logo

ఓటేయడానికైనా ఎలా రావాలి...!

తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్‌ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు

Published : 30 Apr 2024 03:46 IST

రైలు జనరల్‌ బోగీల సంఖ్యను పెంచితే మేలు

అభ్యర్థులూ ఈ సమస్య పరిష్కారం మీ చేతుల్లోనే..

 

  జనరల్‌ బోగీలో కిక్కిరిసిన జనం

తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్‌ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు. సంకలో పిల్లను సీటు కిందకు తోసి, మరో సీటు కిందకు తల్లి దూరుతుంది. పండు ముసలి లోనికి ఎక్కిందో లేదో, ఎక్కినా ఆ జనంలో ఎక్కడ ఉందో తెలియదు. అయినా ప్రయాణం చేయాలి, గమ్యం చేరాలి..

 ‘‘ఉపాధిని వెతక్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్లిన ఉమ్మడి వరంగల్‌వాసులు వచ్చే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి రావాలంటే ఈ జనరల్‌ బోగీలను ఆశ్రయించాల్సిందే. కాలు పెట్టే పరిస్థితి లేకపోతే ఎలా రావాలని మదనపడడుతున్నారు.’

 దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల జనరల్‌ బోగీలలో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరుగుదొడ్డిలో కూర్చుని.. దాని తలుపు వద్ద తల వాల్చి, ఒక కాలుపై నిలబడి కష్టంగా సాగిపోతున్నారు. లోపల స్థలం లేక తలుపు వద్ద కూర్చుని ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన వారు ఎందరో. అయినా రైల్వే కరుణించదు. అవే మూడు బోగీలలో ప్రయాణం చేయాల్సిందే.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి రైలులో ఐదు అంతకంటే ఎక్కువ సాధారణ బోగీలు ఉండేలా కృషి చేయాలని.  ఈ అంశాన్ని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుచుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. ఎంపీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంపై ఆమేరకు ఒత్తిడి తేస్తామని హామీ ఇవ్వాలని.. గెలిచాక ఆ దిశగా పార్లమెంటులో గళమెత్తాలని కోరుతున్నారు.

  -న్యూస్‌టుడే, కాజీపేట

ఐదు బోగీల కోసం ఉద్యమం..

ఒకప్పుడు జనాభాకు అనుగుణంగా ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ముందు రెండు, వెనక రెండు సాధారణ బోగీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జనరల్‌ బోగీలను మాత్రం ఇంకా తగ్గించారు. కొన్ని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కేవలం మూడు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఐదు జనరల్‌ బోగీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హనుమకొండకు చెందిన డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ ఉద్యమం చేపట్టారు. ప్రధానమంత్రికి కోటి ఉత్తరాలు రాయాలని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతి రోజు జనరల్‌ బోగీలలో ప్రయాణం చేసే వారి నుంచి వివరాలు సేకరిస్తూ, ఫొటోలు తీస్తూ రైల్వే ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తున్నారు.


చేతిలో బిడ్డ, గర్భస్థ శిశువు మరణించారు..  - పరికిపండ్ల అశోక్‌

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా నిండు గర్భిణి తన కుమార్తెతో కలిసి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి ప్రయత్నించి కింద పడి గాయపడ్డారు. తలకు తీవ్రగాయం కావడంతో ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా మరణించింది. ఈ సంఘటన నన్ను కలచివేసింది. అందుకే రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచాలని ఉద్యమం ప్రారంభించాను.


మా ప్రభుత్వంలో ఇది సులువు
- భాజపా అభ్యర్థి అరూరి రమేష్‌

కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి ప్రయాణికుల కష్టాలను తీర్చడం నాకు సులువుగా ఉంటుంది.టికెట్ల జారీకి అనుగుణంగా రైళ్లలో జనరల్‌ బోగీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తాను.  


పార్లమెంటులో గళమెత్తుతా  
- కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య

గెలవగానే ముందుగా రైల్వే సమస్యలపైనే గళమెత్తుతా. ప్రయాణికుల కష్టాలను వినిపించి రైళ్ల సంఖ్య, దూర ప్రాంత రైళ్లలో జనరల్‌ బోగీలను పెంపు కోసం కృషి చేస్తాను.


ప్రయాణం ప్రజల హక్కు
- భారాస అభ్యర్థి సుధీర్‌కుమార్‌

టికెట్‌ కొన్న ప్రతి ప్రయాణికుడికి సుఖమయమైన ప్రయాణం రైల్వే కల్పించాలి. ఇలా చేయని పక్షంలో  విఫలమైనట్లే...  లోక్‌సభలో జనరల్‌ బోగీల మీద గళమెత్తుతాను.
 జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా అవే ఉంటున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఫిర్యాదులకు : రైల్వే ఉచిత సహాయవాణి నెంబరు 139,
ట్విటర్‌ ఎక్స్‌ ఖాతాలు: Indian railways,south central railway, DRM secundrabad division, DRM vijayawada.ఇప్పటి వరకు ఇటీవల హసన్‌పర్తి, ఉప్పల్‌, పెండ్యాల రైల్వే స్టేషన్ల మధ్య 15 రోజుల వ్యవధిలోనే నలుగురు ప్రయాణికులు తలుపుల వద్ద ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మరణించారు.  ఎందరో దివ్యాంగులుగా మారారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని