logo

ఉచితమే అనుకుంటే.. ఉపద్రవం తప్పదు..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 09 May 2024 05:02 IST

ఎన్నికల్లో కల్తీ, నాసిరకం మద్యం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు
అవి తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు
నాయకుల ఎరకు ఓటర్లు లొంగొద్దని నిపుణుల హెచ్చరిక
న్యూస్‌టుడే, పెందుర్తి, వేపగుంట, సబ్బవరం, పరవాడ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాసిరకం మద్యం తాగిన పలువురు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, పొట్ట, దీర్ఘకాలిక గొంతు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో వారంతా ఆసుపత్రుల పాలవడంతో పాటు బతికున్నంత కాలం ఔషధాలు వాడాల్సి రావడంతో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయి. తీవ్రమైన మద్యం అలవాటున్న వారు అకాల మరణానికి గురై కుటుంబ సభ్యులను నట్టేట ముంచుతున్నారు.

కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..

- గజ్జి నర్సింగరావు, గుల్లేపల్లి    

మా సమీప బంధువు ఒకతను మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం రేట్లు పెరగడంతో తక్కువ ధరకు వస్తుందని నాసి రకం మద్యం తాగడంతో గుండెల్లో మంట పుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. ప్రస్తుతం అతని భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో మగ దిక్కులేక ఇబ్బంది పడుతున్నారు. సంపాదన లేక కుటుంబం రోడ్డున పడింది. పిల్లలను చదివించుకోవడం కూడా ఆమెకు భారంగా మారింది.


మానసిక సమస్యలతో సతమతం

- డాక్టర్‌ పవన్‌కుమార్‌ కంపల్లి, న్యూలైఫ్‌ పునరావాస కేంద్రం

మద్యం అలవాటున్న వారిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వచ్చే వారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మద్యం అలవాటు వలన కుటుంబాల్లో అశాంతి రేగుతోంది. సమయపాలన లేకుండా తాగేవారిలో మెదడు ప్రభావితమై మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొంతమంది అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు.


చీప్‌ లిక్కర్‌  విషంతో సమానం

- డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.ఆర్‌ చక్రవర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్బవరం

శరీర అలసటను తగ్గించుకునేందుకు చాలామంది మద్యం తాగుతున్నారు. మత్తు కారణంగా శరీర అలసట తగ్గినట్లు అనిపించినా అది నెమ్మదిగా విషంలా పని చేస్తుంది. చిప్‌ లిక్కర్‌ తాగడం వల్ల వెంటనే దాని ప్రభావం కనిపిస్తుంది. దీర్ఘకాలంలో వారి నాడీ వ్యవస్థ చెడిపోయే ప్రమాదం ఉంది. నిద్ర లేమి ఏర్పడి అనేక ఇబ్బందులకు గురవుతారు. మద్యాన్ని వీలైనంత తొందరగా మానేయాలి.


కాలేయ బాధితులే అధికం

- డాక్టర్‌ అన్నాబత్తుల సతీశ్‌, ఎండీ, పల్మనాలజిస్టు

నాసిరకం మద్యం తాగడం వల్ల కాలేయ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. ఆసుపత్రులకు వచ్చే మద్యం అలవాటున్న వారిలో ఇలాంటి సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఛాతీ సంబంధిత అనారోగ్యం కూడా కనిపిస్తోంది. మద్యంలో స్పిరిట్ మోతాదు అధికంగా ఉండడం వల్ల ఉదర సంబంధిత రోగాలు కూడా పెరిగిపోతాయి.


మళ్లీ అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది..

- ఎం.జ్యోతి, ప్రహ్లాదపురం

ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న నాసిరకం, నకిలీ మద్యం కారణంగా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గ్రామాల్లో సైతం విచ్చల విడిగా బెల్టుషాపులు వెలియడంతో వాడకం విపరీతంగా పెరిగింది. మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, కుటుంబాలకు ఆసరా లేకుండా పోతోంది. ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంచడం వల్ల ఇదివరకే మానేసిన వారు సైతం మళ్లీ అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది.


మహిళల జీవితాలతో ఆడుకోవద్దు..

- కె.తులసీ సునందన, ప్రహ్లాదపురం

రాష్ట్రంలో మద్యం విచ్చలవిడి కావడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. చాలా మంది యువత మృతి చెందడంతో పాటు కొంతమంది దివ్యాంగులుగా మారి వారి తల్లిదండ్రులకు భారమవుతున్నారు. నా స్నేహితురాలి తండ్రి కూడా అలాగే మరణించారు. మగ దిక్కులేక కుటుంబం రోడ్డున పడింది. ఎన్నికల్లో నకిలీ మద్యం పంచి మహిళల జీవితాలతో ఆడుకోవద్దు.


నిజాయతీగా ఓటు వేయండి..

- జి.మహేశ్‌, అప్పికొండ

రోజంతా కాయకష్టం చేసి సంపాదించిన డబ్బును కొంతమంది మద్యానికే ఖర్చు చేస్తున్నారు. తాగకపోతే మరుసటి పని చేయలేమని చెబుతున్నారు. వారి ఇళ్ల వద్ద మహిళలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. నాసి రకం మద్యం తాగి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. పేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో పంచే మద్యానికి బానిస కాకుండా నిజాయతీగా ఓటు వేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని