logo

పరీక్షే జీవితం కాదు.. తప్పితే మళ్లీ రాద్దాం!

జీవితం అంటే మంచి-చెడు, తీపి-చేదు, ఆనందం-విషాదం. ఎంతటి వారికైనా ఆటుపోట్లు తప్పవు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైంది కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరీక్షల్లో తప్పిన వారు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం.

Published : 30 Apr 2024 06:52 IST

నేడు పదో తరగతి ఫలితాల విడుదల

జీవితం అంటే మంచి-చెడు, తీపి-చేదు, ఆనందం-విషాదం. ఎంతటి వారికైనా ఆటుపోట్లు తప్పవు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైంది కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరీక్షల్లో తప్పిన వారు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం. మనం బతికి మనల్ని నమ్ముకున్న వారికి అండగా నిలవాలి. మంగళవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో ఫెయిలైతే సప్లిమెంటరీ.. తక్కువ మార్కులొస్తే ఇంప్రూవ్‌మెంటు పరీక్షలు రాద్దాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ స్ఫూర్తిని విద్యార్థుల్లో  రగిలించాలి.

న్యూస్‌టుడే, డోర్నకల్‌  

‘మార్కులు, ర్యాంకులు జీవితం కాదు. ఇతరుల ప్రతిభతో పోల్చుతూ మీ పిల్లలను నిందించొద్దు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే రేపటి రోజున గొప్ప వాళ్లు కావొచ్చు. పరీక్ష ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే పిల్లల్లో మనోధైర్యం నింపండి. ఫెయిలయ్యారని సూటి పోటి మాటలతో చులకన చేయొద్దు. ఇంటా బయటా మీరే స్నేహితులు, మార్గదర్శకులు అవ్వండి. సప్లిమెంటరీలో తేల్చుకుందామని భరోసా కల్పించండి.’

తల్లిదండ్రులనుద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం


తల్లిదండ్రులకు తీరని శోకం

  • ఇటీవల వెలువడిన ఇంటర్‌ పరీక్షల్లో తప్పామని ఉమ్మడి జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మీద ఎన్నో కొండంత ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.
  • మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిల్కోడు గ్రామానికి చెందిన విద్యార్థిని(17) ఆరేపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో బైపీసీ చదువుతోంది. బోటనీ పరీక్ష తప్పడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్‌ అవుతుందనుకున్న కుమార్తె జీవితం ఆర్ధాంతరంగా ముగియడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన మాటలకు అందనిది.
  • మహబూబాబాద్‌ మండలం రెడ్యాల వాసి(16) సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఎకనామిక్స్‌లో ఫెయిల్‌ కావడంతో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వీరిది నిరుపేద కుటుంబం. వ్యవసాయం జీవనాధారం. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె డిగ్రీ చదువుతోంది.
  • మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో ఇంటర్‌ విద్యార్థిని(17) రెండు సబ్జెక్టుల్లో తప్పడంతో ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుంది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

కుటుంబ సభ్యుల పాత్ర క్రీయాశీలకం...

ఫలితాలు వెలువడే సమయానికి విద్యార్థులు ఇళ్లలోనే ఉంటారు. పరీక్షల్లో తప్పిన పిల్లలకు ధైర్య చెప్పాల్సింది కుటుంబ సభ్యులే. పిల్లలను ఒంటరిగా వదలొద్దు. వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలి. వారికి ప్రముఖుల స్ఫూర్తిదాయక జీవితాలను వివరించాలి.

విద్యార్థులూ... వివేకం చూపండి

ఆత్మహత్య వల్ల ఎంతో విలువైన జీవితం అర్ధాంతరంగా ముగుస్తుంది. దీనికితోడు మీపై ఆశలు పెట్టుకున్న కుటుంబం రేపటి రోజున రోడ్డున పడుతుంది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్లతో ప్రపంచాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతికూలతను ఎదుర్కోవడానికి ధైర్యంగా నిలవకపోతే ఎలా..? మార్కులు, ర్యాంకులు రాకపోయినా... తల్లిదండ్రులు మందలించినా మీరు ఎవరికీ భారం కాకుండా జీవించవచ్చు.


ప్రయత్నించి సివిల్స్‌ సాధించి..  

వరంగల్‌ శివనగర్‌ నాలుగు జెండాల ప్రాంతానికి చెందిన కోటే అనిల్‌కుమార్‌ సివిల్స్‌-2023 ఫలితాల్లో 764 ర్యాంకు సాధించారు. అందరిలాగే కష్టపడి చదువుకున్న అనిల్‌కుమార్‌ మొదటి ప్రయత్నం 2021లో మంచి ర్యాంకు సాధించలేకపోయారు. అయినా నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పట్టుదలతో చదివారు. తనకు వచ్చిన ర్యాంకుతో కోల్‌కతాలో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్్స)గా ఉద్యోగం సంపాదించారు. అక్కడ పనిచేస్తూనే.. చదువుకుంటూ 2023 సివిల్స్‌ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించారు.  పట్టుదలగా ప్రయత్నిస్తే  ఎంతకష్టమైనా విజయం సాధించొచ్చని ఆయన అంటారు.  

న్యూస్‌టుడే, శివనగర్‌


ఫెయిలయ్యానని కుంగిపోలేదు...

మున్నీ షేక్‌, ప్రత్యేక అధికారి, కేజీబీవీ, డోర్నకల్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడటం నన్ను తీవ్రంగా కలచివేసింది. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల మీ కుటుంబ సభ్యులకు ఎంతటి మానసిక క్షోభని కలిగిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. సమాజంలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. చదువు లేకున్నా ఉన్నతంగా బతుకుతున్న వారెందరో మన చుట్టూ ఉన్నారు. నేను 2002లో ఇంటర్‌లో కామర్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. అలాగని కుంగిపోలేదు. పట్టుదలతో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత సాధించాను. భర్త షేక్‌ ఖాసిం ప్రోత్సాహంతో ఎంఏ(పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఈడీ చేశాను. 2013లో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్నా. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. దీనికి నా జీవితమే ఉదాహరణ.


‘మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు. కష్టాల్లోనూ ముఖంపై చిరునవ్వు చెదరకుండా ఉన్న వారే జీవితాన్ని గెలిచినట్లు’ 

స్వామి వివేకానంద

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని