logo

పరిశీలిస్తూ.. భరోసానిస్తూ..!

వడగళ్ల వర్షానికి సర్వం కోల్పోయిన అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.

Updated : 24 Mar 2023 05:26 IST

వడగళ్ల బాధిత రైతులకు ధైర్యం చెప్పిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, నర్సంపేట, పెద్దవంగర, పాలకుర్తి, నర్సంపేట రూరల్‌, దుగ్గొండి

డగళ్ల వర్షానికి సర్వం కోల్పోయిన అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అన్నదాతలను ఆదుకునే సంకల్పంతో ఆయన స్వయంగా మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు దయాకర్‌, కవిత, సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఏ పంటకైనా ఎకరానికి రూ.10 వేలు ఆలస్యం చేయకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.

* క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చేతికొచ్చే సమయంలో వందశాతం నష్టపోయిన మిర్చి, వరి, మొక్కజొన్న, మామిడి, టమాట, బెండ తదితర పంటలను సాగు చేసిన రైతుల వద్దకు వెళ్లారు. ఆయా పంటల సాగుకు అయిన పెట్టుబడి ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి పైపులు, ఇతర వ్యవసాయ పరికరాలు సైతం వడగళ్ల ధాటికి ముక్కలు కావడాన్ని చూసి కలత చెందారు. రాళ్ల తాకిడికి చెట్ల కొమ్మలు, మొదళ్లకు తగిలిన దెబ్బల గుర్తులను చూసి విస్తుపోయారు.

అడవిరంగాపురంలో మొక్కజొన్నచేనులో వడగళ్లకు పగిలిన పైపును పరిశీలిస్తూ..

* అడవిరంగాపురానికి చెందిన సింగతి లక్ష్మి మూడెకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో వరి సాగు చేశారు. పొట్టదశలో దెబ్బతిన్న వరిపైరును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. అవి కూడా రాత్రి సమయంలో పడడం వల్ల పంటలను కోల్పోయాం.  ఆ వర్షం పగలు పడితే ప్రాణ నష్టం జరిగేదని ముఖ్యమంత్రికి వివరించారు.

* ఈ పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, శంకర్‌నాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య, వినయ్‌భాస్కర్‌, ధర్మారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్లు బిందు, గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సుధాకర్‌రావు, చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ పాలనాధికారులు శశాంక, ప్రావీణ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వరి పశువుల మేతకు కూడా పనికి రాదు..  

వరంగల్‌ జిల్లా అడవిరంగాపురంలో నేలవాలిన మొక్కజొన్న చేన్లు.. పొరకలైన మిర్చి తోటలు.. పీకలుగా మారిన వరి పైర్లు.. మట్టికొట్టుకుపోయిన కూరగాయల తోటలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం ఎక్కువే జరిగిందంటూ రైతులతో మాట్లాడుతూ అన్నారు. మహిళా రైతులతో ముచ్చటించారు. ఇదే క్రమంలో గడ్డిపోచలుగా మిగిలిన వరిని చూసిన సీఎం ఈ పైరు ఎవరిది అని అడిగారు. అక్కడే ఉన్న రైతు భూంపెల్లి రజినీకర్‌రెడ్డి.. సారూ నాదే అంటూ ముందుకొచ్చారు.

ఇద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.

సీఎం: రజినీకర్‌రెడ్డి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. అందులో ఏం పంటలు సాగు చేశావు?
రైతు: సారూ ఐదెకరాలు ఉంది. రెండెకరాల్లో వరి, మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను.
సీఎం: పెట్టుబడి ఖర్చులు ఎంత అయ్యాయి?
రైతు: ఎకరానికి రూ.30 వేల చొప్పున ఐదెకరాలకు ఇప్పటి వరకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాను.
సీఎం: పంటలకు సాగునీరు కాలువలా.. బావులా? కరెంట్‌ సరఫరా ఏవిధంగా వస్తుంది.
రైతు: బావుల ద్వారానే సాగునీరందిస్తున్నాను. కరెంట్‌ సరఫరా బాగుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు.
సీఎం: వడగళ్ల వానతో దెబ్బతిన్న వరిని చూస్తూ పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయింది. భారీ నష్టం వాటిల్లింది. ఆధైర్యపడకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తాం.


పర్యటన వివరాలు..

మధ్యాహ్నం 1:30: ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా చేరుకున్నారు..
1:40 రెడ్డికుంటతండా హెలిప్యాడ్‌ నుంచి బస్సులో వెళ్లి పంటలను పరిశీలిస్తూ మొక్కజొన్న సాగు చేసిన రైతు జాటోతు సోమ్లా, మిర్చి పంట సాగు చేసిన రైతు జాటోతు సోమన్నతో మాట్లాడారు.  
1:55 మామిడితోట సాగు చేసిన రైతు జాటోతు నెహ్రూ వద్దకు వెళ్లి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
1.56 రైతులను ఉద్దేశించి మాట్లాడారు
2:05 బస్సులో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి భోజనం చేశారు..
2:20 హెలిప్యాడ్‌ చేరుకున్నారు.
2:40 హెలికాప్టర్‌లో వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురానికి చేరుకున్నారు
2:43 వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, విద్యుత్తు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. నష్టం జరిగిన తీరును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి    వివరించారు
2:47 ప్రత్యేక వాహన శ్రేణిలో అడవిరంగాపురం శివారులోని పంటల పరిశీలనకు వెళ్లారు.
2:51 రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు.
3:28: మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ బయలుదేరి వెళ్లారు.


రెండు హెలికాప్టర్ల రాక: ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ కలిసి ఒక హెలికాప్టర్‌, సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ కలిసి మరో హెలికాప్టర్‌లో 10 నిమిషాల వ్యవధిలో పంటల పరిశీలన చేసిన ప్రాంతాలకు చేరుకున్నారు.

మూడంచెల భద్రత: పోలీసులు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా వద్ద, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పెద్దవంగరలో మహబూబాబాద్‌ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, అడవిరంగాపురంలో వరంగల్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

అనుమతి నిరాకరణ: ముఖ్యమంత్రి పరిశీలించే పంట పొలాలకు మూడు, ఐదు కిలోమీటర్ల ఆవల నుంచే పోలీసులు బందోబస్తు చేపట్టారు. రైతులతో పాటు మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. అధికార పార్టీ నాయకులకు సైతం అనుమతివ్వక పోవడంతో వారు నిరాశకు గురయ్యారు. పంట చేల నుంచి రైతులను బయటకు పంపడం విమర్శలకు తావిచ్చింది.


సీఎం సారూ.. మా పంటలు చూడండి

పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా శివారులో  హెలిప్యాడ్‌ పక్కనే ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలను ముఖ్యమంత్రికి చూపించాలంటూ స్థానిక రైతులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి వారికి నచ్చజెప్పారు


స్టాళ్ల పరిశీలన: వడగళ్లతో దెబ్బతిన్న మామిడి, అరటి, టమాట, పుచ్చ తదితర పంటలకు సంబంధించిన కాయలతో స్టాళ్లను హెలిప్యాడ్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన సీఎం ఆయా ఉత్పత్తులకు సంబంధించిన రైతులతో మాట్లాడి పరిహారం అందిస్తామన్నారు. అప్పుడు కొంత మంది రైతులు పరిహారం రూ.లక్ష వరకు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని