logo

వంక.. కవురు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక గణాంకాలను బేరీజు వేసుకుని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

Published : 21 Feb 2023 05:09 IST

పశ్చిమ నుంచి  ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు
ప్రకటించిన వైకాపా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక గణాంకాలను బేరీజు వేసుకుని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. బీసీ ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను, కాపు సామాజిక వర్గానికి చెందిన వంక రవీంద్రనాథ్‌ పేర్లను ప్రకటించారు. క్షత్రియులకు ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. అటు స్థానిక సంస్థలు, ఇటు ఎమ్మెల్యేల కోటాలోనూ ఆ వర్గానికి అవకాశం చేజారింది. ప్రస్తుతం వైకాపా ప్రకటించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను గతంలో తెదేపా కూడా పశ్చిమ ప్రాంతంలోని ఉండి నియోజకవర్గానికి చెందిన పాందువ్వ శ్రీను, పాలకొల్లుకు చెందిన అంగర రామమోహన్‌కు కేటాయించారు. ఇదే తరహాలో వైకాపా కూడా ఒకటి ఓసీ సామాజిక వర్గానికి, మరొకటి బీసీలకు         కేటాయించింది.

ఇంకా దాఖలు కాని నామపత్రాలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామపత్రాలు దాఖలు కాలేదు. అభ్యర్థుల నుంచి నామ పత్రాలు స్వీకరించే ప్రక్రియను ఈ నెల 16 నుంచి ప్రారంభించారు. సోమవారం వరకు ఒక్కటి కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ పి.అరుణ్‌బాబు తెలిపారు.


జడ్పీ ఛైర్మన్‌ నుంచి...!

పాలకొల్లు, న్యూస్‌టుడే: పెనుమంట్ర మండలం పొలమూరు శివారు నాగళ్లదిబ్బకు చెందిన కవురు శ్రీనివాస్‌ వీరవాసరం మండలం నవుడూరులో కాంపౌండర్‌గా పనిచేశారు. ఆ మండలంలోని ఉత్తరపాలెం నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలుపొంది ఎంపీపీగా ఉన్నారు. అనంతరం ఆచంట నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడిగా, నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా పనిచేసి 2019 ఎన్నికల అనంతరం పాలకొల్లు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. డీసీసీబీ ఛైర్మన్‌గా దాదాపు ఏడాది పైబడి కొనసాగారు.  యలమంచిలి  జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై..ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.


తణుకు, న్యూస్‌టుడే: 2014లో వైకాపాలో చేరి నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా వంక రవీంద్రనాథ్‌ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ రాజకీయ పరిశీలకుడిగా ఉన్నారు. రెండేళ్ల కిందట చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ బాధ్యతలను ప్రభుత్వం ఇతనికి అప్పగించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంక రవీంద్రనాథ్‌ పేరును వైకాపా జాబితాలో ఖరారు చేసింది.


ఎమ్మెల్యే కోటాలో జయమంగళ

కైకలూరు, న్యూస్‌టుడే: ఇటీవల తెదేపాను వీడి వైకాపా తీర్థం పుచ్చుకున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్యే ల కోటాలో బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిగా ఖరారు చేశారు. 1999 నుంచి తెదేపాలో చురుకైన పాత్ర పోషించిన ఈయన ఇటీవల ఆ పార్టీని వీడి వైకాపాలో చేరారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం అధికంగా ఉన్న నేపథ్యంలో జయమంగళ ఎన్నిక లాంఛనం కానుంది. ఈ క్రమంలో సోమవారం జయమంగళ తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని