logo

చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు

‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం.

Published : 09 May 2024 02:09 IST

‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం

జనగామ, న్యూస్‌టుడే: ‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ‘స్వీప్‌’ (సిస్టమెటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌)పేరిట ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సును మరింత విస్తృతం చేసేందుకు బుధవారం జనగామ జిల్లాలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఉపాధి హామీ కూలీలు, రైతులు, యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని నినదించారు.


ఓటు వజ్రాయుధం..

నర్మెట్ట: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉచిత కరాటే శిక్షణ నిర్వహిస్తున్నారు. కోచ్‌, శిక్షణార్థులతో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో బుధవారం ఓటరు చైతన్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోచ్‌ ఎర్రవెల్లి బాబు అధ్యక్షత వహించి మండల కేంద్రంలో గ్రామస్థులకు ఓటు చైతన్యంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు వజ్రాయుధమని, నిజాయతీగా ఓటు వేయాలని సూచించారు.


ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలి..

జఫర్‌గఢ్‌: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఓటర్లందరు సద్వినియోగం చేసుకోవాలని జఫర్‌గఢ్‌ తహసీల్దార్‌ అంజనేయులు అన్నారు. మండలంలోని ఉప్పుగల్లులో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సు గ్రామ కార్యదర్శి సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాయకులు మద్యం, డబ్బులు, ఇతర ప్రలోభాలకు లోనవకుండా, సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కూలీలతో ప్రతిజ్ఞ చేశారు.


ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకం..

పాలకుర్తి: నియోజకవర్గ కేంద్రంలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన నిర్వహించగా తహసీల్దార్‌ వెంకటేశం హాజరై మాట్లాడారు. సుమారు 200కు పైగా పాల్గొన్న ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, వినియోగించుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఏపీవో మంజుల, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుమార్‌ పాల్గొన్నారు.


దేశ పాలకులను నిర్ణయిస్తుంది..

జనగామ రూరల్‌: ఓటు వజ్రాయుధమని, సద్వినియోగం చేసుకొని సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ఎంపీడీవో సంపత్‌కుమార్‌ అన్నారు. ఓటు హక్కు- పౌరుల బాధ్యతపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శామీర్‌పేటలో ఉపాధి హామీ కూలీలకు చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో హాజరై మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దేశ పాలకులను నిర్ణయిస్తాయన్నారు. ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్‌ పాల్గొన్నారు.


నాకు తొలిసారిగా ఓటు వేసే అవకాశం వచ్చింది. ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ఓటు హక్కును వినియోగించుకుంటా.  ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, సేవ చేసే నాయకుడికే ఓటు వేస్తాను.

భార్గవ్‌ రాజు, పాలకుర్తి


విద్యార్థులు, యువత, విద్యావంతులు.. అందరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలి. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదయ్యేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లాలో అత్యధిక పోలింగ్‌ శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేలా చూడటం ఇక ఓటర్ల బాధ్యతే.

వినోద్‌కుమార్‌, స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని