logo

రైతుల దరి చేరని భూసార పరీక్షలు

దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి.

Published : 06 May 2024 06:12 IST

సద్వినియోగం చేసుకుంటే ఎంతో మేలు

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. సాగు ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలే శరణ్యం. అలాగే పంట దిగుబడి పెరుగాలంటే భూములు సారవంతంగా ఉండాలి. గత నాలుగేళ్లుగా  పరీక్షలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో అన్నదాతలు ఎవరికి తోచినట్లు, వారి వారి సౌలభ్యతలను బట్టి ఎరువులను వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలను పొందలేక పోతున్నారనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత వేసవిలో పంటలకు తాత్కాలిక విరామం ఏర్పడటంతో రైతులు ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. పరీక్షల నిర్వహణ జిల్లాలో పూర్తిగా నిలిచిపోయిన తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

సాగు ఇలా..

జిల్లాలో సాగుకు అనుకూలమైన 3.90 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.20 లక్షలు తరి, 1.70 లక్షల ఎకరాల మెట్ట భూములున్నాయి. వీటిలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుసెనగ పంటలను పండిస్తున్నారు. గత 7-8 ఏళ్లుగా రైతులు సాగుకు విరామం లేకుండా రెండు పంటలను పండిస్తున్నారు. దీంతో భూములు సారాన్ని కోల్పోతూ నిస్సారమవుతుండటంతో ప్రస్తుత యాసంగి దిగుబడి తగ్గుముఖం పట్టిందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటగానే..

సాగు రంగానికి ప్రాధాన్యత కల్పించేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను క్లస్టర్లుగా విభజించి రైతు వేదికలను నిర్మించింది. వీటిలో అన్నదాతలకు సాగు రంగంలో మెళకువలు నేర్పటం, పంట సాగు విధానంపై అవగాహన కల్పించటం, భూసార పరీక్షలు నిర్వహించేందుకు మినీ కిట్స్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఆరంభంలో ఒకమారు పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌ ఏర్పాటు చేసి మిని కిట్స్‌, అందుకు అవసరమైన రసాయనాలను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.

జిల్లాలో మొత్తం రైతులు: 1.81 లక్షల మంది
సాగు భూమి: 3.90 లక్షల ఎకరాలు


నమూనాలు ఇస్తే.. ఫలితాలు అందిస్తాం..

- వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జనగామ

భూసార పరీక్షలతో భూమిలో లోపాలు తెలుసుకొని వాటిని రైతులు పూడ్చుకునేందుకు అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆసక్తి కల్గిన రైతులు భూమిని దున్నక ముందే భూమిలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి సంబంధిత ఏఈవో, ఏవోలకు అందజేయాలి. వాటిని వరంగల్‌కు తరలించి, అనంతరం వాటి ఫలితాలను అందజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని