logo

నీటి కుంట.. తీరును తంటా!

మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Published : 30 Apr 2024 03:30 IST

నీటి కుంటల నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు
న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో మనుషులే కాకుండా జంతువులు, పశుపక్ష్యాదులు తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీటి నిల్వ, సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్‌(నీటి కుంటల) నిర్మాణం చేపడుతున్నారు. వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టేలా అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో నీటి కుంటలను నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు అడవిలోని జంతువులు, పక్షులకు, చెట్లకు సరిపడా నీరు అందనుంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 205 ఫారం పాండ్స్‌(నీటి కుంటల) నిర్మాణ పనులు చేపడుతున్నారు.

 కూలీలకు ఉపాధి

 ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటల నిర్మాణం చేపట్టడంతో నీటి నిల్వలు, నీటి విస్తీర్ణం పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. వరద నీరు కుంటల్లో నిల్వ ఉండటంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పథకం ద్వారా కూలీలకు సరిపడా పనులు కల్పించినట్లవుతోంది. వేసవిలో అటవీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా జంతువులు, పక్షులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా నీటి కుంటలు ఉపయోగపడనున్నాయి. వ్యవసాయ రైతులకు కూడా పంట పొలాల్లో నీటి కుంటలను నిర్మించనున్నారు.

గ్రామ సభలో తీర్మానాలు

జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 205 నీటి కుంటల నిర్మాణం జరుగుతోంది. కొన్ని నిర్మాణ పనులు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నీటి కుంటలను ఏ ప్రదేశంలో నిర్మిస్తే వరద నిల్వ ఉంటుంది..? ఎక్కడ నిర్మిస్తే జంతువులతో పాటు పశువులు, ఇతర జీవులకు అవసరం అవుతుందనేది గ్రామ సభలో తీర్మానం చేస్తారు. అనంతరం అటవీ శాఖ అనుమతులతో నీటికుంటల నిర్మాణం చేపడుతున్నారు. కుంటల నిర్మాణం ఎక్కువ మొత్తంలో చేపట్టడంతో అటవీ, జంతు సంరక్షణతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కూలీలకు ఉపాధి లభిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


జల సంరక్షణకు ఎంతో ఉపయోగం
-నరేశ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

కమ్యూనిటీ వాటర్‌ హార్వెస్టింగ్‌(నీటి సేకరణ) ఫారం పాండ్స్‌ నిర్మాణంతో అటవీ ప్రాంతాల్లో జల సంరక్షణ, భూగర్భ జలాలు పెరగడంతో పాటు జీవాలకు నీరు అందుతుంది. నీటి కుంటల సమీపంలోని వృక్షాలకు సైతం సమృద్ధిగా నీరు అందుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లోని నీటి కుంటల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కూలీలకు కూడా ఈ పనులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని