logo

సుదీర్ఘ ఉద్యమ ఫలితం..!

సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో..

Published : 24 Sep 2023 04:49 IST

మల్లంపల్లి మండలం ఏర్పాటుకు గెజిట్‌ విడుదల

సంబరాల్లో పాల్గొన్న తాతాల్కిక జడ్పీ ఛైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, గ్రామస్థులు

ములుగు, న్యూస్‌టుడే: సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో.. ఆ ప్రాంత వాసుల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఈ ప్రాంత వాసుల శనివారం రాత్రి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మూడు రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామ పంచాయతీలతో కొత్త మండలం ఆవిర్భవించబోతోంది.

ఏళ్ల నాటి కల

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనకు ముందు నుంచే మల్లంపల్లిని మండలం చేయాలని ఆ ప్రాంత వాసులు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలతో పాటు నిరాహార దీక్షలు చేశారు. జరిగిన ఎన్నికల్లో మల్లంపల్లి మండలం ఒక అంశంగా మారగా, హామీలతోనే కాలం గడిచిపోయింది. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యంతో ప్రజలు కదిలారు. ఎదోవిధంగా వారి ఆకాంక్షను వెలిబుచ్చారు. మల్లంపల్లి మండలాన్ని తప్పకుండా సాధిస్తామని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ సైతం ఛాలెంజ్‌ చేశారు. ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం మరుగున పడింది. మల్లంపల్లి మండలం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అనేక మండలాలు, రెవెన్యూ గ్రామాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా మల్లంపల్లి ప్రస్తావన రాలేదు. ఎన్నికల సమయాన్ని అదనుగా భావించి డిమాండును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఎలాగైనా మండలాన్ని సాధించాలనే లక్ష్యంతో ఐక్య కార్యాచరణ పేరుతో కమిటీని వేసుకొని ఉద్యమానికి సిద్ధమయ్యారు.

పంచాయతీలు ఇవీ..

మండలం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ గ్రామాలు, పంచాయతీలు, వాటి పరిధిలోని జనాభా తదితర అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలు వాటి పరిధిలోని శ్రీనగర్‌, భూపాల్‌నగర్‌, శివతండా, మహ్మద్‌గౌస్‌పల్లి, దేవనగర్‌, ముద్దునూరు తండా, గుర్తూరు తండా, కొడిళలకుంటలతో పాటు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధి కాట్రపల్లి రెవెన్యూ గ్రామంతో పాటు నూర్జాన్‌పల్లి, సాదన్‌పల్లి, రాజుపల్లి గ్రామాలు మల్లంపల్లి మండలం పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలతో మండలం చేసేందుకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ములుగు, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను అభ్యంతరాల స్వీకరణకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. అన్ని పంచాయతీ ప్రజల సమ్మతితోనే మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిన దృష్ట్యా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  •  ములుగు మండలంలో ఇప్పటి వరకు 32 పంచాయతీలున్నాయి. కొత్తగా మల్లంపల్లి మండలం చేయడంతో ములుగు మండలం పరిధిలోని 10 పంచాయతీలు తగ్గనుండగా, 22 పంచాయతీలతో ములుగు మండలం పరిమితం కానుంది. 14 పంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. ఆత్మకూరు, శాయంపేట, నల్లబెల్లి సరిహద్దు మండలాలుగా ఏర్పడనున్నాయి.

జిల్లాలో పది మండలాలు  

ఇప్పటి వరకు తొమ్మిది మండలాలకే పరిమితమైన ములుగు జిల్లా ఇక నుంచి 10 మండలాలతో విస్తరించనుంది. ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం సరసన మల్లంపల్లి మండలం చేరనుంది.


కుసుమ జగదీశ్వర్‌ పేరుతో..

మండలం ఏర్పాటు అనేది మాజీ జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ కలగా మిగిలిపోవడంతో.. ఆయన పేరుతో మండలం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.  

  •  మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 17,768 మంది జనాభా ఉన్నారు.

2014 నుంచి పోరాటం  
- చందా కుమారస్వామి, మల్లంపల్లి సర్పంచి

2014 నుంచి మండలం సాధించేందుకు ఉద్యమం సాగిస్తున్నాం. మల్లంపల్లి దాని చుట్టుపక్కల 36 గ్రామాల ప్రజలు మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ మండలాన్ని ప్రకటించారు. కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ కవిత, రెడ్కో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ప్రస్తుత తాత్కాలిక జడ్పీ ఛైర్‌ పర్సన్‌ బడే నాగజ్యోతిలకు కృతజ్ఞతలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని