logo

బలగాల పాగా.. నలువైపులా నిఘా!

లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు.

Published : 07 May 2024 06:55 IST

కాటారంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర బలగాలతో బందోబస్తు చేపడుతున్నారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తుగా అనుమానితులను బైండోవర్‌ చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణకు వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నింపేందుకు పోలీసు బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్నారు. జిల్లాకు దశలవారీగా కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలు జిల్లాను ఆనుకుని ఉన్నాయి. ఇప్పటికే దండకారణ్యంలో నివురుగప్పిన నిప్పులా వాతావరణం నెలకొంది. నిత్యం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం గోదావరి వంతెన వద్ద, మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల పోలీసులు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కలిసి అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్నారు. మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న నేతలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.. ఇదివరకు ఎన్నికల్లో అల్లర్లు జరిగినవి, శాంతిభద్రతల సమస్య, హింసాత్మక ఘటనలు జరిగిన, జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లోని కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. భూపాలపల్లి పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 35, ఎల్‌డబ్ల్యూఈ(మావోయిస్టు ప్రాబల్య) పోలింగ్‌ కేంద్రాలు 23 ఉండగా, భూపాలపల్లి సబ్‌డివిజన్‌ పరిధిలో 53 సమస్యాత్మక, 7 ఎల్‌డబ్ల్యూఈ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు.

వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలు..

పోలింగ్‌ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్‌కాస్టింగ్‌తో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని శాటిలైట్‌ ద్వారా గుర్తించవచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏవైనా హింసాత్మక, ఇతర సంఘటనలు తలెత్తినా కంట్రోల్‌ రూం నుంచి వీక్షించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు.


భద్రతపరంగా అన్ని చర్యలు
-కిరణ్‌ ఖరే, ఎస్పీ

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్‌ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. పోలీస్‌ సిబ్బందితో ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుండటంతో సరిహద్దుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశాం. అనుమానితులను బైండోవర్‌ చేస్తున్నాం. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు తావివ్వకుండా ముందస్తు తనిఖీలు చేస్తున్నాం.


స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు
-భవేశ్‌ మిశ్రా, కలెక్టర్‌

ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భద్రతాపరంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పోలీసు సిబ్బందితో పాటు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నాం.. పోలింగ్‌ కేంద్రాల్లో నిరంతరం పర్యవేక్షించేలా వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని