logo

అనర్హులు 19,996 మంది ?

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఆపై దాటితే లబ్ధిదారులు బిల్లు కట్టాలి.  రాయితీ విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. ఈ కేటగిరీలో అనర్హులు ఎక్కువ

Published : 20 May 2022 04:22 IST

 200 యూనిట్ల లోపు వాడే లబ్ధిదారులపై సర్వే


ఎస్‌ఈ పి.నాగేశ్వరరావు

గంటస్తంభం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఆపై దాటితే లబ్ధిదారులు బిల్లు కట్టాలి.  రాయితీ విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. ఈ కేటగిరీలో అనర్హులు ఎక్కువ శాతం మంది లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు, ఆదాయ పరిమితికి మించిన వారు లబ్ధి ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఎంత మంది, వారు ఎక్కడ నివసిస్తున్నారు, వారిలో ఉద్యోగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? పట్టణాల్లో నివసించే వారు ఎంతమంది? గ్రామాల్లో ఉంటున్నవారు ఎందరు? వంటి వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా అనర్హులను గుర్తించి వారికి నెలవారీ బిల్లింగు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ విజయనగరం సర్కిల్‌ పరిధిలో సర్వే చేయాలని సచివాలయాల్లోని ఎనర్జీ సహాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 
ఆ కనెక్షన్లపై ఆరా 
ఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం 6,57,698 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్లలోపు వాడుతున్న ఎస్సీల సర్వీసులు 58,354, ఎస్టీల కనెక్షన్లు 42,569 ఉన్నాయి. ప్రభుత్వం ఎస్సీల రాయితీకి ఏటా రూ.10.95 కోట్లు, ఎస్టీలకు రూ.5.19 కోట్లు భరిస్తోంది. ఇది వరకు లబ్ధిదారులు ఎక్కడున్నా కులధ్రువీకరణ పత్రంతో పాటు, ఆదాయ పత్రం, ఆధార్, వినియోగదారుని విద్యుత్తు బిల్లు, బియ్యం కార్డు వంటివి సమర్పిస్తే లబ్ధి చేకూర్చేవారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఏడాదికి పట్టణాల్లో రూ.1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.22 లక్షలు ఆదాయ పరిమితి విధించారు. తాజాగా 19,996 మంది అనర్హులు ఉన్నారనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. 
నివాస ప్రాంతంతో సంబంధం లేదు 
లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లోనే నివాసం ఉండాలన్న నిబంధన ఏమీ రాలేదు. ఉద్యోగులు, ఇతర అనర్హతలున్న వారు 30 శాతానికి పైగా లబ్ధి పొందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నాం. లబ్ధిదారులు ఎక్కడ నివాసం ఉన్నా ఫర్వాలేదు. వారి అర్హతకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పిస్తే చాలు. రాయితీ వర్తిస్తుంది. 
- పి.నాగేశ్వరరావు, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని