logo

అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన జాన బాలచిట్టెమ్మ(35)కు తాడేపల్లిగూడేనికి చెందిన కృష్ణ చైతన్యతో 11 ఏళ్ల కిందట వివాహమైంది.

Published : 30 Jun 2022 04:53 IST

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన జాన బాలచిట్టెమ్మ(35)కు తాడేపల్లిగూడేనికి చెందిన కృష్ణ చైతన్యతో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరు జంగారెడ్డిగూడెం వేములవారి వీధిలో నివాసముంటున్నారు. ఇద్దరు సంతానం. కృష్ణ చైతన్య విద్యుత్తు గుత్తేదారుగా పనిచేస్తుంటారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడేవారని, బుధవారం ఉదయం సైతం గొడవపడగా మనస్తాపం చెంది గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని బాలచిట్టెమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు.అలాగే ఆమె మృతికి భర్త, కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనాస్థలికి ఎస్సై సాగర్‌బాబు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుప్రతికి తలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


పందిరిపల్లెగూడెంలో ..

కైకలూరుగ్రామీణం, న్యూస్‌టుడే: కొల్లేరు గ్రామమైన పందిరిపల్లెగూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇరువురు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు తన ఇళ్లు, ఆస్తి పంపకాలు మొత్తం భార్యకే చెందుతాయని తీర్పునిచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు సంబంధించిన కరెంటు తీగలను పట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే మృతిడికి విద్యుత్తు సంబంధిత పనులు వచ్చని విద్యుదాఘాతం చనిపోయినట్లు వస్తున్న సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తోందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. కట్టుబాట్ల నేపథ్యంలో వివరాలు తెలిపేందుకు స్థానికులు జంకుతున్నారు. ఇప్పటి వరకు ఈ సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని