logo

ఆదివారం అందని వైద్య సేవలు

పేరుకే 24 గంటల ఆసుపత్రులు.. ఆదివారం వస్తే అక్కడ ఎవరూ ఉండరు. అన్ని దవాఖానాల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. ఆ రోజూ సేవలు ఎలా అందుతున్నాయో ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది.

Updated : 23 May 2022 06:49 IST

పేరుకే 24 గంటల ఆసుపత్రులు.. ఆదివారం వస్తే అక్కడ ఎవరూ ఉండరు. అన్ని దవాఖానాల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. ఆ రోజూ సేవలు ఎలా అందుతున్నాయో ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. జిల్లా ఆసుపత్రిలో ఇన్‌పేషంట్లను చూసుకోవడానికి కొందరు వైద్యులు వచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే కింది స్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు.


డాక్టర్లు ఎవరూ రాలేదు


ఖాళీగా ఉన్న మందులిచ్చే గది

పాలకుర్తి : మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఎవరూ విధులకు రాలేదు. ఉదయం పది గంటల వరకు నలుగురు రోగులు వైద్యశాలకు రాగా.. సాఫ్ట్‌నర్సు లేకపోవడంతో క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్త(ఏఎన్‌ఎం) వనజ వారికి మందులు అందజేశారు. ఇద్దరు ఆశ కార్యకర్తలతోపాటు దిగువ స్థాయి సిబ్బంది కూడా ఉన్నారు. ముత్తారం గ్రామానికి చెందిన ఓ గర్భిణి రాగా, ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ప్రసవానికి సమయం ఉండడంతో సోమవారం వైద్యులు వస్తారని చెప్పారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 6

వచ్చిన వారు : 0


బయట రోగులను చూడరట..

జనగామటౌన్‌ : జనగామ జిల్లా ఆసుపత్రికి ఆదివారం ఓపీకి సెలవు ప్రకటించడంతో రోగులు ఎవరూ పరీక్షలకు రాలేదు. అత్యవసర సేవలకు వస్తే పరీక్షలు చేయడానికి వైద్యులు విధుల్లో ఉన్నారు. అప్పటికే ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి వార్డులో డాక్టర్‌ ఉల్లెంగుల ప్రవీణ్‌ వైద్య సేవలు అందించారు. రోగుల వద్దకు వెళ్లి వైద్య సిబ్బంది గ్లూకోజ్‌లు, ఇతర సెలైన్లు ఎక్కించారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 14

వచ్చిన వారు : 6

మందులు తీసుకెళ్తున్నా..

- సోమక్క, సిరిసన్నగూడెం

గత రెండు, మూడు రోజులుగా జ్వరం వస్తోంది. అందుకే ఆదివారం వైద్యులను చూపించుకుందామని ఆసుపత్రికి వచ్ఛా వారెవరూ రాలేదని సిబ్బంది చెప్పడంతో గత్యంతరం లేక కొన్ని ఔషధాలు అందజేశారు. చేసేదేమి లేక వెళ్లిపోతున్నా. మళ్లీ సోమవారం ఆసుపత్రికి వస్తాను.


విధులకు ఏఎన్‌ఎం ఒకరే హాజరు

జఫర్‌గఢ్‌ : జఫర్‌గఢ్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) సెలవు దినంగానే ఉంది. నలుగురు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులున్నా ఒకరూ రాలేదు. స్వీపర్‌, ఏఎన్‌ఎం మాత్రమే హాజరయ్యారు. రెండు గంటల వ్యవధిలో 20 మంది రోగులు వచ్చారు. వారి ఇబ్బంది తెలుసుకొని ఏఎన్‌ఎం కమల ఫార్మసిస్టు(మందులు ఇచ్చే) గదికి వెళ్లి మాత్రలు అందజేశారు. మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన గర్భిణికి పురిటి నొప్పులు వస్తున్నాయని స్థానిక ఆశ కార్యకర్త ఏఎన్‌ఎంకు ఫోన్లో తెలియజేయగా, వైద్యాధికారి భరత్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. 12 గంటల తర్వాత ఆయన వచ్చి పరీక్షించి, సాధారణ కాన్పు కాదని ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో ఆమెను వరంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 4

వచ్చిన వారు : 0


మాతా శిశు ఆరోగ్య కేంద్రం..

జనగామ మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి(ఎంసీహెచ్‌) ఆదివారం ఓపీ సేవలకు సెలవు కావడంతో గర్భిణులు పరీక్షలు చేయించుకోవడానికి రాలేదు. ప్రసూతి కాన్పుకు సిద్ధంగా ఉన్న పలువురికి డాక్టర్‌ స్వప్నారాథోడ్‌ వైద్య పరీక్షలు చేశారు. అప్పటికే మరికొందరికి కాన్పు కోసం మరో వైద్యురాలు శస్త్ర చికిత్స గదిలో ఉన్నారు. అనస్తీషియా వైద్యుడు కూడా అందుబాటులో ఉన్నారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 21

వచ్చిన వారు : 6


స్టాఫ్‌నర్సే దిక్కు..

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: సీహెచ్‌సీకి వేర్వేరు సమయాల్లో పది మంది రోగులు వచ్చారు. వైద్యుడు అందుబాటులో లేకపోయినా.. గదిలో ఫ్యాను తిరుగుతూ కనిపించింది. వెంకటరమణ అనే స్టాఫ్‌నర్సు వచ్చిన వారికి చికిత్స అందించారు. అవసరమైన వారికి మందులు ఇచ్చి పంపించారు. సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. ప్రతి వారం ఇదే పరిస్థితి ఉంటుందని రోగులు పేర్కొన్నారు. ఒక గర్భిణి రాగా పరీక్షల విభాగం లేదంటూ వెనక్కి పంపించారు. వారు జనగామ ఆసుపత్రికి వెళ్లిపోయారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 6

వచ్చిన వారు : 0


అందుబాటులో వైద్యులు

బచ్చన్నపేట : బచ్చన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆదివారం ఓపీకి ఏడుగురు వచ్చారు. వైద్యులు ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉన్నారు. ఒక స్టాఫ్‌ నర్సు కూడా ఉన్నారు.

మొత్తం వైద్యుల సంఖ్య: 6

వచ్చిన వారు : 0


నిబంధనలు ఇలా..

* జిల్లా, ప్రసూతి ఆసుపత్రుల్లో ఆదివారం అత్యవసర వైద్యసేవలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇన్‌పేషంట్లకు చికిత్స అందిస్తారు. * సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డ్యూటీ వైద్యులు అందుబాటులో ఉండాలి. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రులకు పంపించాలి. సాధారణ, ప్రసూతి సేవలు అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని