logo

వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్‌ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు.

Published : 01 May 2024 05:53 IST

పరకాల, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్‌ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. వివరాలివి.. మధుసూదన్‌ తన ఇంటి ఎదురుగా ఉన్న చెనుమల్ల సమ్మయ్య వద్ద వ్యాపార అవసరాల కోసం వివిధ సందర్భాల్లో రూ.10 లక్షల అప్పు తీసుకొని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. మధుసూదన్‌ అసలు, వడ్డీ చెల్లించకుండా మధుసూదన్‌ కాలయాపన చేస్తుండడంతో సమ్మయ్య పరకాలకు చెందిన రిపోర్టర్‌ కానుగంటి కరుణాకర్‌ను సంప్రదించారు. డబ్బులు ఇప్పిస్తే కరుణాకర్‌కు రూ.50 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు గత నెల 22న కరుణాకర్‌.. పరకాలకు చెందిన మేకల దిలీప్‌, బొచ్చు రమేష్‌, దండ్రె వెంకటేష్‌లతో కలిసి మధుసూదన్‌ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. చౌట్‌పర్తి శివారులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లు ప్రామిసరీ పత్రంపై సంతకాలు చేయించుకున్నారు. రెండు గంటల అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో మధుసూదన్‌ను వదిలిపెట్టారు. దీనిపై మధుసూదన్‌ భార్య సుగుణ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దిలీప్‌, రమేష్‌, వెంకటేశ్‌, కరుణాకర్‌లతో పాటు చెనుమల్ల సమ్మయ్య, ఆయన కుమారుడు అనీల్‌పై కేసు నమోదవ్వగా వెంకటేష్‌ మినహా మిగతా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద కారుతో పాటు ప్రామిసరీ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.


పోక్సో కేసులో న్యాయవాదికి జైలు

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే : బాలికపై అత్యాచారానికి పాల్పడిన న్యాయవాదికి అయిదు సంవత్సరాల మూడు నెలల జైలు, రూ.11 వేల జరిమానా చెల్లించాలని శిక్ష విధిస్తూ మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి హెచ్‌. నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. 2023 అక్టోబర్‌ 3వ తేదీన డోర్నకల్‌కు చెందిన న్యాయవాది తేజావత్‌ రమేష్‌ బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి అక్టోబర్‌ 4న డోర్నకల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఐ ఉపేందర్‌ రావు పర్యవేక్షణలో అప్పటి ఎస్సై ఝాన్సీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ 2023, నవంబర్‌ 6న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షించగా సీఐ ఉపేందర్‌ రావు ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి 11 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. పీపీ కీసర పద్మాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌ కేసు పూర్వాపరాలు పరిశీలించి న్యాయవాది రమేష్‌కు పైవిధంగా శిక్షవిధిస్తూ తీర్పునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని