logo

పశు బీమా.. దక్కని ధీమా

పశుపోషణే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలకు పశు బీమా పథకం ధీమా ఇవ్వడం లేదు. రైతుల జీవనోపాధికి పెంచుకుంటున్న మూగజీవాలు ఏటా వేల సంఖ్యలో వివిధ వ్యాధులు, ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి.. రెండేళ్లుగా నష్ట పరిహారం కోసం పాడి రైతులు

Published : 17 Jan 2022 05:58 IST

రూ.6 కోట్ల పరిహారానికి ఎదురుచూపులు 


కళేబరానికి పోస్టుమార్టం చేస్తున్న పశువైద్యాధికారి గంగాధరరావు

న్యూస్‌టుడే, కొత్తవలస, విజయనగరం కలెక్టరేట్‌/వ్యవసాయ విభాగం పశుపోషణే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలకు పశు బీమా పథకం ధీమా ఇవ్వడం లేదు. రైతుల జీవనోపాధికి పెంచుకుంటున్న మూగజీవాలు ఏటా వేల సంఖ్యలో వివిధ వ్యాధులు, ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి.. రెండేళ్లుగా నష్ట పరిహారం కోసం పాడి రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. జిల్లా మొత్తం మీద ఈ బకాయి రూ.6 కోట్లు పైనే ఉంది. గతంలో ప్రైవేటు కంపెనీల ద్వారా ప్రీమియంలు చెల్లించగా.. ప్రస్తుతం ప్రభుత్వమే వైఎస్సార్‌ పశు బీమా పేరిట రైతుల తరఫున ఆ సొమ్ము చెల్లిస్తోంది. ప్రారంభంలో బాగానే ఉన్నా.. రెండేళ్ల నుంచి అమల్లో ఆటంకాలు కలుగుతున్నాయి.
జిల్లాలో ఆవులు 4,90,989, గేదెలు 1,35,850, గొర్రెలు 5,40,336, మేకలు 2,71,295 ఉన్నాయి.  ఏటా వేల సంఖ్యలో పశువులు/జీవాలు మృత్యువాత పడుతున్నాయి. కారణాలు వివరిస్తూ స్థానిక పశువైద్యులు ఉన్నతాధికారులకు నివేదికలిస్తున్నా పరిహారం విడుదలలో జాప్యం కొనసాగుతోంది. 
లెక్కలిలా...!
2019 ఆగస్టులో ప్రభుత్వం పశు నష్ట పరిహారం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. మొదటి ఏడాదిలో జిల్లాలో 857 మంది లబ్ధిదారులకు చెందిన 1,007 క్లెయిమ్‌లకు రూ.2,56,99,000 పరిహారం అందించారు. 2020-21లో (ఆగస్టు వరకూ) 917 మంది లబ్ధిదారులకు చెందిన 1,031 క్లెయిమ్‌లకు రూ.2,63,04,000 జమైంది. ఆ ఏడాది సెప్టెంబరు నుంచి 2021 డిసెంబరు వరకు రూ.6,01,80,000 బకాయి ఉంది. 2,001 మంది రైతులకు సంబంధించి 1,844 క్లెయిమ్‌లను పరిష్కరించాలి. వీటికి సంబంధించిన పత్రాలు సీఎఫ్‌ఎంఎస్‌కు పంపగా ఆర్థికశాఖ నుంచి అనుమతి రావాలని అధికారులు చెబుతున్నారు.  
పథకం అమలు ఇలా..
మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు 12 నంబర్లున్న ఇనఫ్‌ ట్యాగ్‌ను పశుసంవర్ధక శాఖ వేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకు రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కనీసం ఒక ఈత ఈని ఉంటేనే పరిహారానికి అర్హత లభిస్తుంది. పశువు అనారోగ్యానికి గురైతే పాడిరైతు సచివాలయంలోని పశువైద్య సహాయకులకు సమాచారమిస్తే ప్రాథమిక చికిత్స చేస్తారు. పరిస్థితి విషమిస్తే ఆ పరిధిలోని పశువైద్యాధికారికి తెలపాలి. పశువు మరణిస్తే వైద్యాధికారికి సమాచారమివ్వాలి. వీరు పోస్టుమార్టం చేసి పరిహారానికి నివేదిక పంపుతారు. 

ఇంట్లో ఖర్చులు గట్టెక్కేవి..
వ్యవసాయానికి అనుబంధంగా ఓ ఆవును పెంచాను. దీని పాల ద్వారా ఇంట్ల్లో చిల్లర ఖర్చులు ఒడ్డెక్కేవి. అకస్మాత్తుగా చనిపోయింది. రూ.30 వేలు ఖరీదు చేసే ఆవును కోల్పోయాను.పరిహారం రాలేదు.  -     
-జి.స్వామినాయుడు, పెదబోరుబంద, సాలూరు మండలం.

ఏడాదైనా రాలేదు...
ఆవు చనిపోయి ఏడాదైంది. నేటికీ పరిహారం రాలేదు. పలుమార్లు పశుసంవర్థక శాఖ అధికారులను అడిగాను. ప్రభుత్వానికి నివేదిస్తామని చెబుతున్నారు. 
-బసవ రాంబాయి, గాజులరేగ, విజయనగరం.

వెంటనే అందిస్తే మేలు
పశువులు నష్టపోయినపుడు వెంటనే పరిహారం అందిస్తే పాడి రైతుకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే అందించాలి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. - పైల అప్పలస్వామి, జిన్నాం, గజపతినగరం

పరిహారం తీరిది...
పాడి ఆవులు మరణిస్తే సంబంధిత రైతు ఈ పథకం ద్వారా నష్టపరిహారం పొందొచ్చు. ఇందులో దేశవాళీ(నాటు) ఆవు, గేదె చనిపోతే రూ.15,000, మేలుజాతి ఆవు, గేదె చనిపోతే రూ.30,000 పరిహారం అందిస్తారు. గొర్రెలు, మేకలకు రూ.6,000 చొప్పున ఇస్తారు. ఆవులు, గేదెల విషయంలో ఒక్కో రైతు ఏడాదికి గరిష్ఠంగా అయిదు పశువులకు పరిహారం పొందొచ్చు. గొర్రెలు, మేకలు చనిపోతే ఏడాదికి గరిష్ఠంగా రూ.1,20,000 పొందొచ్చు. వీటిని పూడ్చడానికి మట్టి ఖర్చులకు అదనంగా రూ.500 ఇస్తారు. రైతు బ్యాంకు ఖాతాకే నేరుగా పరిహారం జమచేస్తారు.

రెండు మండలాల్లో 91 క్లెయిములు 
కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో 91 క్లెయిమ్‌లు పరిష్కారం కావాల్సి ఉంది. 118 ఆవులు/మేకలు, మూడు క్లెయిమ్‌ల్లో గొర్రెలు, మేకలకు పరిహారం అందాలి. పశువు చనిపోయిన తర్వాత పోస్టుమార్టంచేసి పరిహారం కోసం క్లెయిములు పెడుతున్నాం. 
-డాక్టరు బి.గంగాధరరావు, పశువైద్య సహాయ సంచాలకుడు, కొత్తవలస
సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి రావాలి
జిల్లాలో నష్ట పరిహారం కింద రూ.6 కోట్లు పైనే చెల్లించాల్సి ఉంది. ఇందు కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెట్టాం. రిజర్వు బ్యాంకు నుంచి నిధులు విడుదల కావాలి. వచ్చిన వెంటనే అందిస్తాం.
- డాక్టరు ఎన్వీ రమణ, పశుసంవర్ధకశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని