logo

పరిశ్రమలు రావాలి.. ఓరుగల్లు మురవాలి

ఉమ్మడి వరంగల్‌ విద్యా కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి.. పరిశ్రమల్లో మాత్రం వెనుకబాటులో ఉంది. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో ఐటీ సంస్థలు ఏర్పాటుచేస్తే ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రానైట్, జౌళి, ఉక్కు తదితర రంగాల్లో ఇండస్ట్రీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో అనేక ఆహార శుద్ధి యూనిట్లు ప్రారంభించొచ్చు.

Updated : 06 May 2024 06:41 IST

ఉమ్మడి జిల్లాలో వనరులు పుష్కలం..
నేతలు కృషి చేస్తే  ఏర్పాటుకు అవకాశం..
ఈనాడు, వరంగల్‌, మహబూబాబాద్‌

ఉమ్మడి వరంగల్‌ విద్యా కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి.. పరిశ్రమల్లో మాత్రం వెనుకబాటులో ఉంది. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో ఐటీ సంస్థలు ఏర్పాటుచేస్తే ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రానైట్, జౌళి, ఉక్కు తదితర రంగాల్లో ఇండస్ట్రీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో అనేక ఆహార శుద్ధి యూనిట్లు ప్రారంభించొచ్చు. వరంగల్‌,  మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థులు దృష్టి సారిస్తే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుంది. ఈ నేపథ్యంలో  ప్రస్తుత పరిస్థితి, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కథనం.

తోళ్ల పరిశ్రమకు భద్రాచలంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో రవాణా ఇబ్బందులు ఉండవు. భద్రాచలం నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో లభించే తోళ్లను శుద్ధి చేసి చెప్పులను తయారు చేయవచ్చు. దుమ్ముగూడెం మండలంలో ఇందుకు అనువైన స్థలాలు ఉన్నాయి. వందలాంది మందికి   నిరంతరం ఉపాధి దొరుకుతుంది.

మిర్చి పరిశోధన కేంద్రం

ఉమ్మడి వరంగల్‌ మిర్చి సాగుకు పెట్టింది పేరు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తెగుళ్లు, వైరస్‌లతో భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు దిగుబడులు లేక నష్టపోతున్నారు. పరిశోధన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తే నేల స్వభావాన్ని బట్టి సాగుకు అనుకూలమైన కొత్తరకం మిర్చి విత్తన వంగడాలను ఉత్పత్తి చెయ్యొచ్చు. చీడపీడల నుంచి పంటలను కాపాడే మార్గాలను తెలుసుకోవచ్చు. ఆ దిశగా మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు  ఏడాది కిందట నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో 54 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు.  ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఆ పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గతంలో ఇక్కడే లెదర్‌ పార్కు పరిశ్రమ ఉండేది.

పామాయిల్‌ పరిశ్రమ

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల సాగును ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. దాదాపు 25 వేల ఎకరాల్లో ఇది సాగవుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల  దిగుబడులు వస్తున్నాయి. గతేడాది రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో తొర్రూరు మండలం గోపాలగిరిలో 86 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడ పామాయిల్‌ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025 డిసెంబరు లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.  ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దాంతో పంట  విక్రయానికి రైతులు ఖమ్మం వెళ్తున్నారు. పరిశ్రమ అందుబాటులోకి వస్తే  ఇక్కడే విక్రయించే అవకాశం ఉంటుంది. రవాణా కష్టాలు తప్పుతాయి.

గ్రానైట్‌ పరిశ్రమ

మహబూబాబాద్‌ ప్రాంతంలో బ్లాక్‌ గ్రానైట్‌ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. ఇక్కడ ముడిసరకు లభ్యత ఉంది. తొర్రూరు, నెల్లికుదురు, మరిపెడ, ఇనుగుర్తి, గూడూరు ప్రాంతం నుంచి ప్రతి నెల 3500 క్యూబిక్‌ మీటర్ల రాయి ఖమ్మం, ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు  తరలిస్తున్నారు.

ఆహార శుద్ధి కేంద్రాలు

మన వద్ద ఆహార శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ఎంతో అవకాశం ఉంది. నర్సంపేట, ములుగు, భద్రాచలం, మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో అనుకూలమైన ప్రాంతాలు, రవాణా పరంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు ఉన్నాయి. మహబూబాబాద్‌, తొర్రూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత హడావుడి చేసిన అధికారులు మధ్యలోనే దాన్ని పక్కన పెట్టారు.

ములుగు, ఇల్లెందు, నర్సంపేట, మహబూబాబాబాద్‌, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో గిరిజనులు బీడీ ఆకు సేకరణతో ఉపాధి పొందుతారు. భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం లేదా చర్లలో బీడీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది.


వరంగల్‌ దేశాయిపేట ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున తోళ్ల పరిశ్రమలు ఉండేవి. ఇప్పుడు వాటిని ఎత్తేయడంతో ఆ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఇతర రంగాలను ఎంచుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సైతం లెదర్‌ పార్కు పరిశ్రమ ఉండేది. దాన్ని కూడా ఎత్తేశారు. ఘన్‌పూర్‌లో తోళ్ల పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది.


ఐటీకి అడుగులు పడాలి

మడికొండ ఐటీ పార్కు

వరంగల్‌ నగరం హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్దది.  గతంలో  పలు ఐటీ  కంపెనీలు ఏర్పాటుచేశారు. మడికొండ పారిశ్రామిక వాడకు సమీపంలో ఐటీ పార్కును ప్రారంభించారు. ఇందులో సైయెంట్, టెక్‌మహీంద్రా లాంటి కంపెనీలు ఏర్పాటుచేశారు.  ఐటీ రంగాన్ని భారీగా విస్తరించాల్సిన అవసరం ఉంది. బహుళ జాతి కంపెనీలు ఇంకా రావాలి.


జౌళి పార్కు ఎంతో కీలకం

వరంగల్‌, మహబూబాబాద్‌ ప్రాంతాల్లో పత్తి సాగు ఎక్కువ. ఒకప్పుడు వరంగల్‌ అజంజాహి మిల్స్‌ వస్త్ర ఉత్పత్తికి ఎంతో పేరు పొందింది. దీని స్థానంలో వరంగల్‌ జిల్లాలో కాకతీయ మెగాజౌళి పార్కును గత భారాస ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గతేడాది దీనికి కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మిత్ర’ పథకం కింద రూ.200 కోట్లు ఇస్తామని ప్రకటించింది. జౌళి పార్కు ఏర్పాటైతే  20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా మరెన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి. 


‘ఉక్కు’ ఆశలు ఫలించేనా

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి లోబడి మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం వల్ల కాకుంటే  సింగరేణి సంస్థతో మాట్లాడి పరిశ్రమను పట్టాలెక్కిస్తామంటూ గత భారాస ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ తాజాగా ప్రకటించిన ప్రత్యేక మ్యానిఫెస్టోలో ఉక్కు పరిశ్రమ అంశాన్ని చేర్చింది.

  • సర్వే చేసిన ప్రాంతాలు: బయ్యారం, గూడూరు, గార్ల, నేలకొండపల్లి
  • ఖనిజం విస్తరించిన హెక్టార్లు: 15,342 హెక్టార్లు
  • ఖనిజం విలువ (సుమారు): రూ.16 లక్షల కోట్లు (భారత గనుల బ్యూరో(ఐబీఎం) అంచనా ప్రకారం)
  • ఇనుము శాతం: 60 నుంచి 65 శాతం
  • ఉపాధి అవకాశాలు: ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి

లెదర్‌ పరిశ్రమకు కృషి చేస్తా

- కడియం కావ్య, కాంగ్రెస్‌ అభ్యర్థి, వరంగల్‌

ఉమ్మడి వరంగల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా వనరులు ఉన్నాయి. దీనిపై ఇన్నాళ్లూ ఉన్న వారు దృష్టిసారించలేదు. ఘన్‌పూర్‌లో నాన్న కడియం శ్రీహరి సలహాలు, సూచనలతో లెదర్‌ ఇండస్ట్రీ మళ్లీ స్థాపించేందుకు ప్రయత్నిస్తా.


ఐటీ రంగం అభివృద్ధి చేస్తా

- అరూరి రమేశ్‌, భాజపా అభ్యర్థి, వరంగల్‌

మోదీ ప్రభుత్వం మూడోసారి కచ్చితంగా వస్తుంది. నేను కూడా వరంగల్‌లో గెలుపొందుతా. వెంటనే వివిధ పరిశ్రమలు కళకళలాడేలా చూస్తా. ఐటీ రంగం అభివృద్ధి జరిగితే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది.


విమానాశ్రయం ఎంతో ముఖ్యం

- డాక్టర్‌ మారపెల్లి సుధీర్‌కుమార్‌, భారాస అభ్యర్థి, వరంగల్‌

పరిశ్రమలు రావాలంటే మొదట విమానాశ్రయం తీసుకురావాలి. కేసీˆఆర్‌ గట్టి సంకల్పంతో ఓరుగల్లులో జౌళి, ఐటీ, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు పునాదులు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని