logo

‘ఈ’ సైకిల్‌ భళా..!

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్‌ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్‌ గార్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు.

Updated : 30 Apr 2024 06:02 IST

 ఈ-సైకిల్‌పై విద్యార్థి హరీష్‌
గార్ల (మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్‌ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్‌ గార్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. ఇతని తండ్రి నాగేశ్వరరావు ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్నారు. బాల్యం నుంచి ఆయన చేస్తున్న పనులను గమనిస్తూ పెరిగిన హరీష్‌ తాను కొత్తగా ఏదైనా తయారుచేయాలనే ఆలోచన చేశారు. మార్కెట్లో వస్తున్న ఈ బైకులను గమనించారు. మైనర్‌ అవడంతో ద్విచక్ర వాహనాన్ని నడపలేని పరిస్థితి. దీనికి తోడు ఓసారి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో పోలీసుల దృష్టిలో పడి చలానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడు తాను పెట్రోలు ఖర్చు లేకుండా కళాశాలకు వెళ్లాలని సంకల్పించారు. అతడి ఆలోచనను కార్యరూపంలో పెట్టారు. తండ్రి ఇచ్చిన రూ.3 వేలతో 24 వోల్టులు సామర్థ్యం ఉన్న రీఛార్జబుల్‌ బ్యాటరీని కొనుగోలు చేసి తనకున్న పాత సైకిల్‌కు బిగించారు. బ్యాటరీతో సైకిల్‌ నడిచేలా సాంకేతికతను రూపొందించారు. మూడు గంటలపాటు బ్యాటరీ ఛార్జింగ్‌ చేస్తే ఈ సైకిల్‌తో 15 కిలోమీటర్లు మేర ప్రయాణం సాగించేలా తయారుచేశాడు. కొన్నాళ్లుగా ఈ సైకిల్‌తో గార్లలోని ప్రభుత్వ కళాశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో కూడిన ఈ సైకిల్‌ను తయారు చేసిన తనను మిత్రులు, అధ్యాపకులు అభినందించారు. గ్రామస్థులు ఇతని సాంకేతికతను ప్రశంసిస్తున్నారు.

ఈ సైకిల్‌ తయారు చేసిన హరీష్‌ను గోపాలపురం ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వీరభద్రం తక్కువ ధరలో గడ్డి కోసే యంత్రం, కలుపుతీసే యంత్రాన్ని తయారు చేసే విధంగా ప్రోత్సహించారు. త్వరలో ఆ పరికరాలను తయారు చేయనున్నట్లు హరీష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని