logo

క్రికెట్‌ ఉచిత శిక్షణ.. బాలల ఆసక్తి

వేసవిలో ఐపీఎల్‌ క్రికెటర్లకు వినోదాన్ని పంచుతోంది. చాలా మంది బాలలు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ), భూపాలపల్లి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

Published : 16 Apr 2024 04:40 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి : వేసవిలో ఐపీఎల్‌ క్రికెటర్లకు వినోదాన్ని పంచుతోంది. చాలా మంది బాలలు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ), భూపాలపల్లి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో వేసవిలో ఉచితంగా క్రికెట్‌ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ సారి వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి జిల్లాతో పాటు వరంగల్‌లో వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతమైన గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా క్రికెట్‌ శిక్షణ అవకాశం కల్పిస్తోంది. ఇందులో రాణించే క్రీడాకారులకు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

సౌకర్యాల కల్పన ..

క్రికెట్‌ శిక్షణకు వచ్చే అండర్‌- 10 నుంచి అండర్‌-23 క్రికెటర్లకు క్రికెట్‌ సంఘం తరఫున అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. రోజూ ఉదయం సింగరేణి క్రీడా మైదానంలో హాజరుకావాల్సి ఉంటుంది. కోచ్‌లతో సీనియర్‌ క్రీడాకారులు లేదా హెచ్‌సీఏ నుంచి వచ్చే శిక్షకులతో ప్రతి రోజూ శిక్షణ ఇస్తారు. వీరికి అవసరమైన క్రికెట్‌ కిట్లు, మ్యాట్లు, నెట్‌, బంతులు సమకూర్చనున్నారు. గ్రామీణ క్రీడాకారులు సాధారణ పిచ్‌లపైనే సాధన చేస్తారు. వేసవి శిబిరంలో వారికి మ్యాట్లు, నెట్లలో శిక్షణ ఇప్పిస్తారు. ఇందులో ప్రతిభచాటే క్రీడాకారులను వచ్చే విద్యా సంవత్సరంలో హెచ్‌సీఏ నిర్వహించే అండర్‌-14, 16, 20 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలకు హాజరయ్యే జట్లలో ఎంపిక చేయనున్నారు. బాగా రాణించే గ్రామీణ క్రీడాకారులకు జిల్లా కేంద్రంలోని సింగరేణి క్రీడా మైదానంలో మెరుగైన శిక్షణ కల్పిస్తారు. అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి రంజీ, ఐపీఎల్‌ పోటీల్లో పాల్గొనే అవకాశాలు దక్కుతాయి.


ఏడేళ్ల తర్వాత 

2016లో హెచ్‌సీఏ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల వేసవి శిబిరాలకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత కరోనా తదితర కారణాలతో వేసవి శిబిరాలు జిల్లాలో నిర్వహించలేకపోయారు. ఈ సారి మాత్రం భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది. హెచ్‌సీఏ, భూపాలపల్లి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆసక్తి గల విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి మే 20వ తేదీ వరకు నెల పాటు ఉచితంగా క్రికెట్‌ శిక్షణ శిబిరాన్ని కొనసాగిస్తారు.


ప్రతిభకు ప్రోత్సాహం..

- సురిమిల్ల శ్రీనివాస్‌, భూపాలపల్లి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

భూపాలపల్లితో పాటు  వరంగల్‌ జిల్లాలో రెండు చోట్ల వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాల నిర్వహణకు హెచ్‌సీఏ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 కేంద్రాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది. ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని సింగరేణి క్రీడా మైదానంలో ఉచితంగా క్రికెట్‌ శిక్షణ శిబిరం ప్రారంభం అవుతుంది.  ప్రతిభావంతులను ప్రోత్సహించి, జిల్లా నుంచి ఐపీఎల్‌, రంజీ పోటీల్లో భారత జట్టుకు ఎదిగేలా క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని