logo

తాగునీరో జగనన్న!!

వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

Updated : 18 Apr 2024 06:25 IST

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల

వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కనీసం అందుబాటులో ఉన్న పథకాలనూ సద్వినియోగం చేసుకోని ఈ సర్కారు గతంలో నిర్మించిన వాటినీ మూలకు తోసేసింది. కొత్తగా మంజూరైనా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత అయిదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఈ పాపం జగనన్నదే.


సమగ్ర తాగునీరు.. ఎప్పటికో?

పార్వతీపురం జిల్లా కేంద్రంలోనూ అదే దుస్థితి. దాదాపు 25 ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సమగ్ర తాగునీటి పథకం ఏర్పాటుకు తెదేపా హయాంలో చర్యలు చేపట్టారు. ఈమేరకు రూ.63.63 కోట్ల నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వం మారాక ప్రక్రియ ఆగిపోయింది. 2022లో ఎమ్మెల్యే జోగారావు మరోసారి శంకుస్థాపన చేశారు. పురపాలక కార్యాలయం ముందు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలినాళ్లలో పండావీధిలో రోడ్డును తవ్వేసి కొంత మేర పైపులు వేసి చేతులు దులిపేసుకున్నారు.

నగరంలోని లంకాపట్నంలో నీటి కోసం మహిళల పాట్లు


ఐదేళ్లలో ఐదు కిలోమీటర్లే..

పాలకొండ నగర పంచాయతీలో నాన్‌ అమృత్‌ పథకం పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. 2018లో రూ.57 కోట్ల నిధులు రాగా.. ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ప్రారంభమయ్యాయి. 56 కిలోమీటర్ల మేరకు లింకు పైపులు వేయాలి. గత అయిదేళ్లలో 5 కిలోమీటర్లు వేశారు. నాగావళి నుంచి 4 కి.మీల మేర ప్రధాన పైపు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు కదలిక లేదు.


సాలూరులో ఇలా..

ఈ పురపాలికలో 1960 నాటి పథకమే ఆధారం. మరమ్మతులకు గురైనా, శిథిలావస్థకు చేరినా అక్కడే సిబ్బంది విధులు నిర్వహిస్తూ నీటి సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 11,780 నివాస గృహాలుండగా కేవలం 3,650 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 230కి పైగా ఉన్న చేతిపంపుల్లో వందకు పైబడి మూలకు చేరాయి. వాడుక నీటి కోసం వార్డుల్లో నీటి పథకాలు ఏర్పాటు చేసినా నిర్వహణ సక్రమంగా లేక పది వరకు పడకేశాయి. వృథా సైతం ఎక్కువగానే ఉంది. నాన్‌ అమృత్‌ పథకం కింద రూ.69.68 కోట్లు మంజూరు కాగా.. గతేడాది సెప్టెంబరులో ఉపముఖ్యమంత్రి రాజన్నదొర శిలాఫలకం వేసి వదిలేశారు.


నాటి పథకాలే దిక్కు..

బొబ్బిలి పట్టణంలో కష్టాలు తీవ్రమయ్యాయి. ఇక్కడ 60 వేలకు పైగా జనాభా ఉండగా 20 వేలకు మాత్రమే నీరందుతోంది. రోజూ అందించాల్సిన దానిలో మూడో వంతు సరఫరా చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన పథకాలే నేటికీ దిక్కవుతున్నాయి. కొత్త పథకం ఏర్పాటుకు రూ.94 కోట్ల నిధులు వచ్చాయి. రెండుసార్లు శంకుస్థాపన చేశారు. సకాలంలో పూర్తిచేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. కానీ అయిదేళ్లలో కేవలం పదిశాతం మాత్రమే జరిగింది. ఐటీఐ కాలనీ, మిలటరీ కాలనీ, ఇందిరమ్మ, ప్రసాదనగర్‌, దాడితల్లి, నాయుడుకాలనీల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి.


నగరపాలక సంస్థలో..

విజయనగరం నగర పాలకసంస్థలో ఏళ్లనాటి రాణి అప్పలకొండయాంబ, రామతీర్థాలు, ముషిడిపల్లి పథకాల నుంచే సరఫరా సాగుతోంది. 2011లో సమగ్ర నీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. కానీ పూర్తిస్థాయిలో జరగలేదు. జల వనరుల శాఖ పరిధిలో తారకరామ తీర్థసాగర్‌పై ఆధారపడి రూ.38 కోట్లతో పైపులైన్‌, రిజర్వాయర్‌ పనులు చేశారు. అమృత్‌ 2.0 పథకం ద్వారా రూ.63 కోట్లు మంజూరు కాగా, ముషిడిపల్లిలో నీటి పథకం, పైపులైన్ల కోసం కేటాయించారు. ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మాణానికి మరో రూ.10 కోట్లు వచ్చింది. ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన పథకాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.


నగర పంచాయతీలో..

నెల్లిమర్ల నగర పంచాయతీలో పైపులైన్లు, రిజర్వాయర్ల నిర్మాణానికి అతీగతీ లేదు. ఇక్కడి జనాభాలో సగం మందికే దాహార్తి తీరుతోంది. ఏఐబీబీ కింద కొత్త పథకం ఏర్పాటుకు గత ప్రభుత్వం రూ.34.97 కోట్ల నిధులు మంజూరు చేసింది. వైకాపా వచ్చి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. మంత్రి బొత్స ఆ పనులను ప్రారంభించారు. నేటికీ పూర్తికాలేదు.

జరజాపుపేటలో అసంపూర్తిగా రిజర్వాయర్‌


రాజాంలో ఇలా..

రాజాం పట్టణానికి రేగిడి మండలం సంకిలి వద్దగల నాగావళి నది నుంచి రావాలి. అక్కడి నీటి బావుల్లో 120 హెచ్‌పీ మోటార్లు మూడు ఉండగా.. నెల రోజుల క్రితం ఒకటి కాలిపోయింది. ఇంతవరకు మరమ్మతులు లేవు. ఇక్కడి జనాభాలో సగం మందికి నీళ్లిస్తున్నారు. తాజా పరిస్థితితో 24 వార్డుల్లో తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ పురపాలికకు అన్ని వనరుల నుంచి రూ.10 కోట్ల మేర ఆదాయం వస్తున్నా.. కొత్త పథకాలు లేవు.


వరుస కడుతున్నాం..
- ఆర్‌.సింహాచలమమ్మ, బొబ్బిలి

బొబ్బిలి పట్టణంలోని మీగడ వీధిలో నీరు పట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాం. కుళాయిలు తక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తక్కువగా ధార వస్తోంది. దీంతో గంటల తరబడి క్యూ కడుతున్నాం. పండగ వేళల్లో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు.


నీరు రావడం లేదు..
- రత్నకుమారి, స్టేడియంపేట, విజయనగరం

మా ప్రాంతంలో రూ.200 కుళాయిల నుంచి నీరు రావడం లేదు. ఐదేళ్ల క్రితమే వాటిని వేశారు. కానీ ఇంతవరకు కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో వీధి కుళాయిల వద్దకు వెళుతున్నాం. ఒక్కోసారి దొరకడం లేదు. అధికారులు స్పందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని