించారు. వీరు గ్రామాల్లో పర్యటిస్తూ పరిశోధనా స్థానంలో నూతనంగా రూపొందించే కొత్త వంగడాల గురించి వివరించడం, పరిశోధనల ఫలితాలను చేరవేయడం చేస్తుండేవారు. గ్రామాల్లో ఆదర్శ రైతులను గుర్తించి వారి భూముల్లో నూతన వంగడాలను వేయించేవారు. రెండు దశాబ్దాలుగా అన్నదాతలకు ఎంతో ఉపయోగపడిన ఈ కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం గతేడాది గోదావరి జిల్లాలకు తరలించేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని