logo

ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!

రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది.

Updated : 05 May 2024 11:04 IST

నేనేం పాపం చేశాను.. బతికుండగానే కర్కశంగా భూమిలో పూడ్చారు.. ముక్కుపచ్చలారని నా ముఖం చూస్తే మీకు ముద్దు రాకపోవచ్చు.. ఉసురు తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆడబిడ్డను మహాలక్ష్మిలా కొలుస్తారని అంటారు.. తల్లి గర్భంలో ఇలాంటి మాటలు విని ఎంతో మురిసిపోయా.. ఆడ బిడ్డగా పుడుతున్నానని పులకించిపోయా..
నన్నెంతో అల్లారుముద్దుగా చూసుకుంటారని ఆనందపడ్డా.. నేనేం నేరం చేశానని బొడ్డు తాడు తీయకుండానే మట్టిలో కలిపేయాలనుకున్నారు.. తల్లి పొత్తిళ్లలో నుంచి లాక్కొచ్చిన ఆ రాకాసి చేతులు ఎవరివి? మానవత్వం ఉన్నవాళ్లు నన్ను బతికించారు.. అమ్మ పాలు తాగాల్సిన నేను ఆసుపత్రిలో ఒంటరి పోరాటం చేస్తున్నా.. మట్టిలో నుంచి పుట్టిన సీతలా నేను అవనిజ అవుతా.. మట్టిలో మాణిక్యమై ఆడపిల్లల గొప్పదనం చాటిచెప్పి సరికొత్త చరిత్ర సృష్టిస్తా!


రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. నేడు ఎవరో రాక్షసులై బిడ్డను శాపంగా భావించి మట్టిలో పాతిపెట్టారు. మానవత్వం బతికున్న మనుషుల కంట పడడంతో కొన ఊపిరితో ఆ పసిగుడ్డు బతికింది. ఓ లారీ డ్రైవర్‌, ఉపాధి కూలీలు, పోలీసులు అంతా చలించిపోయి ఈ కలియుగ అవనిజకు పునర్జన్మ ఇచ్చారు. మృత్యుంజయురాలై          ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  

ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, దామెర

కాపాడింది లారీ డ్రైవర్‌..

ఈ పసిపాపను ఉదయం 9.05 గంటలకు జాతీయ రహదారి పక్కన మొదటగా చూసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రాందినయ్‌. ఆయన చూసి ఉండకపోతే ప్రాణాలు దక్కేవి కాదు. మట్టిలో కాళ్లు కదులుతున్న ఆనవాళ్లు చూసి వెంటనే స్పందించి మట్టి తొలగించి పాపను బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తగిన సమయంలో ఆసుపత్రికి పంపడంతో ఆ నవజాత శిశువు మృత్యుంజయురాలైంది.


కాళ్లు కదులుతుంటే చూశా

- రాందినయ్‌,  ట్యాంకర్‌ డ్రైవర్‌

ట్యాంకర్‌లోకి నీటిని నింపుతున్నాను. ఆ పక్కనే  మట్టిలోనుంచి కాళ్లు, చేతులు కదులుతూ ఉండడంతో ఒక్కసారిగా భయపడ్డాను. వెంటనే తేరుకుని మట్టిని తొలగించాను. ఓ ఆడశిశువు కనిపించింది. నా దగ్గర ఉన్న తువ్వాలలో పడుకోబెట్టాను. అక్కడే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలిచాను. వారు, తర్వాత పోలీసులు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారి పక్కనే శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పసిపాపను చూసిన వారంతా  కన్నీరు పెట్టుకున్నారు. ఈ దీనగాథ విన్నవారు ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ రాకాసులు ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  పాప ఆరోగ్యం మెరుగవ్వాలని  దేవుళ్లకు దండాలు పెట్టారు. ఈ ఘటనపై ఊరుగొండ అంగన్‌వాడీ టీచర్‌ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల విచారణ..

ఈ ఘటనకు కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఊరుగొండ, ఒగ్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పాపను ఎవరు ఎటు నుంచి తీసుకెళ్లారనే కోణంలో విచారణ ప్రారంభించారు.  విచారణాధికారిగా ఉన్న ఎస్‌ఐ అశోక్‌ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకున్నామని, పాపను కర్కశంగా పాతిపెట్టిన నిందితులు ఎవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ పసిపాప ఎనిమిది నెలలకే జన్మించినట్టు వైద్యులు పోలీసులకు తెలిపారు. దీంతో దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాల్లో ఆశా వర్కర్ల ద్వారా గర్భిణుల జాబితా సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. 8 నెలల గర్భవతులు ఎంత మంది ఉన్నారు? శనివారం ఎన్ని కాన్పులు జరిగాయి? ఆయా పిల్లలు ఎక్కడున్నారో చూసి నిందితులను పట్టుకునే వీలుందని శాయంపేట ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌రావు తెలిపారు.  


ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు

పన్నెండేళ్లలోపు పిల్లల్ని పెద్దలు వదిలేసి వెళితే సెక్షన్‌ 317 కింద వారిపై కేసు నమోదు చేస్తారు. న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తుంది.  వదిలేసిన పిల్లలు చనిపోతే మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్షను పెంచుతారు. శనివారం ఊరుగొండ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు 317 కింద కేసు నమోదు చేశారు.


ఎంజీఎంలో మెరుగైన చికిత్స

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలోని పిల్లల వార్డులో వైద్యులు ఆ నవజాత శిశువుకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అత్యవసర విభాగంలో ఇంక్యుబేషన్‌ బాక్సులో పెట్టి  ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూస్తున్నారు. బయట వారెవరూ చూసేందుకు అనుమతించడం లేదు. పాప ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది ఆదివారం ఒక స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.


వద్దనుకుంటే శిశుగృహకు ఇవ్వొచ్చు

- కొలిశెట్టి వసుధ, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌, వరంగల్‌

తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు వద్దనుకుంటే శిశుగృహకు ఇస్తే తీసుకుంటాం. వారి ఆలనాపాలనా  ప్రభుత్వమే చూస్తుంది. పెంచలేని పరిస్థితిలో ఉన్నామని పిల్లలను తెచ్చి ఇచ్చినా స్వీకరిస్తాం. రెండు నెలల వరకు సమయం ఇస్తాం. ఆ లోపు మనసు మార్చుకుంటే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదా శిశుగృహ నిర్వాహకులే బాధ్యత తీసుకుంటారు. ‘కారా’ ద్వారా ఎవరైనా దత్తతకు దరఖాస్తు చేస్తే వారికి అప్పగిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని