logo

ఓరుగల్లులో కాషాయోత్సాహం

మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి.

Updated : 09 May 2024 05:46 IST

విజయవంతమైన భాజపా జనసభ
ఈనాడు, వరంగల్‌, సుబేదారి, మామునూరు, న్యూస్‌టుడే

మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి.

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో (ఎడమ నుంచి  కుడికి) భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌,  పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌ రావు, మహబూబాబాద్‌, వరంగల్‌ పార్టీ అభ్యర్థులు ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌, అరూరి రమేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు,  జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి,  వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. 

రంగల్‌ మామునూరు విమానాశ్రయం ఎదురుగా లక్ష్మీపురంలో బుధవారం ఓరుగల్లు జనసభ అట్టహాసంగా జరిగింది. వరంగల్‌, మహబూబాబాద్‌ భాజపా అభ్యర్థులు అరూరి రమేశ్‌, అజ్మీరా సీతారాంనాయక్‌లను గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ‘నమో’ ప్రసంగం కొనసాగింది. వరంగల్‌ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌, భారాసలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ 47 నిమిషాల పాటు మాట్లాడారు.

తెలుగులో ప్రారంభించి..

‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. తన స్వస్థలమైన అహ్మదాబాద్‌లో నగర దేవత భద్రకాళి మాత అని, వరంగల్‌లో భద్రకాళి మాతకు, రామప్ప మందిరానికి నా నమస్కారాలు అంటూ హిందీలో ప్రసంగం కొనసాగించారు.  

సభకు హాజరైన జనం

మామునూరులో దిగి..

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఓరుగల్లు సభకు మధ్యాహ్నం వచ్చారు.  కొద్ది దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి ప్రధాని ప్రత్యేక వాహనాల కాన్వాయ్‌లో చేరుకున్నారు. అజ్మీరా సీతారాంనాయక్‌ గిరిజనుల సంప్రదాయ శాలువాను మోదీ మెడలో వేసి సన్మానించారు. అరూరి రమేశ్‌ శాలువా కప్పి కాకతీయ తోరణం, మోదీ బొమ్మతో కూడిన జ్ఞాపికను అందజేశారు. వరంగల్‌ అధ్యక్షుడు గంటా రవికుమార్‌ ప్రధానికి భారీ గద అందజేశారు. వేదికపై ఉన్న నేతలంతా మోదీని సన్మానించారు.

  • జనసభకు 1400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ ఝా పర్యవేక్షించారు.
  • గంటన్నరకు పైగా: ప్రధాని మోదీ వరంగల్‌లో మొత్తం 1.35 గంటల పాటు ఉన్నారు.  మధ్యాహ్నం 12 గంటలకు  మామునూరు రన్‌వేపై దిగారు. 1:35 గంటలకు తిరుగు పయనమయ్యారు.

భాజపా శ్రేణుల్లో జోష్‌..

ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఓరుగల్లు కమలం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ సారి వరంగల్‌లో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి ఈ సభ కలిసొస్తుందని భావిస్తున్నారు.

స్థానిక అంశాల ప్రస్తావన

ఓరుగల్లు కాకతీయుల సామ్రాజ్య పుణ్యభూమి అని ప్రధాని మోదీ కొనియాడారు. భాజపా ప్రభుత్వం వరంగల్‌, మహబూబాబాద్‌ ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ములుగులో సమ్మక్క- సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశామని, వరంగల్‌లో పీఎం మిత్ర పథకం కింద జౌళి పార్కు నిర్మించామని, పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామని  ప్రస్తావించారు.


విమానాశ్రయం, కోచ్‌ ఫ్యాక్టరీ కావాలి
వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌

మూడోసారి ప్రధాని అయ్యాక వరంగల్‌కు మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను అందజేయాలి. ప్రజల చిరకాల కోరిక మామునూరు విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఇచ్చారు.  కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇచ్చిన టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేయాలి. వర్షాలు పడితే వరంగల్‌ నగరం నీట మునగకుండా అండర్‌ డ్రైనేజీ, భూపాలపల్లిలో రైల్వేలైన్‌, పాలకుర్తిలో టెక్స్‌టైల్‌ పార్కు మంజూరు చేయాలి.


కాంగ్రెస్‌ దేశానికి శత్రువు

మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు

వరంగల్‌, మహబూబాబాద్‌లో విజయం సాధించబోతున్నాం. రూ.9 వేల కోట్లతో ప్రధాన రహదారుల అభివృద్ధి, రూ.108 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించాం. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా భాజపా ముందుకు సాగుతుంది.  


ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలి

గరికపాటి మోహన్‌రావు జాతీయ కార్యవర్గ సభ్యులు

మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు మహబూబాబాద్‌, వరంగల్‌ భాజపా అభ్యర్థులు సీతారాంనాయక్‌, అరూరి రమేశ్‌లను గెలిపించాలి.


తెలంగాణ ద్రోహులపాలైంది

మహబూబాబాద్‌ అభ్యర్థి సీతారాంనాయక్‌

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ద్రోహుల పాలైంది. మేమే ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని మర్చిపోవాలి. దేశం, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ప్రజలు భాజపాకు మద్దతు తెలపాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని