logo

నేడే రావణ వధ!

వరంగల్‌ మహా నగరం కరీమాబాద్‌ ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో బుధవారం దసరా ఉత్సవాలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 05 Oct 2022 02:17 IST


రూపుదిద్దుకుంటున్న రావణుడి ప్రతిమ

న్యూస్‌టుడే, కరీమాబాద్‌: వరంగల్‌ మహా నగరం కరీమాబాద్‌ ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో బుధవారం దసరా ఉత్సవాలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వరంగల్‌ మహా నగరపాలక, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉత్సవ సమితి 75 అడుగుల రావణుడి ప్రతిమను తయారు చేయిస్తోంది. బుధవారం సాయంత్రం 6 నుంచి  రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉర్సు నుంచి కళాకారులు ఎడ్లబండిపై శ్రీసీతారామ, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలతోపాటు కళాకారులు వేషధారణలో మేళతాళాల మధ్య ఉర్సుగుట్ట రంగలీలా మైదానానికి తరలివస్తారు. నగర పాలకసంస్థ  రంగుల విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన(ఎలక్ట్రికల్‌)  రావణ సంహార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా రావణుడి ప్రతిమను బాణసంచాతో కాల్చే కార్యక్రమం ప్రారంభిస్తారు. సుమారు గంటపాటు రంగురంగుల బాణసంచా వెలుగుల్లో సంబరాలు మిన్నంటుతాయి. రావణున్ని శ్రీసీతారాములు సంహరించే ఘట్టం(ఎలక్ట్రికల్‌) నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈసారి ఉర్సుగుట్టపై లేజర్‌ షో ఏర్పాటు చేసి శ్రీసీతారామ, రావణ ఘట్టం చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు తెలిపారు. శివనగర్‌ బతుకమ్మ స్థలంలో, 39 వ డివిజన్‌ విద్యానగర్‌కాలనీలోనూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా  ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు మర్రి శ్రీనివాస్‌,  గడ్డం సుధాకర్‌ అచ్చ వినోద్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని