logo

హోరెత్తనున్న ప్రచారం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేశాయి.

Published : 06 May 2024 06:38 IST

రేపు వరంగల్‌లో సీఎం రేవంత్‌ రోడ్డు షో
8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక
ఈనాడు, వరంగల్‌

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేశాయి. ఇప్పుడు ప్రచారానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోసారి అగ్రనేతలతో ప్రచారం హోరెత్తించనున్నాయి. వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా  7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓరుగల్లు నగరంలో రెండు చోట్ల రోడ్డుషోలు, అనంతరం కూడలి సమావేశాల్లో ప్రసంగించనున్నారు. వరంగల్‌ తూర్పులో  సాయంత్రం 6.30 గంటలకు  షోలో పాల్గొని తర్వాత కూడలి సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాత్రి 7.45 గంటలకు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గమైన హనుమకొండలో రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత కూడలి సమావేశంలో ప్రసంగిస్తారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి వరంగల్‌ నియోజకవర్గంలో మడికొండ, భూపాలపల్లి సభల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో ఒక సభలో పాల్గొన్నారు. రేపు నగరంలో మరో దఫా ప్రచారం చేయనున్నారు.

8న సభకు భారీ ఏర్పాట్లు

మే 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌, మహబూబాబాద్‌ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ తరఫున మామునూరులోని లక్ష్మీపురంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో మామునూరు విమానాశ్రయంలో దిగి నేరుగా సభా స్థలికి చేరుకొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్‌లో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డు షో జరిగింది. కేంద్ర మంత్రి కిరణ్‌రిజుజు కూడా మానుకోటకు వచ్చారు. వరంగల్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి భాజపా అభ్యర్థికి మద్దుతుగా రోడ్డు షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రధాని సభకు కమల దళం సిద్ధమైంది.

ఇప్పటికే రెండు చోట్లకు భారాస అధినేత కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓరుగల్లు, మానుకోటల్లో జరిగిన రోడ్డు షోలు, కూడలి సమావేశాల్లో పాల్గొని భారాస అభ్యర్థులు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, మాలోతు కవితల తరఫున ప్రచారం చేశారు. హనుమకొండలో ఏప్రిల్‌ 28న, మహబూబాబాద్‌లో మే 1న ఆయన ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని