logo

భువనగిరి బరిలో 39 మంది

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు.

Published : 30 Apr 2024 03:33 IST

స్వతంత్రులకు గుర్తులు కేటాయించిన అధికారులు

ఈనాడు, నల్గొండ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. భువనగిరిలో 39 మంది అభ్యర్థులు మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీ-ఫాంతో నామినేషన్‌ వేసిన వారిని మినహాయించి బరిలో ఉన్న చిన్న, రిజిస్టర్డ్‌, స్వతంత్రులకు అధికారులు గుర్తులు సైతం కేటాయించారు.

 భువనగిరి స్థానానికి మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో 10 మంది అభ్యర్థుల నామపత్రాలను అధికారుల సరైన వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సోమవారం నాటికి 51 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా...12 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. చివరకు 39 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి బరిలో నిలిచారు. ఈ స్థానంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌లో మూడు ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 ప్రధాన పార్టీల్లో గుబులు

భువనగిరిలో మూడు ఈవీఎంలు ఏర్పాటు కానుండటంతో వృద్ధులు, నిరక్షరాస్యుల ఓట్లు ఎవరికి పడుతాయోనన్న ఆందోళన నెలకొంది. ఉదాహరణకు ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి గుర్తు తొలి ఈవీఎం రెండో స్థానంలో ఉంటే..ప్రచారంలో ఈవీఎంలలో రెండో స్థానంలో ఉన్న గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆ అభ్యర్థి, పార్టీ నాయకులు ప్రచారం చేస్తారు. తీరా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేటప్పటికీ రెండు, మూడు ఈవీఎంలు కనిపిస్తే ఏ ఈవీఎంలోని రెండో స్థానమో కొంత మందికి అర్థం కాక.. ఆ ఓట్లు ఇతరులకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనిని పసిగట్టి రానున్న పది రోజుల ప్రచారంలో ఈవీఎంలలో గుర్తులతో పకడ్బందీగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. తుది బరి తేలిపోవడం, పోలింగ్‌కు మరో పది రోజుల వరకే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దింపడంతో పాటూ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని